తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన స్కూల్ విద్యార్థులు బస్సులో ఆల్కహాల్ తాగిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. తిరుకళుకుంద్రం నుంచి తాచూర్ వెళ్తున్న బస్సులో స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న కొందరు విద్యార్థులు బీర్ తాగడం ఆ వీడియోలో కనిపిస్తుంది. బాలికలు, బాలురు అందరూ బీర్ షేర్ చేసుకుని తాగారు. విద్యార్థులంతా చెంగల్పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వాళ్లే అని, బస్సులో ఉన్న విద్యార్థి ఒకరు ఈ వీడియో తీసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. మొదట ఇది పాత వీడియో అని భావించినప్పటికీ, తర్వాత గత మంగళవారం రోజు తీసిన వీడియో అని తెలిసింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. పోలీసులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు.