Abn logo
Jun 2 2020 @ 02:25AM

పరులపై జయం కాదు.. ఆత్మజయం కావాలి

బ్రహ్మావర్తంలో భాసమతి అనే మహర్షి ఉండేవాడు. అతనికి సంయముడు, ద్రుతగామి అని ఇద్దరు ప్రధాన శిష్యులు ఉండేవారు. సంయముడు మిగిలిన శిష్యులతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ ఎవరికేం సాయం కావాలన్నా చేసేవాడు. వారి నుంచి కృతజ్ఞతలు కూడా ఆశించేవాడు కాదు. తిరిగి తన అధ్యయనంలో నిమగ్నమయ్యేవాడు. ద్రుతగామి ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించేవాడు. అన్ని విషయాల్లో అందరితోనూ పోటీ పడేవాడు. చదువులో, క్రీడా వినోదాల్లో, యోగసాధనలో అన్నింటా అందరితో పోటీ పడేవాడు. తనే ప్రథముడుగా నిలబడేవాడు. ఆశ్రమంలో అందరినీ జయించాడుగానీ ఒక్క సంయమునితో తలపడే అవకాశం రాలేదు. అందరినీ జయించినా.. సంయముడు తనతో పోటీకి రాలేదనే అసంతృప్తి అతనిలో ఉండేది. తన గురువైన భాసమతి వద్ద చాలాసార్లు తన అసంతృప్తిని వెలిబుచ్చినా.. ఆయన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వు నవ్వి వదిలేసేవాడు. క్రమంగా ద్రుతగామి అసంతృప్తి అక్కసుగా మారింది.


సంయముని పరిపరివిధాలుగా రెచ్చగొట్టే వాడు. కానీ, సంయముడు కించిత్‌  కూడా చలించేవాడు కాదు. సంయముని ప్రవర్తనకు తట్టుకోలేని ద్రుతగామి.. తనతో పోటీపడి ఓడిపోయిన మిత్రులలో లలితకళలలో వినయుడనే వానిని, మల్లయుద్ధంలో జయంతుని, శాస్త్రాలలో  విద్యానిధి అనే వానిని తరచూ అవమానించే వాడు. ఇలా కొన్నాళ్లు జరిగాక ఒకరోజు చెరువు గట్టు వద్ద జయంతుడు ద్రుతగామిని మల్లయుద్ధంలో పోటీకి రమ్మని పిలిచాడు. పది ఆవృతాల పోటీలో పదిమార్లూ ద్రుతగామిని చిత్తుగా ఓడించాడు. వెంటనే వినయుడు సంగీతనృత్యాలలో పోటీకి పిలిచి ఓడించాడు. అలాగే విద్యానిధి చేతిలోనూ ఓడిపోవడంతో ద్రుతగామికి ఏమీ అర్థం కాలేదు.  మౌనంగా ఆ ముగ్గురూ నడుస్తున్న వైపు వారికి తెలియకుండా వారిని అనుసరించి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక ఒక ఏకాంత ప్రదేశంలో అద్భుతంగా గానం చేస్తున్న సంయముణ్ని చూశాడు. అతడి గానం ఆగాక.. వినయాదులు ముగ్గురూ సంయముని చేరుకుని ‘‘ద్రుతగామి చేసే అవమానాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న మమ్మల్ని నివారించావు. అతణ్ని ఎదుర్కొనే మెలకువల్ని నేర్పావు. మాకు ధైర్యాన్ని ఇచ్చావు. ఈ రోజు మా చేతిలో అతడు ఓడిపోయాడు. అందుకు కూడా నీ ఉపాయమే కారణం. ముందుగా శారీరకంగా ఓడించమన్నావు. అందువల్ల అతని ఏకాగ్రతా, ఆత్మవిశ్వాసం సడలాయి. అప్పుడు కళలలో ఓడిపోయాడు. అతని బుద్ధి స్థైర్యం పోయింది. అందువల్ల శాస్త్రంలో ఓడిపోయాడు.’’ అని కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే సంయముడు వారితో.. ‘‘గెలిచాం కదా అని ద్రుతగామిని ఎప్పుడూ అవమానించకండి. అతను మన సోదరుడు. మీకు ఒక్కొక్క విద్యలోనే నేర్పరితనం ఉన్నది. అతడు అన్ని విద్యలలో నేర్పరి.’’ అని చెప్పాడు. చాటు నుండి అంతా విన్న ద్రుతగామి సంయముని దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని.. ‘‘నా అహంకారానికి తగిన పాఠం చెప్పావు. నా విషయంలో నీకు గొప్ప అభిప్రాయం ఉండడం నాకు సిగ్గును కలుగజేస్తోంది. నన్ను క్షమించు.’’ అని భోరున విలపించాడు.


సంయముడు అతణ్ని ఆలింగనం చేసుకుని ఓదార్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వారి గురువు భాసమతి.. ‘‘ప్రపంచంలో సామర్థ్య ప్రదర్శనమే కానీ గెలుపు, ఓటమి అనేవి లేవు. సంయముని గురించి నువ్వు ఎన్నిసార్లు ఏం చెప్పినా నేను మౌనంగా ఉన్నది అందుకే’’ అని ద్రుతగామితో చెప్పాడు. గురువు హృదయం అర్థమైన ద్రుతగామి, శిష్యులు ఆయనకు నమస్కరించి ఆశ్రమం వైపు నడిచారు.

- ఆచార్య రాణి సదాశివ మూర్తి

Advertisement
Advertisement
Advertisement