‘నాకు ఊపిరి ఆడటంలేదు.. డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడంలేదు’

ABN , First Publish Date - 2020-07-13T16:49:23+05:30 IST

‘నాకు ఊపిరి ఆడటంలేదు. డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడంలేదు.

‘నాకు ఊపిరి ఆడటంలేదు.. డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడంలేదు’

జిల్లాలో కొవిడ్‌కు బలైన తొలి మీడియా వ్యక్తి 

23కి చేరిన మరణాలు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): ‘నాకు ఊపిరి ఆడటంలేదు. డాక్టర్లు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏమాత్రం వైద్యం అందడంలేదు’.. కొవిడ్‌తో పోరాడుతూ మృతిచెందిన వీడియో జర్నలిస్ట్‌ చివరిమాటలివి. తిరుపతి కేంద్రంగా రెండు దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టు (46) ఆదివారం స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో కరోనాతో మృతిచెందారు. జ్వరం, ఆయాసంతో బాధపడుతూ చికిత్స కోసం శనివారం స్విమ్స్‌కు వెళ్లారు. కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలడంతో పద్మావతి ఐసోలేషన్‌కు తరలించారు. ఆస్పత్రిలో చేరి 24 గంటలు గడవకముందే కన్నుమూశారు. మృతదేహాన్ని స్విమ్స్‌ మార్చురీకి తరలించారు. సోమవారం గోవింధదామం వద్ద ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 


స్విమ్స్‌ పద్మావతిలో వైద్యం అందుతోందా?

రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిగా ఉన్న స్విమ్స్‌ పద్మావతి ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యం సక్రమంగా అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం ఉదయం నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి ఆదివారం మధ్యాహ్నానికే మృత్యువాత చెందడంతో అక్కడి వైద్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. చివరి నిమిషంలో బాధిత వ్యక్తి ఆవేదన కూడా ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. సీనియర్‌ మీడియా ప్రతినిధికి సరైన వైద్యం అందించాలని కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్‌, ఇతర అధికారులతో పాటు మీడియా ప్రతినిధులూ స్విమ్స్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు.


అయినా ఫలితం కనిపించలేదు. కొవిడ్‌ పోరులో తొలివరుసలో నిలబడి పోరాడుతున్న మీడియా ప్రతినిధుల పరిస్థితే ఇలావుంటే ఇక సామాన్యుల ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. వారం కిందట సింగాలగుంటలోని  మృతుడి నివాసంలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పలువురు స్థానికులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వారిలో ఒకరిద్దరికి కొవిడ్‌ లక్షణాలున్నట్టు సమాచారం. సోమవారం అంత్యక్రియలు జరిగాక మృతుడి కుటుంబీకులకు కొవిడ్‌ పరీక్షలు జరగనున్నాయి.  


పలువురి సంతాపం

వీడియో జర్నలిస్ట్‌ మృతి పట్ల ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, కలెక్టర్‌ భరత్‌గుప్త, కమిషనర్‌ గిరీష, ఇతర అధికారిక, అనధికార ప్రముఖులు సంతాపం తెలిపారు. 


అక్కడ నెగటివ్‌.. ఇక్కడ పాజిటివ్‌

వీడియో జర్నలిస్టుకు ఒక్కరోజు వ్యవధిలోనే కొవిడ్‌ టెస్ట్‌లో భిన్న ఫలితాలు వచ్చాయి. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతూ రెండు రోజులక్రితం ప్రైవేట్‌ వైద్యుడి వద్దకు వెళ్లినట్టు తెలిసింది. ఆయన కొవిడ్‌ టెస్టుకు రెఫర్‌ చేయడంతో తిరుపతిలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లో 9వ తేది శ్వాబ్‌ శాంపిల్‌ ఇచ్చారు. పదో తేది వచ్చిన రిపోర్టులో నెగటివ్‌ అని తేలింది. కానీ, క్రమక్రమంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో 11వ తేది ఉదయం స్విమ్స్‌కు వెళ్లారు. అక్కడ రాపిడ్‌ టెస్ట్‌ చేస్తే పాజిటివ్‌ అని నిర్థారణ అయింది. దీనిపై ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాహకులను వివరణ అడగ్గా.. వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ఎప్పుడైనా, ఎలాగైనా మారుతుందని చెప్పారు. తమ దగ్గర చేసినప్పుడు నెగటివ్‌ వచ్చిందన్నారు. 

Updated Date - 2020-07-13T16:49:23+05:30 IST