వరుణ్‌ ‘పాంచ్‌’

ABN , First Publish Date - 2020-10-25T09:07:45+05:30 IST

లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (5/20) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింతగా మెరుగుపరచుకొంది

వరుణ్‌ ‘పాంచ్‌’

ఢిల్లీ ఢమాల్‌

59 పరుగులతో కోల్‌కతా విక్టరీ

రాణా, నరైన్‌ అర్ధ శతకాలు


అబుదాబి: లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (5/20) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింతగా మెరుగుపరచుకొంది. ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 59 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్‌ నితీష్‌ రాణా (53 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 81), సునీల్‌ నరైన్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 194/6 స్కోరు చేసింది. నోకియా (2/27), రబాడ (2/33) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో చక్రవర్తి, కమిన్స్‌ (3/17) దెబ్బకు ఢిల్లీ.. ఓవర్లన్నీ ఆడి 9 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసి ఓటమిపాలైంది. శ్రేయాస్‌ అయ్యర్‌ (47) టాప్‌ స్కోరర్‌. ఐదు వికెట్లతో ఢిల్లీ బ్యాటింగ్‌ పనిబట్టిన వరుణ్‌ చక్రవర్తికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

రహానె మళ్లీ ఫెయిల్‌: భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీని కమి న్స్‌ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ రహానెని గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చగా.. శతకాలతో జోరు మీదున్న ధవన్‌ (6)ను బౌల్డ్‌ చేశాడు. కానీ, కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (27) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. నాగర్‌కోటి వేసిన 4వ ఓవర్‌లో అయ్యర్‌ రెండు ఫోర్లు బాదాడు. మరోవైపు పంత్‌ కొంచెం జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ పడకుండా బ్యాటింగ్‌ చేశాడు. 

తిప్పేసిన వరుణ్‌: వరుణ్‌ ఎంట్రీతో సీన్‌ మారిపోయింది. ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను శాసించాడు. 12వ ఓవర్‌ రెండో బంతికే పంత్‌ను అవుట్‌ చేసిన చక్రవర్తి.. మూడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశారు. ఇక్కడి నుంచి ఢిల్లీ బ్యాటింగ్‌ కుప్పకూలింది. 14వ ఓవర్‌లో వరుస బంతుల్లో హెట్‌మయర్‌ (10), అయ్యర్‌ను అవుట్‌ చేసిన వరుణ్‌.. తన తర్వాతి ఓవర్‌లో స్టొయినిస్‌ (6), అక్షర్‌ పటేల్‌ (9)ను పెవిలియన్‌ చేర్చాడు. 

నిలబెట్టిన రాణా-నరైన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆరంభంలో 42/3తో బెంగళూరుతో ఆడిన గత మ్యాచ్‌ను గుర్తుకు తెచ్చింది. అయితే, ఓపెనర్‌గా ప్రమోటైన నితీష్‌ రాణా-సునీల్‌ నరైన్‌ జోడీ నాలుగో వికెట్‌కు 115 పరుగుల శతక భాగస్వామ్యంతో భారీ స్కోరు చేసింది. అంతకుముందు ఓపెనర్‌ గిల్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (13)ని నోకియా అవుట్‌ చేయగా.. దినేష్‌ కార్తీక్‌ (3)ను రబాడ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌ మరోసారి పేకమేడను తలపిస్తుందా? అనే అనుమానం కలిగింది. కానీ, రాణా, నరైన్‌ జట్టును ఆదుకొన్నారు. అదను చూసి ఎదురుదాడి చేస్తూ ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. అశ్విన్‌ ఓవర్‌లో రాణా సిక్స్‌ బాదగా.. నరైన్‌ బౌండ్రీ కొట్టడంతో ఆ ఓవర్‌లో 13 పరుగులు లభించాయి. అప్పటి నుంచి వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. స్టొయినిస్‌ (2/41) వేసిన 12వ ఓవర్‌లో రాణా 4,6తో దుమ్ము రేపగా.. నరైన్‌ ఫోర్‌ బాదడంతో జట్టు స్కోరు శతకం దాటింది. అయితే, వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఆ తర్వాతి ఓవర్‌లో నోకియాను మరోసారి బౌలింగ్‌కు దించినా.. రాణా ఫోర్‌ కొట్టి అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. మరోవైపు నరైన్‌ కూడా విరుచుకు పడడంతో ఢిల్లీ బౌలర్లకు దిక్కు తోచలేదు. అశ్విన్‌ వేసిన 15వ ఓవర్‌లో 4,6 బాదిన నరైన్‌.. ఈ సీజన్‌లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ధాటిగా ఆడుతున్న నరైన్‌ను రబాడ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌లో రాణా, కెప్టెన్‌ మోర్గాన్‌ (17)ను స్టొయినిస్‌ పెవిలియన్‌ చేర్చాడు. 


మామయ్యకు అంకితం..

దుఃఖంలో ఉన్నా.. ఓపెనర్‌ పాత్రలో హిట్‌ అయిన నితీష్‌ రాణా అర్ధ శతకంతో జట్టును ఆదుకొన్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం మరణించిన తన మామయ్య సురీందర్‌కు ఈ హాఫ్‌ సెంచరీని అంకితమిచ్చాడు. ‘సురీందర్‌’ పేరు రాసిన కోల్‌కతా జెర్సీని ప్రదర్శించి.. నివాళులర్పించాడు. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌ (సి) అక్షర్‌ (బి) నోకియా 9, నితీష్‌ రాణా (సి) తుషార్‌ (బి) స్టొయినిస్‌ 81, రాహుల్‌ త్రిపాఠి (బి) నోకియా 13, దినేష్‌ కార్తీక్‌ (సి) పంత్‌ (బి) రబాడ 3, నరైన్‌ (సి) రహానె (బి) రబాడ 64, మోర్గాన్‌ (సి) రబాడ (బి) స్టొయినిస్‌ 17, కమిన్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 194/6; వికెట్ల పతనం: 1-11, 2-35, 3-42, 4-157, 5-194, 6-194; బౌలింగ్‌: తుషార్‌ దేశ్‌పాండే 4-0-40-0, నోకియా 4-0-27-2, రబాడ 4-0-33-2, అక్షర్‌ పటేల్‌ 1-0-7-0, స్టొయినిస్‌ 4-0-41-2, అశ్విన్‌ 3-0-45-0. 

ఢిల్లీ: రహానె (ఎల్బీ) కమిన్స్‌ 0, ధవన్‌ (బి) కమిన్స్‌ 6, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) నాగర్‌కోటి (బి) చక్రవర్తి 47, రిషభ్‌ పంత్‌ (సి) గిల్‌ (బి) చక్రవర్తి 27, హెట్‌మయర్‌ (సి) త్రిపాఠి (బి) చక్రవర్తి 10, స్టొయినిస్‌ (సి) త్రిపాఠి (బి) చక్రవర్తి 6, అక్షర్‌ పటేల్‌ (బి) చక్రవర్తి 9, రబాడ (సి) త్రిపాఠి (బి) కమిన్స్‌ 9, అశ్విన్‌ (నాటౌట్‌) 14, తుషార్‌ (సి) మోర్గాన్‌ (బి) ఫెర్గూసన్‌ 1, నోకియా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 135/9; వికెట్ల పతనం: 1-0, 2-13, 3-76, 4-95, 5-95, 6-110, 7-112, 8-132, 9-135; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-17-3, ప్రసిద్ధ్‌ కృష్ణ 2-0-19-0, నాగర్‌కోటి 2-0-11-0, ఫెర్గూసన్‌ 4-0-30-1, నరైన్‌ 4-0-37-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-20-5.

Updated Date - 2020-10-25T09:07:45+05:30 IST