అంతర్జాతీయ మార్కెట్ ను అందిపుచ్చుకోవాలి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-01-21T21:13:21+05:30 IST

అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా భారత చేనేత, వస్త్ర పరిశ్రమలో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఎగుమతులను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఉరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్ ను అందిపుచ్చుకోవాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా భారత చేనేత, వస్త్ర పరిశ్రమలో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఎగుమతులను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఉరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశంలో నైపుణ్యమున్న కార్మికులు, వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో పురోగతి సాధించలేకపోవడానికి గల కారణాలను అన్వేషించుకుని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోకపోవడమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.


సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంతో పాటు మనదైన బ్రాండింగ్ కు పెద్ద పీట వేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ ను అందిపుచ్చుకోవాలని సూచించారు.వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏపీఈసీ) వర్చువల్ వేదికను అంతర్జాలం ద్వారా గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వస్త్ర పరిశ్రమల స్థాయిని పెంచకుండా, అధునాతన సాంకేతికతను అలవర్చుకోకుండా, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోకుండా, అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ ధరలతో కూడిన వస్త్ర పరిశ్రమను ఏర్పర్చుకోలేమన్న ఆయన, ఈ రంగంలో పూర్తి ఉపాధి అవకాశాలను, ఆర్థిక స్థోమతను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


వస్త్ర పరిశ్రమల రంగంలోని చిన్న సంస్థలకు అండగా నిలిచే అమెండెడ్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ (ఏటీయూఎఫ్ఎస్)ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ పథకం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని వస్త్ర పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. భారతీయ వస్త్ర పరిశ్రమకు, ఇక్కడి కార్మికుల నైపుణ్యానికి, మన దేశంలోని వనరులకు అంతర్జాతీయ ఖ్యాతిని అందించే దిశగా జరుగుతున్న ప్రయత్నంలో ఇదొక ప్రభావవంతమైన ముందడుగన్నారు.


ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 6 శాతంగానే ఉందన్న ఉపరాష్ట్రపతి, చిన్న పరిశ్రమలకు సరైన ప్రోత్సాహం అందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన దేశ చేనేత, వస్త్ర రంగాన్ని తీసుకెళ్లేందుకు వీలుంటుందన్నారు. మన వస్త్ర రంగ ఎగుమతులను పెంచే దిశగా కేంద్ర చేనేత, వస్త్ర మంత్రిత్వ శాఖతో కలిసి నీతి ఆయోగ్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. 


అంతర్జాతీయ ప్రమాణాలు, అక్కడి మార్కెట్ కు అనుగుణంగా భారతీయ వస్త్ర రంగాన్ని అభివృద్ధి చేయడంలో మన పారిశ్రామికవేత్తలు మరింత మెరుగుపరుచుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.  కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా కృషిచేస్తే ఈ రంగంలో భారతదేశం మరింత వృద్ధి సాధించడం ఖాయమన్నారు. త్వరలోనే భారతదేశం ఈ రంగం ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


భారత ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమ రంగం పోషిస్తున్న కీలకమైన పాత్రను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో ఉపాధికల్పన చేస్తున్న రెండో అతిపెద్ద రంగం వస్త్ర పరిశ్రమే అన్నారు. ఈ రంగంలో దాదాపు నాలుగున్నకోట్ల మంది ఉపాధి పొందుతున్నారన్న ఆయన, భారతదేశ యువశక్తిలోని సామర్థ్యాలను సానబెట్టి, ఆ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరింత ప్రగతిని సాధించవచ్చని సూచించారు.




వస్త్ర పరిశ్రమ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ఉటంకిస్తూ, ఈ పరిణామం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సామాజిక మార్పునకు, మహిళల సాధికారతకు బాటలు వేయడం అభినందనీయమన్నారు. ఈ రంగాన్ని మరింత విస్తృతం చేయడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి జరగాలన్నారు. దీని ప్రభావం బాలికల విద్యలో, లింగ వివక్షను రూపుమాపడంలో దోహపడుతుందని ఆయన ఆకాంక్షించారు.


ఈ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చి సరికొత్త అవకాశాలు కల్పించేందుకు వీలుందన్న ఆయన, 2022 నాటికి అంతర్జాతీయంగా 220 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో మన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు ఇదో చక్కటి అవకాశమని తెలిపారు.


ఇటీవల మానవతయారీ ఫైబర్, టెక్నికల్ టెక్స్ టైల్స్ లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఏపీఈసీ, కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ సంయుక్తంగా మెడికల్ టెక్స్ టైల్ (పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లవ్స్ మొదలైనవి) రంగానికి ప్రోత్సాహం అందించడం కరోనా నేపథ్యంలో దేశ సామర్థ్యాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారిందన్నారు.


ఈ ప్రయత్నాల కారణంగా పీపీఈ కిట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం రెండో స్థానానికి చేరుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీసుకున్న చొరవ కారణంగా ఈ రంగం సానుకూల మార్పులతో అభివృద్ది గమనంలో పయనిస్తుందన్న ఆయన, ఆమె చొరవకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత, వస్త్ర శాఖ మంత్రి  స్మృతి జుబిన్ ఇరానీ, ఏపీఈసీ చైర్మన్ డాక్టర్ ఏ. శక్తివేల్ తో పాటు పారిశ్రామిక వేత్తలు, ఎగుమతిదారులు, ఈ రంగానికి చెందిన ఇతర భాగస్వామ్యపక్షాలు అంతర్జాల వేదిక ద్వారా హాజరయ్యారు.

Updated Date - 2021-01-21T21:13:21+05:30 IST