విచక్షణ మరిచిన ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-03-07T05:06:30+05:30 IST

‘‘ఉక్కు మహిళలు పొణకా కనకమ్మ, దూబగుంట రోశమ్మ లాంటి నాయకు రాళ్లు పుట్టిన నెల్లూరు గడ్డలో ఇప్పుడు విచక్షణ మరిచిన నాయకులు రాజ్యమేలుతున్నారు.

విచక్షణ మరిచిన ఎమ్మెల్యేలు
నారీ సంకల్ప దీక్షలో మాట్లాడుతున్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

కుదిరితే భూ దందా.. లేదంటే ఇసుక దందా

ఇందుకేనా ప్రజలు మీకు ఓట్లు వేసింది ?

నెల్లూరు ఎస్పీ ఐపీఎస్‌ పాసయ్యే వచ్చారా..

బాధిత మహిళపైనే తప్పుడు కేసులు

వైసీపీ పాలనకు త్వరలోనే చరమగీతం

నారీ సంకల్ప దీక్షలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత 

భారీగా తరలివచ్చిన మహిళా మణులు

సంకల్ప దీక్ష విజయవంతం 


నెల్లూరు, మార్చి6(ఆంధ్రజ్యోతి): ‘‘ఉక్కు మహిళలు పొణకా కనకమ్మ, దూబగుంట రోశమ్మ లాంటి నాయకు రాళ్లు పుట్టిన నెల్లూరు గడ్డలో ఇప్పుడు విచక్షణ మరిచిన నాయకులు రాజ్యమేలుతున్నారు. ఒకాయన అసెంబ్లీలో తొడగొడతాడు. మైకు దొరికితే చాలు బూతులు మాట్లాడుతాడు. ఇంకొకాయన తాగిన మత్తులో అర్ధరాత్రి మహిళా అధికారి ఇంటికి వెళ్లి తలుపులు కొడతాడు. ఇంకొకాయన సోషల్‌ మీడియాలో  బూతుపురాణం మొదలెడతాడు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం, సారా నిషేధం కోసం జీవితాలను త్యాగం చేసిన మహిళా నాయకురాళ్లు పుట్టిన ఈ గడ్డపై వైసీపీ పుణ్యమా.. అని ఇప్పుడు ఇలాంటి విచక్షణ మరచిన ఎమ్మెల్యేలు అధికారం చెలాయిస్తున్నారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిన అధికారులు వైసీపీ నేతలకు బానిసలుగా మారి బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. ఈ అవినీతి,దుర్మార్గపు పాలనకు చమరగీతం పలికే రోజు దగ్గర్లోనే ఉంది. గాజులు ధరించిన మహిళా లోకమే జగనను గద్దె దించి సాగనంపే రోజు దగ్గర్లో ఉంది, ఆ రోజు వచ్చే వరకు మహిళా సంకల్ప దీక్ష కొనసాగుతుంది’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం నెల్లూరులోని అనిల్‌ గార్డెన్సలో నిర్వహించిన తెలుగు మహిళ నారీ సంకల్ప దీక్షకు ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జిల్లా వైసీపీ నాయకులు, పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారు. 

నెల్లూరుకు చెందిన ఓ మంత్రి అసెంబ్లీలో తొడలు చరుస్తారు, మీసం మెలేస్తారు. మేము చేతులకు గాజులు తొడుక్కోలేదు, పోలవరం పూర్తి చేస్తాం చూడండి.. అంటూ సవాల్‌ విసురుతాడు. ఆ పనులన్నీ మరచిపోయి మంత్రి పదవి కాపాడుకునేందుకు మైక్‌ దొరికిన ప్రతిసారి చంద్రబాబును, లోకేష్‌ను తిడతాడు. ఎంతో మంది గొప్ప నాయకులను కన్న నెల్లూరు గడ్డలో ఇలాంటి నాయకులు ఉండటం బాధాకరమని అనిత అన్నారు. ఇంకొక ఎమ్మెల్యే తప్పతాగి అర్ధరాత్రి మహిళా అధికారి ఇంటికి వెళ్లి తలుపులు తడతాడు. ఇంటికి కరెంటు, నీళ్లు కట్‌ చేయిస్తాడు. ఇదేనా జగన పాలనలో మహిళలకు, మహిళా అధికారులకు లభించే గౌరవం...? అని అనిత ప్రశ్నించారు. ఇంకో ఎమ్మెల్యేకి సోషల్‌మీడియా పిచ్చి. సోషల్‌ మీడియాలో నోరు తెరిస్తే నీ అమ్మకు..అబ్బకు పుట్టి ఉంటే అని మొదలు పెడుతాడు...! అదేనా సంస్కారం..ఇందుకేనా ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది అని ఆమె ప్రశ్నించారు. కుదిరితే భూకబ్జా లేకుంటే ఇసుక దందాగా నెల్లూరు వైసీపీ నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతు న్నారన్నారు. 


పోలీసు రక్షణ అంటే ఇదేనా..?


ప్రజల ధన,మాన, ప్రాణాలను కాపాడటం పోలీసుల ప్రథమ కర్తవ్యం. కాని నెల్లూరు పోలీసులు వైసీపీ నాయకుల ప్రయోజనాలను కాపాడటం ఒక్కటే తమ ఽకర్తవ్యంగా పనిచేస్తున్నారు. అసలు నెల్లూరు ఎస్పీని చూస్తే ఆయన నిజంగా ఐపీఎస్‌ చదివి ఎస్పీ అయ్యారా..! అనే అనుమానాలు కలుగుతున్నాయని అనిత విమర్శించారు. మహిళా కానిస్టేబుళ్లు యూనిఫాం కొలతలను పురుషుల ద్వారా తీయిస్తారా..!? మన పిల్లల కొలతలు ఇలా తీయడానికి అంగీకరిస్తామా..!? అసలు పోలీసులు చేయాల్సిన పనేనా ? ఇది. ఈ వ్యవస్థలోనే మహిళలకు గౌరవం లభించకుంటే ఇంకెక్కడ దొరుకుతుంది అని ఆమె ప్రశ్నించారు. యూనిఫాం కొలతల విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా, ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అని ఆరా తీశారంటే నెల్లూరు పోలీసు అధికారులు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది ఆకతాయిలు తమను ఇబ్బందులు పెడుతున్నారని పోలీసు స్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఆకతాయిలపై చర్యలు తీసుకోకుండా, వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి బాధిత మహిళలపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. దీనికన్నా దుర్మార్గం మరేదైనా ఉందా ? అని అనిత ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఇలాంటి కేసులు లెక్కలేనన్ని నమోదు అవుతున్నాయని, ఈ దుర్మార్గం ఇక ఎన్నో రోజులు సాగదన్నారు. దుర్మార్గపు వైసీపీ పాలనకు అంతిమ గడియలు దగ్గరపడ్డాయని, గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేసిన ప్రతి మహిళ ఎందుకు వేశామా అని చింతిస్తున్నారని, నారీ శక్తే రాబోయే ఎన్నికల్లో జగనను గద్దె దించడం ఖాయమని వంగలపూడి అనిత అన్నారు. అప్పుడు వైసీపీ నాయకుల మెప్పు కోసం తప్పులు చేసిన పోలీసు అధికారులందరూ తగ్గిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆమె హెచ్చరించారు. జగన ప్రభుత్వ అంతిమ కాలానికి అనూహ్యంగా విజయవంతం అయిన నారీ సంకల్ప దీక్ష ఒక నిదర్శనమని, సమర్థుడైన చంద్రబాబును గద్దె నెక్కించే వరకు ఈ నారీ సంకల్ప దీక్ష కొనసాగుతుందని అనిత అన్నారు. 


సంకల్పదీక్ష సక్సెస్‌


పెరిగిన ధరల ప్రభావమో.. అధికారుల పక్షపాత వైఖరి విధానాలో... సామాన్యులకు రక్షణ దొరకడం లేదనే అసహన ప్రభావమో.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన పర్యవసానమో...? కారణాలేమైనా కాని నెల్లూరు నారీ సంకల్ప దీక్షకు మహిళా నాయకురాళ్లు పోటెత్తి వచ్చారు. సామాన్యులు సైతం సభావేదికపైకి ఎక్కి ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. రాజకీయ కారణాలతో తన ఆడబిడ్డకు జరిగిన అన్యాయం జరిగిందని ఒకరు, కట్టమీద గుడిసెలో బతికేటోళ్లం...18వేల రూపాయల నీటి పన్ను ఎలా కట్టాలని ఒకరు...! ఇలా రాజకీయాలకు సంబంధం లేని వారు సైతం సభా వేదికపై నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ..ప్రశ్నిస్తూ చేసిన ప్రసంగాలు కొత్త సంకేతాలను సూచించాయి. ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమమైనా, ఈ సమావేశాలకు వెళితే కక్ష సాధింపు చర్యలు తప్పవనే సత్యం తెలిసినా, భయప డకుండా భారీగా తరలివచ్చిన మహిళలను తెగింపు టీడీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సభా ప్రాంగణం నిండిపోవడం తో అత్యధికులు వెలుపలే నిలబడి నాయకుల ప్రసం గాలను విన్నారు. ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో ఆదివారం ఉదయం నుంచి అనిల్‌ గార్డెన్స కోలాహలంగా కనిపిం చింది. సంకల్ప దీక్ష విజయవంతంతో టీడీపీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

 


 మహిళలు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు దిగిరావాల్సిందే..

- సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి


జిల్లా మహిళలు కన్నెర్ర చేస్తే  ప్రభుత్వాలు దిగిరావా ల్సిందే. గతంలో చాలా సందర్బాలు చూశాం. పొనకా కనకమ్మ, బాలసరస్వతి, దూబగుంట రోశమ్మ ఎందరో ఉద్దండులు పుట్టినగడ్డ నెల్లూరు జిల్లా. ఉద్యమాల పురిటిగడ్డ, సారాయి, బెల్ట్‌ షాపుల నియంత్రణ ఉద్యమాలు ఇక్కడ నుంచి ప్రారంభమైనవే. వైఎస్‌ జగన్మోహనరెడ్డి పెంచిన ధరల గురించి చెబుతున్నారు తప్ప తగ్గించిన ధాన్యం ధరల గురించి ఎవరూ చెప్పడం లేదు. తెలంగా ణాలో జిల్లాలు పెంచారని ఇక్కడ పెంచడం సరికాదు.  ప్రశాంతమైన జిల్లా పేరును అధికార పార్టీ నాయకులు నాశనం చేసేశారు. జిల్లాకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రావా లంటే భయపడుతున్నారు. అనితను చూస్తే అనిపిస్తుంది ఆమె ఫ్లవర్‌కాదు ఫైర్‌ అని.  వైసీపీ వారు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు  పెడుతున్నారు. ఎన్నికేసులు పెడతారో చూస్తాం. మహిళా నాయకుల ఉపన్యాసాలు విన్నాక చట్టసభల్లో 50 శాతం సీట్లు ఇవ్వాలనిపిస్తుంది.



టీడీపీ గెలుపునకు ఈ సభే నిదర్శనం

- అబ్దుల్‌ అజీజ్‌

వేలాదిమంది మహిళలు నారీ సంకల్ప దీక్షకు తరలి రావడం చూస్తుంటే 2024 ఎన్నికల్లో  టీడీపీ గెలుపొందడం ఖాయమని తెలుస్తుంది. మహిళా నాయకులు, కార్యకర్తలు ఇదే ఐక్యమత్యంతో పనిచేయాలి. ప్రజలకు కడుపునిండా అన్నం పెట్టే మనసు రాజకు ఉండాలని, అయితే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం అన్నా క్యాంటీ నలను తొలగించి పేదల కడుపు కొట్టారన్నారు. రాజుకు ఉండాల్సిన ఒక్క లక్షణం జగన్మోహనరెడ్డికి లేదు. 




ఈ ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది

-అనూషరెడ్డి,మాజీ ఎమ్మెల్యే


నారీ సంకల్ప దీక్షకు వేలాది మంది నారీమణులు తరలి రావడం ఆనందంగా ఉంది. ఈ ఆదరణ చూస్తుంటే మళ్లీ మన నేత నారా చంద్రబాబునాయుడును ముఖ్మమంత్రిని చేసుకోవడం ఖాయమని అనిపిస్తోంది. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి.


దిశ చట్టంతో ఎక్కరికైనా న్యాయం జరిగిందా ?

- చక్రాల ఉష, తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు

దిశ చట్టంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడపిల్లకైనా న్యాయం జరిగిందా ? అని ప్రశ్నిస్తున్నా. కులం, మతం చూడం..అని ముఖ్యమంత్రి ఏమని చెప్పారోకాని కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా అందరినీ రోడ్డుపైకి తీసుకు వచ్చేశారు. 


మన బతుకులు ఎలా ఉన్నాయో చూసుకోండి


-కుసుమ కుమారి, రాష్ట్ర కార్యదర్శి


2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 2024 వరకు  మన బతుకులు ఎలా ఉన్నాయో అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి. 


 దీక్షలో సైడ్‌లైట్స్‌


సభలో దిశను ఒక్కసారి వచ్చిపోమ్మా.. అంటూ పిలిచారు. దిశ అంటే ఎవరా అని చుట్టుపక్కల చూస్తుంటే ఆ తర్వాత దిశ చట్టాన్ని పిలుస్తున్నాం. మీకు కనిపిస్తే చెప్పండి అని మహిళానేతలు అనడంతో సభా ప్రాంగణం నవ్వులతో మారుమోగింది.

శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఓ తల్లి మాట్లాడుతుంటే సభా ప్రాంగణంలో అందరూ కన్నీరు పెట్టుకున్నారు. తన కుమార్తెను ఓ కానిస్టేబుల్‌ మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆ కానిస్టేబుల్‌కు సరైన శిక్ష పడలేదని కన్నీరుమున్నీరైంది.

నెల్లూరు నగరంలో ఉంటున్న తనకు ఇంటిపన్ను రూ.28 వేలు వేశారని, ఈ ప్రభుత్వంలో సామాన్యులు బతికేది ఎలా..? అంటూ ఓ మహిళ నిలదీసింది. స్టేజ్‌పైకి దూసుకు వచ్చి ఇంటి పన్ను బిల్లు చూపుతూ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది.

దీక్షకు వచ్చిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను నెల్లూరు నగర నాయకులు కలిశారు. జిల్లాకు వచ్చిన ఆడపడుచుగా భావించి ఆమెకు సారె ఇచ్చారు.  కార్యక్రమంలో నగర నాయకులు కువ్వారపు బాలాజీ, జన్ని రమణయ్య, మతాంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు (స్టోనహౌస్‌పేట)



మహిళలకు సన్మానం


నెల్లూరు (వైద్యం) మార్చి 6 : సంకల్ప దీక్షలో పలు వురు మహిళలను సన్మానించారు.  టీడీపీ నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు సతీమణి ధర్మవరం సుజాత అనితను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని కూడా సన్మానించా రు.  అనిత చేస్తున్న దీక్షకు అబ్దుల్‌ అజీజ్‌ సతీమణి షర్మిల సంఘీభావం తెలియచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెంచలబాబు యాదవ్‌, అజీజ్‌ సోదరి సాబీరా, వజ్రావతమ్మ, ఈశ్వరీబాయి, కళావతి, శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-03-07T05:06:30+05:30 IST