దళిత కాలనీపై ప్రభుత్వ ప్రతాపం!

ABN , First Publish Date - 2021-10-20T06:12:23+05:30 IST

ఐదు దశాబ్దాలుగా ఉచిత విద్యుత్‌ పొందుతున్న దళిత కాలనీవాసులపై ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపింది.

దళిత కాలనీపై ప్రభుత్వ ప్రతాపం!
రహదారిపై బైఠాయించిన దళితవాడ వాసులు

 యాభైయేళ్లుగా ఇస్తున్న ఉచిత విద్యుత్‌ కట్‌.. 

 రహదారిపై దళితుల ఆందోళన

వీరులపాడు, అక్టోబరు 19 : ఐదు దశాబ్దాలుగా ఉచిత విద్యుత్‌ పొందుతున్న దళిత కాలనీవాసులపై ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపింది. వీరులపాడు మండలం అల్లూరులోని ఉత్తర దళితవాడ వాసులకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఉచిత విద్యుత్‌ అందించేందుకు కాలనీ మొత్తం విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయటంతోపాటు ప్రతీ ఒక్కరికీ కనెక్షన్లు ఇచ్చింది. నాటి నుంచి ఉచిత విద్యుత్‌ను పొందుతున్న కాలనీవాసులపై కక్షపూరిత ధోరణితో సోమ వారం సాయంత్రం విద్యుత్‌శాఖాధికారులు దళితవాడకు వెళ్లే విద్యుత్‌ కనెక్షన్‌ను కట్‌ చేసి అంధకారంలో ఉండేలా చేశారు. ఆవేదనతో దళితులు మంగళవారం సాయంత్రం గ్రామంలోని రహదారిపై ఆందోళనకు దిగారు. కాలనీ వాసులు మాట్లాడుతూ, ఎటువంటి సమాచారం ఇవ్వ కుండా, నోటీసులు లేకుండా, పంచాయతీ కార్యాలయంలో ఎటువంటి సమాచారం చెప్పకుండా, పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వకుండా అధికారులు దళితులను లక్ష్యంగా చేసుకుని అంధకారంలోకి నెటేశారన్నారు. ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది పాలకులు తమపై చర్యలు తీసుకోలేదని, ప్రస్తుత పాలకులు దళితులమని తమను చిన్నచూపు చూస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కాలనీకి విద్యుత్‌ను పునరుద్ధరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు వెనకాడేది లేదంటూ హెచ్చరించారు. 

ఆందోళన చేస్తున్న కాలనీవాసులను సముదాయిం చేందుకు నందిగామ రూరల్‌ సీఐ వై.వి.నాగేంద్రకుమార్‌, వీరులపాడు ఎస్సై సోమేశ్వరరావు, కంచికచర్ల ఎస్సైలు సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మితోపాటు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళన విరమిస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. దాంతో కాలనీ వాసులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు. ప్రభుత్వ యంత్రాం గం ఇక్కడకు వచ్చి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేంత వరకు ఎంతటి ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని దళిత కాలనీ వాసులు అంటున్నారు. 



Updated Date - 2021-10-20T06:12:23+05:30 IST