హృదయ విదారకం.. త‌మ్ముడి మృత‌దేహంతో రోడ్డుపై కూర్చున్న‌ ఎనిమిదేళ్ల బాలుడు.. అసలేం జరిగిందని ఆరా తీయగా..

ABN , First Publish Date - 2022-07-11T21:03:23+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటన గుండెలు పిండేస్తోంది.

హృదయ విదారకం.. త‌మ్ముడి మృత‌దేహంతో రోడ్డుపై కూర్చున్న‌ ఎనిమిదేళ్ల బాలుడు.. అసలేం జరిగిందని ఆరా తీయగా..

Madhya pradesh రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటన గుండెలు పిండేస్తోంది. త‌మ్ముడి మృత‌దేహాన్ని ఒడిలో పెట్టుకుని రోడ్డుపై కూర్చున్న‌ ఎనిమిదేళ్ల బాలుడి దీన స్థితి కన్నీళ్లు పెట్టిస్తోంది. కుమారుడి శవాన్ని కనీసం ఇంటికి తీసుకెళ్లడానికి కూడా స్తోమత లేని ఓ తండ్రి కన్నీటి గాథ ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమిని, అక్కడి అధికారుల తీరును సజీవ సాక్ష్యాలతో కళ్ల ముందు నెలబెడుతోంది.  ఈ ఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా పట్టణంలో జరిగింది. 


మొరెనా పట్టణానికి సమీపంలోని బద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారాం జాతవ్‌కు ఇద్ద‌రు కుమారులు. అతని చిన్న కుమారుడు రాజా కొన్ని రోజులుగా రక్తహీనత, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల రాజాకు కడుపు నొప్పి భరించలేనంత‌గా రావ‌డంతో తండ్రి ఆ చిన్నారిని మొరెనాలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. వారితో పాటు పెద్ద కుమారుడు గుల్షన్‌ కూడా ఆసుపత్రికి వెళ్లాడు. మొరెనా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజా మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను పూజారాం వేడుకున్నాడు. ఎన్నిసార్లు అభ్య‌ర్థించినా ఆస్ప‌త్రి అధికారులు స్పందించలేదు.


ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి నిరాకరించడంతో పూజారాం తన బిడ్డ మృతదేహంతో ఆసుపత్రి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చున్నాడు. తర్వాత పెద్ద కొడుకు గుల్షన్‌ను మృతదేహం దగ్గర ఉంచి ఇంటికి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లిపోయాడు. ఒడిలో త‌మ్ముడి మృత‌దేహాన్ని పెట్టుకుని తండ్రి తిరిగి వస్తాడనే ఆశతో గుల్షన్ అక్కడే ఎదురుచూస్తూ కూర్చుండిపోయాడు. కొద్దిసేపటికి స్థానికులు బాలుడి వ‌ద్ద‌కు వెళ్లి ఏం జ‌రిగింద‌ని ఆరాతీశారు. గుల్షన్ చెప్పింది విని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్ప‌త్రి సిబ్బందితో మాట్లాడి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Updated Date - 2022-07-11T21:03:23+05:30 IST