Abn logo
May 15 2020 @ 04:10AM

త్రైలోక్య దీపకో ధర్మః

ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే... ధర్మం మనల్ని రక్షిస్తుంది. కానీ, ఏది ధర్మం? అంటే.. అది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి.. కొడుకుగా తన తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించాలి. అది పుత్రధర్మం. అదే వ్యక్తి తన బిడ్డలు తప్పు చేసినప్పుడు మందలించి, వారిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అది అతడు తండ్రిగా పాటించాల్సిన ధర్మం. ‘అహింసా పరమో ధర్మః’.. అన్ని ధర్మాల్లోకీ ఉత్తమమైనది అహింస. ప్రాణికోటిని చంపడం, శారీరకంగా, మానసికంగా బాధించడం మహాపాపం. ఇతరుల మనసును నొప్పించకుండా ఉండడం ఉత్తమోత్తమ ధర్మం. భారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుతో ఆ ధర్మాన్ని గురించి ఇలా చెబుతాడు..


ఒరులేయవి యొనరించిన

నరవర అప్రియము తన మనంబునకగు, తా

నొరులకు నవి సేయకునికి!

పరాయణము పరమధర్మ పథములకెల్లన్‌


ఇతరులు ఏమిచేస్తే మన మనసుకు బాధకలుగుతుందో, మనం ఇతరులకు ఆ పనులు చేయకుండా ఉండడమే ఉత్తమోత్తమ ధర్మమని దీని భావం. పరుల మనసుకు బాధ కలిగించే అంశాలు చాలా ఉంటాయి. పరస్త్రీ వ్యామోహం, పర దూషణ, పర ధనాపహరణ, పర నింద, ఇతరులపై చాడీలు చెప్పడం, అసత్యారోపణలు చేయడం... ఇలాంటివన్నీ పరులకు అప్రియములై బాధను కలిగించేవే. అలాంటి పనులు చేయకుండా ఉండటమే ఉత్తమ వ్యక్తి లక్షణం. పర స్త్రీ వ్యామోహం నుంచి బయటపడాలంటే.. మహిళలందరినీ తల్లులుగా, సోదరీమణులుగా భావించడం నేర్చుకోవాలి.


వారిని ఆదిమాత అంశలుగా భావించాలి. వారి శ్రేయస్సును సర్వదా కాంక్షించాలి. కొందరు నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇతరులను ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు. అలాంటివారు.. ‘మంచిమాట మణులు కురిపిస్తుంది. చెడ్డమాట చేటు తెస్తుంది’ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పర ధనం కోరడం పాపహేతువుగా పరిగణించాలి. ఈ దురలవాట్ల ద్వారా ఎదుటివారి మనసును అనవసరంగా కించపరచడం కూడా ధర్మానికి హాని కలిగించే చర్యే. 


సత్యేన రక్షతే ధర్మోః, త్రైలోక్య దీపకో ధర్మః

అని ధర్మ ప్రయోజనాన్ని గూర్చి నీతిశాస్త్రం చెబుతుంది. సత్యం చేత ధర్మం ఉద్ధరింపబడుతుందని, మూడులోకాలనూ ప్రకాశింపజేసేది ధర్మమే అని దీని అర్థం. సత్యధర్మాలు రెండు దైవస్వరూపాలు. సత్యాన్ని పలికే వాడు ధర్మాన్ని అతిక్రమించడు. సత్కర్మలనాచరించి కర్మఫలితాన్ని సర్వేశ్వరునకర్పిస్తాడు. ఉత్తమగతులందుకొంటాడు. అందుకే అందరూ ధర్మాన్ని ఆచరించి ధర్మజ్ఞుల ఆకాంక్షను పాటించాలి. లోక క్షేమం కోసం పాటుపడాలి. సదా వర్ధిల్లాలి.

                                                    


                                             -విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య

Advertisement
Advertisement
Advertisement