కరోనా కారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్‌లైన్ విధానంలో చదువులు చెప్పిస్తున్నారు. కానీ కొందరు పిల్లలు మాత్రం చదువు పక్కన బెట్టి ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడుతున్నారు. ఈ అలవాటు చాలామందిలో వ్యసనంగా మారింది. ఈ అన్‌లైన్ గేమ్ వ్యసనం కారణంగా ఒక పదవ తరగతి విద్యార్థి కిడ్నాప్ అయ్యాడు. ఈ ఘటన అక్టోబర్ 28న మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జైని నగరంలో జరిగింది.
ఇంటి నుంచి స్కూల్‌కు బయలుదేరిన సోను అనే ఒక పదవ తరగతి చదివే విద్యార్థి రాత్రి మళ్లీ ఇంటికి రాకపోయేసరికి అతని తల్లిదండ్రులు ఆందోళన పడి తెలిసిన వారికంతా అడిగారు. కానీ ఎక్కడా సోను ఆచూకీ తెలియలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఒక స్కూల్ విద్యార్థి నగరంలోని రాజ్‌బాడా ప్రాంతంలో కనబడ్డాడు. అతను శరీరానికి గాయాలతో ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. చుట్టు పక్కల ఉన్నవారు అతడని పలకరించి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు సోనుని ఏం జరిగిందని ప్రశ్నించగా.. తను స్కూల్‌కు బయలుదేరిన దారిలో ఎవరో ఇద్దరు దుండగులు తనను కొట్టి కారు డిక్కీలో పడేసి ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పాడు. తనను తల్లిదండ్రుల చేర్చమని ఏడ్చాడు. అప్పుడు పోలీసులు ఆ కుర్రాడు ఉంటున్న ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి అతని గురించి సమాచారమిచ్చారు. ఆ తరువాత మరో పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన పోలీసులు సోనుని విచారణ చేశారు. ఆ సమయంలో అతను జరిగిన విషయం చెప్పేటప్పుడు కథనం మారింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని నిజం చెప్పమని సీరియస్‌గా అడిగారు. పోలీసులు అలా అడిగే సరికి సోను భయపడి.. అప్పుడు చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్య పరిచింది.
సోనుకు ఆన్‌లైన్ ఫైర్ వీడియో గేమ్ ఆడే వ్యసనం ఉంది. అందులో అతను ఎక్కువ స్కోర్ చేసేందుకు డైమండ్ పాయింట్స్ కొనడానికి తన తల్లి అకౌంట్ నుంచి రూ.1500 డబ్బును దొంగలించాడు. అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టు సోను తల్లికి మెసేజ్ వచ్చింది. ఆమె సోనుని ఫోన్ చేసి అడిగింది. ఇక అమ్మ ఇంటికి వస్తే తనను కొడుతుందేమోనని భయపడి సోను ఒక కథ అల్లేశాడు.
తనను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, అక్కడ ఆ దుండగులు తనని కొట్టినట్లు తనకు తానే శరీరానికి గాయాలు చేసుకున్నాడు.