Abn logo
Jul 30 2021 @ 18:42PM

కరోనా మహమ్మారిపై పోరు ప్రజాఉద్యమంగా మారాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరాటాన్ని ప్రజాఉద్యమంగా మలిచేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా టీకాకరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. టీకాలు తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధకతను పెంచుకోవడం అత్యంత అవసరమన్నారు.శుక్రవారం హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ఉన్న ‘భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాకరణ విషయంలో ఎలాంటి అపోహలు అక్కర్లేదని, మనతో పాటు పక్కవారిని కూడా కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు టీకాను మించిన ఆయుధం లేదన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఈ టీకాకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరముందన్న ఆయన, ఇందుకోసం నగరాలు, పట్టణాల నుంచి  మారుమూల గ్రామాల వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు.


టీకా తీసుకోవడం కారణంగా ఒకవేళ కరోనా వైరస్ సోకినప్పటికీ.. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్ర ప్రభావం ఉండదన్న ఉపరాష్ట్రపతి, ఇలాంటి విషయాల్లో ప్రజాచైతన్యం కోసం ప్రచార, ప్రసార మాధ్యమాలు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలన్నారు.చిన్నారులకు కరోనా టీకాపై జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకున్న అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి, దీంతో పాటుగా ముక్కు ద్వారా అందించే టీకాలపై ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.కరోనా తీవ్రత కాస్త తగ్గినట్లు కనబడుతున్న నేపథ్యంలో ప్రజలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, వైద్యులు, నిపుణులు, ప్రభుత్వాలు సూచిస్తున్నట్లుగా కరోనా నిబంధనలను పాటించే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మాస్కులు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాల్లో అలసత్వం ఉండకూడదన్నారు.


రాజకీయ పార్టీలు, కార్యకర్తలు కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. మహమ్మారి విషయంలో మనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ఆయన, కరోనా మూడో దశ రాకుండా అరికట్టేందుకు మన వంతు పాత్రను పోషించాలని తెలిపారు.తరచుగా తన రూపాన్ని మార్చుకుంటూ సరికొత్త సవాళ్లను విసురుతున్న కరోనా వైరస్ బారినుంచి మానవాళిని కాపాడుకునేందుకు అవసరమైన పరిష్కార మార్గాలను కనుగొనే విషయంలో మనం వ్యక్తిగతంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇందుకోసం టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం కావడం ద్వారా ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు.దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది చివరినాటికి ఉచితంగా టీకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంకల్పం, చేపట్టిన టీకాకరణ కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత వేగవంతం కానుందని విశ్వాసం వ్యక్తం  చేశారు

భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు చాలా తక్కువ సమయంలోనే ప్రభావవంతమైన టీకాను సిద్ధం చేయడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ మహత్కార్యంలో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నానన్న ఆయన, ఈ దిశగా చొరవతీసుకున్న భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా, డాక్టర్ సుచిత్ర ఎల్లా లను ప్రత్యేకంగా అభినందించారు.పలు భారతీయ సంస్థలు కూడా కరోనాకు టీకాను తీసుకురావడంలో విశేష కృషి చేశాయన్న ఉపరాష్ట్రపతి, మరికొన్ని సంస్థల ప్రయోగాల ఫలితాలు కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రపంచ ఫార్మా కేంద్రంగా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం టీకాలు మన దేశం నుంచే పంపిణీ అవుతున్నాయని, దీంతోపాటు భారీ మొత్తంలో జెనరిక్ డ్రగ్స్ కూడా మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 


ఎయిడ్స్ వ్యాధికి అవసరమైన యాంటీ-రిట్రోవైరల్ డ్రగ్స్ కూడా 80 శాతం భారతదేశం నుంచే యావత్ ప్రపంచానికి పంపిణీ అవుతుండటం, రానున్న రోజుల్లో ఫార్మారంగంలో భారతదేశం సాధించబోతున్న ప్రగతికి నిదర్శనమని ఆయన అన్నారు.2021 నాటికి మన దేశీయ ఫార్మా వ్యాపారం 42 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 3.12 లక్షల కోట్లు)గా భావిస్తుండగా.. 2030 నాటికి ఈ వ్యాపారం 120-130 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ. 9.6 లక్షల కోట్లకు) చేరుకోవచ్చనే అంచనాలున్నాయన్నారు. ఈ వ్యాపారంలో టీకాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ మారడం శుభపరిణామని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, జినోమ్ వ్యాలీ బయోటెక్నాలజీ హబ్‌గా తన ప్రత్యేకతను చాటడం అభినందనీయమన్నారు.


ఇటీవలే హైదరాబాద్‌లో కేంద్రీయ ఔషధ ప్రయోగశాల ఏర్పాటుకు అనుమతులు రావడం ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధికి మరింత ఊతమిస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ఎటువంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేలా మన వైద్యరంగ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి అభినందనీయమైనదని, ఈ ప్రయత్నంలో ప్రైవేటు రంగం కూడా కీలక భూమిక పోషించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.మన దేశంతోపాటు ఇతర దేశాల్లో టీకాకరణ కార్యక్రమాలకోసం భారత్ బయోటెక్ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, భారత్ బయోటెక్ సి.ఎం.డి డాక్టర్ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా, ఈడీ డాక్టర్ కృష్ణ మోహన్, శాస్త్రవేత్తలు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.