Bihar: పంచాయతీ ఎన్నికల్లో తేజస్వీయాదవ్ డబ్బు పంపిణీ

ABN , First Publish Date - 2021-09-11T18:18:15+05:30 IST

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజశ్వీ యాదవ్ గ్రామస్థులకు డబ్బు పంపిణీ చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో అతను చిక్కుల్లో పడ్డారు....

Bihar: పంచాయతీ ఎన్నికల్లో తేజస్వీయాదవ్ డబ్బు పంపిణీ

వెలుగులోకి వచ్చిన వీడియో...దర్యాప్తునకు ఆదేశం 

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ గ్రామస్థులకు డబ్బు పంపిణీ చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో అతను చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో పంచాయతీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గ్రామస్థులకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఉద్ధేశపూర్వకంగా తేజశ్వీ డబ్బు పంపిణీ  చేశారని పేర్కొంటూ వీడియోను జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ అప్‌లోడ్ చేశారు.ఈ ఘటనపై విచారణ జరపాలని జేడీయూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 


ఈ వ్యవహారంపై గోపాల్‌గంజ్ జిల్లా అధికారి బైకుంత్‌పూర్ పోలీసులను, బీడీఓను విచారించాలని ఆదేశించారు. ఈ ఆరోపణలను ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తియాదవ్ ఖండించారు. లోక్ సభ ఎన్నికలు కాదని, గోపాల్ గంజ్ లో కోడ్ విధించలేదని, మహిళలు మందులు కొనడానికి ఆర్థిక సహాయం కోరగా తేజస్వీ అందించారని, ఇందులో రహస్యం ఏమీ లేదని శక్తి యాదవ్ వివరణ ఇచ్చారు. గోపాల్‌గంజ్‌లో చిత్రీకరించిన 21 సెకన్ల వీడియోలో, ఆర్జేడీ నాయకుడు తన కారు దగ్గర నిలబడి ఉన్న ముగ్గురు మహిళలకు డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 


తేజస్వీ తన కారులో కూర్చునే మహిళలకు డబ్బు ఇస్తున్నట్లు వీడియోలో ఉంది. పేద గ్రామీణుల ఒడిలో డబ్బులు పడేస్తున్న యువరాజు ఎవరు?.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ అంటూ నీరజ్ కుమార్ తన ట్వీట్‌కి క్యాప్షన్ గా ఇచ్చారు. బైకుంత్‌పూర్ బ్లాక్‌లో మాజీ ఎమ్మెల్యే దేవ్ దత్ ప్రసాద్ 10 వ వార్షికోత్సవంలో తేజస్వీ యాదవ్ పాల్గొంటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.


Updated Date - 2021-09-11T18:18:15+05:30 IST