పితృ స్వామ్యంపై విద్యాబాణం

ABN , First Publish Date - 2020-06-07T05:43:28+05:30 IST

కథ... కథనం... అభినయం... విద్యాబాలన్‌ సినిమా అంటే పక్కాగా వీటన్నింటికీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆమె ప్రతి చిత్రం ఆకట్టుకుంటుంది. పాత్ర ఏదైనా అందులో పరకాయ

పితృ స్వామ్యంపై విద్యాబాణం

కథ... కథనం... అభినయం... విద్యాబాలన్‌ సినిమా అంటే పక్కాగా వీటన్నింటికీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆమె ప్రతి చిత్రం ఆకట్టుకుంటుంది. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసే విద్యాబాలన్‌  బాలీవుడ్‌లో విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్నది ఆమె చిన్నప్పటి కల. అది నెరవేరింది. 


మరి ఇప్పుడు..! పరిస్థితులు మారాయి. ‘వేదికలూ’ పెరిగాయి. బిగ్‌స్ర్కీన్‌కు పోటీగా డిజిటల్‌ తెరలు అలరిస్తున్నాయి. ఇవే విద్య ఆలోచనలను మలుపు తిప్పాయి. దానికి రూపమే ఆమె చేసిన తొలి లఘుచిత్రం ‘నట్‌ఖట్‌’. ఈ నెల 2న గ్లోబల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌ ‘వియ్‌ ఆర్‌ వన్‌’లో ఇది ప్రదర్శితమైంది. యూట్యూబ్‌లో ప్రీమియర్‌ అయిన ‘నట్‌ఖట్‌’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు... ఈ షార్ట్‌ ఫిలిమ్‌తో విద్య నిర్మాతగానూ మారారు. 


కథతో కనెక్ట్‌... 

మంచి కథ ఉంటే చాలు ఏ ‘తెర’కైనా కనెక్ట్‌ అయిపోతానని మరోసారి చెప్పకనే చెప్పారు విద్య. దర్శకుడు షాన్‌ వ్యాస్‌ లైన్‌ చెప్పగానే లఘుచిత్రమైనా... ఇమేజ్‌ని పక్కనపెట్టి ఆమె నటించారు. రోనీ స్ర్కూవాలా సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి అన్నుకంప హర్ష్‌, షాన్‌ వ్యాస్‌ కథా రచయితలు. అనాదిగా పాతుకుపోయిన పితృస్వామ్య పోకడలు, లింగ వివక్ష, పురుషహంకారం, గృహ హింసపై సంధించిన బాణం ‘నట్‌ఖట్‌’.  


హిందీలో ‘నట్‌ఖట్‌’ అంటే ఆకతాయి, తుంటరి అని! పితృస్వామ్యం వర్ధిల్లుతున్న ఇంట్లో... సోనూ అనే ఆకతాయి పిల్లాడి చుట్టూ తిరిగే కథ ఇది. విద్యది సోనూ తల్లి పాత్ర. ఒక గృహిణి. ఆడవాళ్లను ద్వేషించే ఆ ఇంటి మగవాళ్ల వైపు సోనూ ఆకర్షితుడవడం, వారిలా మాట్లాడటం అతడి తల్లిని ఆవేదనకు గురిచేస్తుంది. నిత్యం భర్త పెట్టే హింసను భరిస్తూ... తన తనయుడిని సరైన దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మగవాళ్లంటే ఎలా ఉండాలో... స్త్రీలపట్ల ఎలా ప్రవర్తించకూడదో చెబుతుంది. 


తల్లి పాత్రలో విద్య చక్కగా ఒదిగిపోయారు. సినిమాల్లో మంచి అవకాశాలొస్తున్నా ఉన్నట్టుండి షార్ట్‌ ఫిలిమ్‌ వైపు ఎందుకొచ్చారని అడిగితే... ‘‘నాకొక మంచి కథ దొరికితే మొబైల్‌ ఫోన్‌తో చిత్రీకరించడానికి కూడా వెనకాడను’’ అంటున్నారు విద్యాబాలన్‌. ‘నట్‌ఖట్‌’ కథ ఆమెకు అంతగా నచ్చింది. పిల్లలే కాదు... తల్లితండ్రులూ, ఉపాధ్యాయులూ, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది! 

Updated Date - 2020-06-07T05:43:28+05:30 IST