మాతృభాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు సరైన దిశగాముందడుగు-వెంకయ్య

ABN , First Publish Date - 2021-07-21T20:47:13+05:30 IST

నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

మాతృభాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు సరైన దిశగాముందడుగు-వెంకయ్య

న్యూఢిల్లీ: నూతన విద్యాసంవత్సరం నుంచి ఎంపిక చేసిన శాఖల్లో పలు భారతీయ భాషల్లో కోర్సులు అందించాలని 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న వారిని అభినందిస్తున్నానని ఆయన ఫేస్ బుక్ వేదికగా కామెంట్ చేశారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 11 స్థానిక భాషలైన హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బి.టెక్ కోర్సులను అందించాలని నిర్ణయించడం సంతోషకరమని చెప్పారు. ఇది సానుకూల దిశగా పడిన అడుగు అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. 


మరిన్ని విద్యాసంస్థలు, ప్రత్యేకించి సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు అందించేవారు భారతీయ భాషల్లో కోర్సులు అందించడానికి ముందుకు రావాలి. ఈ తరహా ప్రయత్నాలు విద్యార్థి అభ్యసనానికి ఓ వరంగా ఉపయోగపడుతాయి.మనందరి జీవితాల్లో భాష ఓ భాగమని మనకు తెలుసు. మన మాతృభాషలు, మన భారతీయ భాషలు మనకు చాలా ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ఎందుకంటే మనమంతా మాతృమూర్తి పొత్తిళ్ళ నుంచే మాతృభాషతో బంధాన్ని పంచుకుంటామని, మన జీవితం ప్రారంభమైన నాటి నుంచి మనకు తెలిసిన శక్తివంతమైన భావోద్వేగ బంధాన్ని కలిగి ఉన్న భాష మాతృభాషేనని, భారతదేశం గొప్ప భాష-సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందడమే గాక, వందలాది భాషలు, వేలాది మాండలికాలకు నిలయమని చెప్పారు. మన భాషా వైవిధ్యం మన ఉన్నతమైన సాంస్కృతిక వారసత్వ మూలస్తంభాల్లో ఒకటి. 


ఇటీవల భాషాపరంగా సాగిన జనాభా లెక్కల ప్రకారం, మన దేశంలో 19,500 భాషలు, మాండలికాలు ఉన్నాయి. వాస్తవానికి మన దేశంలో 10,000 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషల సంఖ్య 121. మన జీవన వారసత్వానికి చెందిన ఈ భాషానిధి, మన ఉన్నతమైన గతవైభవానికి సంకేతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.‘విద్యావంతులు మాతృభాషా సమస్యతో సతమతమైతే, మనం కలలుగనే స్వేచ్ఛాయుత భారతావనిని సాధించలేమని నా భయం’ అంటూ మహాత్మా గాంధీ ఏ నాడో హెచ్చరించారు.అదే సమయంలో ‘అన్ని స్థాయిల్లో పాలనా భాషగా, బోధనా భాషగా మాతృభాషను కొనసాగించాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు. 


ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగు అవుతోంది. దీని వల్ల ఆయా భాషలకు చెందిన సాంస్కృతిక, మేధోవారసత్వం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతున్న 6000 భాషల్లో కనీసం 43 శాతం ప్రమాదంలో ఉన్నట్లు ఓ అంచనా. భాషావైవిధ్యానికి పేరుగాంచిన భారతదేశంలో 196 భాషలు ఈ ప్రమాదంలో ఉన్నాయి. ఈ గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన మాతృభాషలను పరిరక్షించుకోవడానికి మనం చర్యలు తీసుకోవడంతో పాటు, సమష్టి ప్రయత్నాలు కొనసాగించడం తక్షణావసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మన మాతృభాషలను రక్షించుకునేందుకు, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు బహుళ శక్తితో కూడిన విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది.


మాతృభాష పరిరక్షణ కోసం, ప్రోత్సహించడం కోసం కేంద్రప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టడం ఆనందదాయకం. నూతన విద్యా విధానం ప్రకారం అవకాశం మేరకు 5వ తరగతి వరకూ, 8వ తరగతి వరకూ మాతృభాష/ స్థానిక భాష / ప్రాంతీయ భాష / ఇంటి భాషల్లో విద్యను అందించడానికి ప్రోత్సాహం అందిస్తోంది.ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధనను అందించడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, వారిలో ఆత్మగౌరవం పెంపొందడమే గాక, వారిలో సృజనాత్మకత మరింత విస్తృతమౌతుందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మాతృభాషలో విద్యను అందించడం పిల్లలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చడమే గాక, వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.


అంతరించిపోతున్న భాషల పరిరక్షణ మరియు ప్రోత్సాహ పథకం (SPPEL) ద్వారా మన మాతృభాషల పరిరక్షణ కోసం విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఈ పథకం కింద, అంతరించిపోతున్న భాషలకు సంబంధించిన రాతప్రతుల సేకరణ, సంరక్షణ సాగుతుంది. భవిష్యత్తులో ప్రమాదంలో పడే భాషలకు సంబంధించి ఈ ప్రక్రియ సాగుతోంది. అయితే మాతృభాషను సంరక్షించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే ఆశించిన మార్పును తీసుకురాలేవు.మన భవిష్యత్ తరాల కోసం భాషా బంధాన్ని బలోపేతం చేయడానికి, ఎంతో అమూల్యమైన మన భాషలను సంరక్షించుకోవడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. ప్రతి భాషా, తనదైన జాతీయాలు, సామెతలు, సూక్తులతో నిండి ఉండడమే గాక విలువలు, ఆచారాలు, సంప్రదాయాలు, అభ్యాసాలు, కథలు, ప్రవర్తన మరియు నిబంధనలు కలిగిన సాంస్కృతిక భాండాగారం అనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.కొందరు తమ మాతృభాషలో మాట్లాడేందుకు వెనుకాడడాన్ని నేను అనేక సందర్భాల్లో గమనించానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మన మాతృభాషలో మాట్లాడేందుకు మనం గర్వపడాలి. ఇంట్లోనే కాదు... సాధ్యమైన, అవకాశం ఉన్న ప్రతిచోట మనం మాతృభాషలోనే మాట్లాడుతూ ఉండాలనేదని నా ప్రగాఢ ఆకాంక్ష. ఎందుకంటే, విస్తృతంగా ఉపయోగించినప్పుడు మాత్రమే భాషలు వృద్ధి చెందుతాయి, మనుగడ సాగిస్తాయని అన్నారు.


మాతృభాషలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని గట్టిగా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఇతర భాషలను అశ్రద్ద చేయమని కాదు. అలాంటి సూచన నేను చేయడం లేదు. వాస్తవానికి ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలని నేను తరచూ చెబుతున్నాను. మాతృభాషతో పాటు, సోదర భాషలను కూడా అధ్యయనం చేయమని సూచిస్తున్నాను. అయితే అదే సమయంలో మాతృభాష విషయంలో బలమైన పునాది కలిగి ఉండడం అత్యంత అవసరం.నానాటికీ విస్తృతమౌతున్న పరస్పర అనుసంధాన ప్రపంచంలో, వివిధ భాషల్లో నైపుణ్యం ఒక మేలైన నైపుణ్యాన్ని అందిస్తుంది. అదే విధంగా మనం నేర్చుకునే ప్రతిభాష, మరోక సంస్కృతితో మన బంధాన్ని బలోపేతం చేస్తుంది. అందుకే విద్యా సంస్థలు, తల్లిదండ్రులు మాతృభాషతో పాటు పిల్లలను కనీసం ఒక జాతీయ మరియు ఒక అంతర్జాతీయ భాషను నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి."విజ్ఞానశాస్త్రాన్ని మనం మాతృభాషలోనే బోధించాలి. లేదంటే అది ఉన్నతస్థాయికి చెందిన వారిది మాత్రమే అనే అపోహలకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు.ఫలితంగా ప్రజలందరికీ విజ్ఞానశాస్త్రం దూరమయ్యే ప్రమాదం ఉంది" అంటూ ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ సి.వి.రామన్ సైతం మాతృభాష ప్రాధాన్యతను తెలియజేశారు.


మాతృభాషలో అధ్యయనం మన గ్రహణశక్తి మరియు గ్రహణ స్థాయిని పెంచుతుందనే విషయాన్ని గమనించాలి. మరొక భాషలో ఓ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి మొదట ఆ భాషను నేర్చుకోవాలి, అందులో ప్రావీణ్యం పొందాలి. దీనికి చాలా శ్రమ అవసరం. కానీ మాతృభాషలో అధ్యయనం అలా ఉండదు. ఇంజనీరింగ్, మెడిసిన్, న్యాయశాస్త్రం లాంటి అన్ని సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు మాతృభాషలో బోధించే రోజును చూడాలన్నదే నా ఆకాంక్ష. ఈ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ ప్రశంసనీయం.ఉన్నత విద్యలో మన మాతృభాషల వినియోగం మన భాషలను పరిరక్షించి, ఆ దిశగా ప్రచారం సాగించడంలో ఓ కీలకమైన దశ. ఇదే స్ఫూర్తితో మాతృభాషలను సమృద్దంగా, బలంగా తీర్చిదిద్దుకుందామని ఉపరాష్ర్టపతి పిలుపునిచ్చారు.

Updated Date - 2021-07-21T20:47:13+05:30 IST