చైనా దురాగతాలను బయటపెట్టిన ఉయిగుర్ యువకుడు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-08-07T00:01:28+05:30 IST

చైనీస్ డిటెన్షన్ క్యాంపుల్లో ఉయిగుర్ ముస్లింలు తీవ్ర కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అమెరికాతో సహా అనేక దేశాలు ఆగ్రహం..

చైనా దురాగతాలను బయటపెట్టిన ఉయిగుర్ యువకుడు.. వీడియో వైరల్

బీజింగ్: చైనీస్ డిటెన్షన్ క్యాంపుల్లో ఉయిగుర్ ముస్లింలు తీవ్ర కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అమెరికాతో సహా అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉయిగుర్‌లపై అరాచకాలను చైనా నిలిపివేయాలని మానవహక్కుల సంఘాలు కూడా ఇటీవల ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ క్యాంపులో బందీ అయిన ఓ యువకుడు తన కుటుంబానికి రహస్యంగా ఓ వీడియో షేర్ చేశాడు. తను పడుతున్న కష్టాలను, అనుభవిస్తున్న బాధను ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కుటుంబానికి పంపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెర్దన్ గప్పర్ అనే 31 ఏళ్ల వ్యక్తిని చైనా సైన్యం డిటెన్షన్ క్యాంపులో బంధించింది. గప్పర్ ఒకప్పుడు మోడల్‌గా కూడా పనిచేశాడు. అయితే అతడిని చైనా పోలీసులు డ్రగ్స్ కేసులో మార్చిలో అరెస్ట్ చేశారు. ఆ కేసులో భాగంగా గప్పర్‌ను డిటెన్షన్ క్యాంపునకు తరలించారు. అతడు ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో రహస్యంగా ఫోన్ సంపాధించిన గప్పర్ తన పరిస్థితిని ఫొటోలు, వీడియోల ద్వారా కుంటుంబానికి తెలియజేశాడు. తన దుస్థితిని వివరిస్తూ కొన్ని మెసేజ్‌లను కూడా పంపాడు. ఆ వీడియోలో తన చేతికి ఉన్న బేడీలను, తనను బంధించిన గదిని, కిటికీ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలను గప్పర్ చూపించాడు. యువకులను, 13 సంవత్సరాలలోపు చిన్నారులే లక్ష్యంగా సైన్యం బంధిస్తోందని, తీవ్రంగా హింసిస్తోందని గప్పర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో చైనాపై మరింత ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.



Updated Date - 2020-08-07T00:01:28+05:30 IST