విద్వేష ప్రసంగాలు

ABN , First Publish Date - 2021-12-29T09:18:09+05:30 IST

రెచ్చగొట్టే మాటలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ఈ దేశానికి కొత్తకాదు కానీ, వాటికి పాల్పడేవారికి రాజ్యమే అండగా నిలవడం, వెన్నుతట్టి ప్రోత్సహించడం ఇటీవల చూస్తున్నాం....

విద్వేష ప్రసంగాలు

రెచ్చగొట్టే మాటలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ఈ దేశానికి కొత్తకాదు కానీ, వాటికి పాల్పడేవారికి రాజ్యమే అండగా నిలవడం, వెన్నుతట్టి ప్రోత్సహించడం ఇటీవల చూస్తున్నాం. హరిద్వార్ లో ధర్మసంసద్ పేరిట ఇటీవల ఓ స్వామి నిర్వహించిన సమావేశంలో వక్తల ప్రసంగాలు దేశ భవిష్యత్తుపట్ల భయాన్ని కలిగించాయి. స్వతంత్ర భారతంలో ఇంతటి విద్వేషపూరిత ప్రసంగం ఎన్నడూలేదని చాలామందికి అనిపించింది. ప్రధాని నరేంద్రమోదీ మాటమాత్రంగానైనా ఖండించకపోవడం, హోం మంత్రి నోరువిప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊచకోతలకూ, మారణహోమానికీ బాహాటంగా పిలుపునిచ్చినవారిపై సూమోటో కేసు నమోదు చేసి, విచారణ జరిపి, శిక్షలు వేయండంటూ డెబ్బయ్ ఆరుమంది న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాశారు.


ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో, మూడురోజుల పాటు ముస్లింలపై విషం కక్కిన ధర్మసంసద్ అది. సాగుచట్టాలు వెనక్కుతీసుకున్నా, కాశీ కారిడార్ ఆరంభించినా యూపీ సహా మిగతా రాష్ట్రాల్లో నెగ్గుకొస్తామన్న నమ్మకం నేతలకు కలగక, మతవిద్వేషాన్ని మించిన మార్గం లేదని అనిపించి ఉండవచ్చు. హిందూ రక్షాసేన, హిందూ యువవాహిని వంటివి ఎవరి ఆశీస్సులతో నడుస్తున్నాయో, ఆ స్వామీజీల్లో కొందరి ఘనచరిత్రలేమిటో అందరికీ తెలుసు. మయన్మార్ తరహాలో సర్వవ్యవస్థలూ, సకల శక్తులూ ఒక్కటై ఊచకోతలుకోయాలని ఓ స్వామి కాంక్షించారు. ‘పరుల’ను ఈ దేశంలో లేకుండా చేయాలంటే చంపడం వినా మరోమార్గం లేదంటూ అందుకు ఎంతమందిని కూడగట్టాలో, ఎన్ని లక్షలమందికి ఎన్ని వందలమంది సరిపోతారో లెక్కలు కట్టారు ఓ సాధ్వి. రాజ్యాంగం, గాంధీలపై వారు చేసిన వ్యాఖ్యలు, పోలీసు, న్యాయవ్యవస్థల పట్ల వారికి ఉన్న చిన్నచూపు ఆవేదన కలిగిస్తాయి. ఈ ఉన్మాదుల వ్యాఖ్యలు ఎక్కడో ఉన్న మార్టినా నవ్రతిలోవాకు ఆగ్రహం కలిగించాయి కానీ, మనపాలకులకు పట్టలేదు. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ నోరుతెరిచి జోకు వేయకముందే, మనసులో ఏమున్నదో కనిపెట్టి కేసులుపెట్టగల దిట్టలకు ఈ ధర్మసంసద్ ప్రసంగాల్లో ఏ విషమూ కనిపించకపోవడం విచిత్రం. 


మత సంరక్షణ, హిందూ దేశ స్థాపన ముసుగులో ఈ దేశంలోని ఒక మతవర్గాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని పిలుపునిచ్చినవారిపై పోలీసులు అంత ఉదాసీనంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మారణాయుధాలు చేబూని ఊచకోతకోయాలని పిలుపునివ్వడమే కాక, వారిలో కొందరు ఆయుధాలు కలిగివున్నారని కూడా విమర్శలు వచ్చాయి. ఆశ్చర్యమేమంటే, ఈ విడియోలు ప్రపంచవ్యాప్తమై, దేశం అప్రదిష్టపాలైన నాలుగురోజుల తరువాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒక్క వ్యక్తిపైనే. ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పనిచేసి ఇటీవలే మతం మార్చుకున్న జితేందర్  నారాయణ్ త్యాగి అలియాస్ వసీమ్ రిజ్వీ పేరును మాత్రమే తొలుత ప్రస్తావించిన పోలీసులు, ఆ తరువాత మరో రెండుపేర్లను చేర్చారు. విడియోలో కనిపించిన ప్రతీవారినీ పిలిచిమరీ విచారిస్తామని చెబుతున్న పోలీసులకు ఈ వ్యవహారంలో ఎటువంటి హింస, హత్య జరగనందున చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టానికి ఇక్కడ చోటులేదని అనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నందున ఎవరినీ తొందరపడి అరెస్టులు చేయబోమని కూడా అంటున్నారు. తమను ప్రశ్నించినవారిపైన ‘ఉపా’ని ప్రయోగించి జైళ్ళలో కుక్కుతున్న పాలకులు ఏకంగా కోట్లాదిమంది హననానికి సంకల్పించినవారిపట్ల మాత్రం దయచూపుతున్నారు.


అధికారంలో ఉన్నవారు మద్దతు పలుకుతున్నందున పోలీసులు ఇటువంటి మతోన్మాదుల వ్యాఖ్యలను, ప్రసంగాలను పట్టించుకోవడం లేదు. మతాధారిత పౌరసత్వచట్ట సవరణ వద్దని నినదించినవారిమీద మాత్రం కేసులు నమోదవుతాయి. మూకదాడులకు పాల్పడినవారికి కూడా వెంటనే బెయిల్ వస్తుంది కానీ, హథ్రాస్ లో ఒక దళితబాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని వెలుగులోకి తెచ్చిన సిద్దిఖీ కప్పన్ వంటివారు మాత్రం ఏవేవో ఆరోపణలతో జైళ్లలోనే మగ్గుతుంటారు. అమృతభారతానికి ప్రమాదం సరిహద్దుల ఆవలినుంచి కాదనీ, ఈ దేశ మౌలిక విలువలను విచ్ఛిన్నం చేస్తున్నవారినుంచి అని గుర్తించాలి.

Updated Date - 2021-12-29T09:18:09+05:30 IST