‘విక్టరీ’ రామ్‌కుమార్‌ మృతి

ABN , First Publish Date - 2021-01-14T06:59:07+05:30 IST

విక్టరీ పబ్లిషర్స్‌ అధినేత ఇమ్మిడిశెట్టి రామ్‌కుమార్‌ బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా మరణించారు.

‘విక్టరీ’ రామ్‌కుమార్‌ మృతి

విజయవాడ కల్చరల్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): విక్టరీ పబ్లిషర్స్‌ అధినేత ఇమ్మిడిశెట్టి రామ్‌కుమార్‌ బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా మరణించారు. జిల్లా రచయితల సంఘం ప్రచురించిన అనేక గ్రంథాలకు ఆయన అండగా నిలిచారు. అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలను అయన ముద్రించారు. శ్రీరంగంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసత్రం నిర్వాహకుల్లో రామ్‌కుమార్‌ ఒకరు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉండే రామ్‌కుమార్‌కు కొంతకాలం క్రితం పక్షవాతం వచ్చింది. స్వల్పంగా కోలుకున్నప్పటికీ బుధవారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా కారులోనే ప్రాణాలు కోల్పోయారు. అన్న అక్కేశ్వరరావుతో కలిసి ముద్రణ రంగంలోకి దిగారు. ముందుగా విక్టరీ పేరుతో విద్యార్థులకు సంబంధించిన గైడ్లు, పాఠ్యపుస్తకాలను ముద్రించేవారు. తర్వాత సాహితీ, ఆధ్యాత్మిక పుస్తకాలను ముద్రించడం మొదలుపెట్టారు. అక్కేశ్వరరావు మరణంతో ఆయన జ్ఞాపకార్థం అక్కేశ్వరరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. కేబీఎన్‌ కళాశాల కార్యవర్గ సభ్యుడిగా రామ్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు.  

Updated Date - 2021-01-14T06:59:07+05:30 IST