మట్టి తవ్వకాలపై భగ్గుమన్న బాధితులు

ABN , First Publish Date - 2021-06-24T04:54:42+05:30 IST

తినీ తినక, పైసా పైసా కూడపెట్టుకొని, నెలనెల కంతులు కట్టుకొని ప్లాట్లు కొనుగోలు చేస్తే అధికార పార్టీకి చెందిన కొందరు అక్కడి మట్టిని తవ్వి తరలిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు.

మట్టి తవ్వకాలపై భగ్గుమన్న బాధితులు
తమ ప్లాట్ల వద్ద ధర్నా చేస్తున్న బాధితులు

- ప్లాట్ల వద్ద ధర్నా చేపట్టిన యజమానులు

- న్యాయం చేయాలని డిమాండ్‌

- కలెక్టరేట్‌కు వెళ్లేందుకు యత్నం

- ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు 

- చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హామీ


గద్వాలక్రైం, జూన్‌ 23 : తినీ తినక, పైసా పైసా కూడపెట్టుకొని, నెలనెల కంతులు కట్టుకొని ప్లాట్లు కొనుగోలు చేస్తే అధికార పార్టీకి చెందిన కొందరు అక్కడి మట్టిని తవ్వి తరలిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. మట్టిని తవ్విన తమ ప్లాట్లలోనే ధర్నా చేపట్టిన సంఘటన బుధవారం జిల్లాకేంద్రంలో చోటు చేసుకొంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని పిల్లిగుండ్ల సమీపంలో ఉన్న సర్వే నెంబర్‌ 232/క లోని భూమిలో 17 ఏళ్ల క్రితం సలీం కలీం అనే వ్యక్తులు 285 ప్లాట్లు చేసి విక్రయించారు. స్కీం పద్ధతిలో నెల వారీ కిస్తులు చెల్లించి రూ.25వేల చొప్పున పలువురు ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ ప్లాట్లలో అధికార పార్టీకి చెందిన పెద్దపల్లి అజయ్‌ అనే వ్యక్తి మట్టిని తవ్వి తరలించగా, ప్లాట్ల యజమానులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం మళ్లీ మట్టిని తవ్వి తరలిస్తుండటంతో టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్ధలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో మట్టిని తవ్వుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ట్విటర్లో మంత్రి కేటీఆర్‌కు, సీఎస్‌ సోమేష్‌కుమర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, అందుకే ధర్నా చేస్తున్నామని చెప్పారు. చివరకు వారు కలెక్టరేట్‌కు వెళ్లేందుకు సిద్ధం కాగా, పోలీసులు అడ్డుకొని మాట్లాడారు. ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి వారితో దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూడటంతో పాటు మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Updated Date - 2021-06-24T04:54:42+05:30 IST