Abn logo
May 18 2020 @ 18:10PM

లైఫ్ ఆఫ్టర్ కరోనా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆలోచనలు

Kaakateeya

కరోనా వ్యాధి సంక్రమించిన పరిణామాల నేపథ్యంలో కరోనా ముందు జీవన శైలి, కరోనా తర్వాత మనమేవిధంగా వ్యవహరించాలనేదానిపై నా మనోగతాన్ని మీతో పంచుకోదలచుకున్నాను. బాధ్యతాయుతంగా ప్రకృతితో కలిసి జీవించేవిధంగా మన వ్యవహార శైలిలో, జీవన శైలిలో మార్పును తీసుకురావడమే ఈ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా మేలైన పరిష్కారం.


కరోనావంటి అత్యంత పాశవికమైన మహమ్మారులు ప్రపంచమానవాళికి కొత్తేం కాదు. అప్పుడప్పుడూ ఈ మహమ్మారులు సంక్రమించడం లక్షలాది ప్రాణాలను బలిగొనడం గురించి చరిత్రలో చదివాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఉపద్రవాలు మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పాయి. ప్రాణాంతక పరిస్థితులనుంచి బయటపడి జీవనగతిని మార్చుకునేందుకు దోహదపడ్డాయి. వైద్యరంగ నిపుణులు, ప్రపంచ ఆరోగ్యసంస్థ సీనియర్ అధికారులు సూచిస్తున్నట్లుగా.. ఇప్పడున్న కరోనా మహమ్మారిని ఒకవేళ మనం అనుకున్నదానికంటే ఎక్కువకాలం పాటు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తితే మనమేం చేయాలి? మార్పుతో కూడిన బాధ్యతాయుతమైన జీవన విధానమే దీనికి ఏకైక సమాధానం. హెచ్ఐవీ వంటి వ్యాధులు మానవాళిని చాలాకాలం పీడించాయి. ఇప్పటివరకు చాలా ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు కూడా రాలేదు. కానీ ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవడం వల్ల వీటిని ఎదుర్కొని జీవిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.


ఇలాంటి మహమ్మారులు సామాజిక పరిస్థితులు, ప్రజల జీవనాన్ని ప్రభావితం చేయడంతోపాటు చరిత్రగతిని మార్చాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బొనపార్టే.. ఉత్తర అమెరికాను జయించాలన్న కాంక్షతో బయలుదేరి.. హైతీలో ఉన్న సమయంలో యెల్లో ఫీవర్ తీవ్రంగా విజృంభించింది. అప్పుడు అక్కడున్న ఆఫ్రికన్ బానిసలకున్న వ్యాధినిరోధకత కారణంగా వారు ప్రాణాలు కాపాడుకోగా.. వేల సంఖ్యలో ఫ్రెంచ్ సైనికులు (వ్యాధినిరోధకత తక్కువగా ఉండటం వల్ల) చనిపోయారు. అమెరికాను జయించాలన్న నెపోలియన్ కాంక్షఅసంపూర్ణంగానే ముగిసింది. ఆ తర్వాత అక్కడ బానిసల నేతృత్వంలోనే హైతీ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంతకుముందు 1778లో బ్రిటీషర్లు కూడా యెల్లోఫీవర్‌ను తట్టుకునే వ్యాధినిరోధక శక్తి లేక హైతీ నుంచి వెనుదిరిగారని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో సమిష్టి వ్యాధినిరోధకత గురించి మళ్లీ చర్చ మొదలైంది. ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి 14వ శతాబ్దం మధ్యలో 60 శాతం మంది యురోపియన్లను కబళించింది. ఈ పరిస్థితి వడ్డీరేట్లలో తగ్గుదలను తీసుకొచ్చింది.


జీవితం బుద్బుదప్రాయమని, ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చని భావించిన యురోపియన్లు.. దాచుకోవడం కంటే విలాసవంతంగా బతికేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడి, తదనంతర కాలంలో పారిశ్రామిక విప్లవానికి బీజం పడింది. 1918లో స్పానిష్ ఫ్లూ కూడా చరిత్రపై బలమైన ముద్రవేసింది.


ఏవిధంగానైతే ప్రతి ఉపద్రవం తన ప్రభావాన్ని చూపించిందో.. కరోనా మహమ్మారి కూడా విశృంఖలంగా విజృంభిస్తోంది. రాజు-పేద, పోలీసు-ప్రధానమంత్రి, వయస్సు, మన, తన, వర్గ, వర్ణ, జాతి, మత భేదాలు అనే తేడాల్లేకుండా హద్దులు, సరిహద్దులు దాటి తన ప్రభావాన్ని చూపిస్తోంది. కనిపించని శత్రువైన కరోనా వైరస్ ఇంతటి ప్రాణనష్టం కలిగిస్తున్నప్పటికీ.. ఇది మనిషిలోని తాత్విక, ఆధ్మాత్మిక, నైతికత ధర్మాలను తట్టిలేపిందని భావించాలి. 13వ శతాబ్దం మధ్యలో బ్లాక్‌డెత్ విజృంభించినపుడు దేవుడు-మనిషి మధ్య సంబంధంపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఒకవేళ దేవుడనేవాడుంటే.. ఇంతమంది మరణిస్తున్నా ఎందుకు స్పందించడంలేదన్న చర్చ జరిగింది. అవే ప్రశ్నలు మళ్లీ ఇప్పుడు తలెత్తాయి.


మానవ జీవిత అర్థం, పరమార్థం ఏమిటి? కంటికి కనిపించని చిన్న వైరస్ మానవవాళికి కొత్తపాఠాలు నేర్పుతోంది. సాటి మనుషులతో మనకుండాల్సిన సంబంధాల స్వరూప, స్వభావాలను గుర్తెరిగి జీవించడం, మనతోపాటు మన సమాజ శ్రేయస్సుకు మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తోంది.


కరోనాకు ముందు మనమెలా జీవించేవాళ్లం!


దేవుడు సృష్టించిన విశ్వానికి ప్రతిసృష్టి చేసే స్థాయికి ఎదిగిన మానవుడు.. జన్యు మార్పులు, కృత్రిమమేధ, బిగ్ డేటా వంటి సరికొత్త అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో సృష్టించాడు. వీటి కారణంగా జీవితమంతా అద్భుతంగా, సాఫీగా సాగిపోతోంది, భౌతిక పురోగతి, విజయాల పరంపర, ఆనందం మధ్య జీవితం స్వేచ్ఛగా పరిగెడుతోందని అంతా భావించారు. ఈ జీవన గమనంలో ప్రతి ఒక్కరూ తోటివారితో పోటీ పడేవారే.


ఈ ప్రయత్నంలో తాను ఒంటరిగా మిగిలిపోయాననే ధ్యాసలో లేకుండా.. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడేవారు. ఇంట్లోకంటే బయటే ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటుపడిపోయారు. ప్రకృతిని పూర్తిగా విస్మరించడంతోపాటు.. చాలామంది దృష్టిలో కుటుంబ వ్యవస్థ, సమాజం అనేవి కృత్రిమ భావాలుగా మారిపోయాయి. అలాంటి వ్యక్తులు వారిదైన ప్రపంచంలో బతికేస్తున్నారు. అందే ప్రతిదాన్ని కృతజ్ఞతాభావం లేకుండానే స్వీకరించే పరిస్థితికి మనిషి చేరుకున్నాడు. మనిషి సృష్టించుకున్న ఇలాంటి వాతావరణం.. ప్రకృతికి, సహజమైన వ్యవస్థకు ఓ సవాలుగా మారింది. ఇలాంటి క్రూరమైన వైఖరి కారణంగా అసమానతలు పెరిగి ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. జీవన గమనంలో ఇతరులతో పోటీపడుతున్న ప్రతి ఒక్కరూ.. తాము బతుకుతున్న విధానం సరైనదా? కాదా? అని తరచిచూసుకునేందుకు కూడా తీరికలేకుండా గమ్యమనేది లేకుండానే.. సంతోషంగా ఉన్నామన్న భ్రమలో మున్ముందుకు సాగుదామనుకున్నారు.


కరోనా తర్వాత ఇకపై ఎలా ఉండాలి!


గతేడాది ఆఖర్లో ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఆవరిస్తున్న సమయంలో.. వస్తే ఏమవుతుందిలే? అన్న అహంకారభావంతో ఊగిపోయిన మనుషులకు.. వీలైనంత త్వరగా జీవితాలను, జీవిత గమనాన్ని మార్చేస్తానని ఈ కంటికి కనిపించని శత్రువు తెలియజేసింది. తనతో కలిసి జీవన ప్రయాణం చేసే పరిస్థితిని సృష్టించింది. ప్రపంచం మొత్తాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది. బస్సుల్లేవు, కార్లులేవు, రైళ్లులేవు, మెట్రోల్లేవు, విమానాల్లేవు, మాల్స్ లేవు, సినిమా హాళ్లు లేవు, పాఠశాలలు, కాలేజీలు లేవు.. పరిశ్రమల్లో యంత్రాల చప్పుళ్లు లేవు ఇలా ప్రతి వ్యవస్థా స్తంభించిపోయింది.


దీంతో ప్రపంచమంతా ముగిసిపోయినట్లేనా? జీవితం చరమాంకానికి చేరినట్లేనా?


కాదు... కచ్చితంగా కాదు. మార్చి 24, 2020న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో 130 కోట్ల మంది భారతీయులు.. కరోనా వైరస్‌ను తరిమేసేందుకు స్వీయ నిర్బంధంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచమంతా చాలావరకు ఇదేవిధంగా కరోనాపై పోరాటం చేసింది. మరింత ఎక్కువకాలం జీవించాలనేదే ప్రతి ఒక్కరి ధ్యేయంగా మారింది. జీవన భద్రత, సరికొత్త జీవనాన్ని అలవర్చుకోవాలన్న తపన ప్రతి ఒక్కరిలో కనిపించింది.


ఇంటినుంచే పనిచేయడం, సామాజిక దూరాన్ని పాటించడం, పరిశుభ్రంగా ఉండటం, ఇంటినుంచే పాఠాలు, విద్య (రిమోట్ లెర్నింగ్) వంటి అనేక కొత్త పదాలు, కొత్త ఒరవళ్ళు, కొత్త మార్పులు మన జీవితంలో భాగమయ్యాయి. ‘గృహమే కదా స్వర్గసీమ’ అన్న భావన మనలో వ్యక్తమవుతోంది.


ప్రగతి సాధించే సమాజంలోని ఆర్థిక ప్రక్రియలో అనేక లోపాలున్నాయని కరోనా వైరస్ మనకు గుర్తుచేసింది. ఇలాంటి అనిశ్చిత స్థితి ప్రజల్లో మానసిక సంఘర్షణకు తద్వారా మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించుకోగలం? ప్రాచీన విలువలను అర్థం చేసుకుంటూ సరికొత్త జీవన విధానాన్ని రూపుదిద్దుకోవడమే దీనికి సమాధానం.


నాగరికతకు సవాలు విసురుతున్న కరోనా


కరోనాపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటం వ్యక్తిగతంగా ప్రాణాలను కాపాడుకోవాలన్న అంశం కాదనే విషయాన్ని గుర్తించాలి. ఇది యావత్ ఆధునిక నాగరికతకు వైరస్ విసురుతున్న సవాల్‌గానే భావించాలి. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, నైతిక విలువలతో కూడిన ఉన్నతమైన వ్యవస్థకు రూపమే నాగరికతకు నిర్వచనం. ఇలాంటి అంశాల ఆధారంగానే మెసపటోమియా, సింధు, అజ్టెక్, మయన్, రోమన్, ప్రాచీన ఈజిప్టు నాగరికతలు.. విభిన్న సమయాల్లో విలసిల్లాయి. ప్రతి నాగరికతకు తనదైన నిబంధనలు, నైతిక విలువలు, సంప్రదాయాలుండేవి. మానవ జీవన మనుగడను పెంచడమే ప్రతి నాగరిత లక్ష్యం. కరోనా సవాల్ విసురుతున్న సమయంలో ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోగలం? మన నాగరిక సమాజాన్ని కాపాడుకునే లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలం? ఇందుకు కావాల్సిన కొత్త నిబంధనలేమిటి? ఇవే మన ముందున్న ప్రశ్నలు.


ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీ వైద్య చరిత్ర అధ్యాపకుడు శ్రీ ఫ్రాంక్ ఎం స్నోడెన్ చెప్పిన దాని ప్రకారం.. ‘కరోనా వంటి మహమ్మారులు మానవాళి జీవితానికి దర్పణాల వంటివి. మనుషులకు తోటివారితో ఉన్నటువంటి నైతిక బంధాలను ఇవి ప్రతిబింబిస్తాయి. మనముందు అద్దాన్ని ఉంచి మనమెవరమో తెలుసుకునేందుకు దోహదపడతాయి. లోతైన అంతరంగపు ప్రతిబింబాన్ని గురించి తెలుసుకునే పరిస్థితులను మనకు కల్పిస్తాయి.


ఒక నూతన జీవన విధానానికి, సాధారణ పరిస్థితికి కావలసినవి


గత నాలుగు నెలలుగా, ప్రజలు ఇళ్ల వద్దే ఆందోళనతో ఉంటున్నారు. రోజు రోజుకి కరోనా సోకిన వారి సంఖ్య, చనిపోయిన వారి సంఖ్యల్లో పెరుగుదలతో పాటు జీడీపీలో తగ్గుదల గురించి ఆలోచిస్తున్నారు. మరో వైపు తమ ఇళ్లకు చేరుకునేందుకు రహదారుల వెంట నడుస్తున్న వలస కార్మికుల సంఖ్య కూడా వారిలో ఆందోళన నింపుతోంది. మూడు లాక్‌డౌన్‌ల తర్వాత.. ఊహించిన విధంగా మరియు అవసరమైన మేరకు, పరిమితుల్లో చాలా సడలింపులు జరిగాయి. ఎందుకంటే ప్రజలు కరోనా కోసమే ఇళ్లకు పరిమితమై ఎక్కువకాలం జీవించడం సాధ్యం కాదు. జీవితం అంటే జీవనోపాధి కూడా, అదే విధంగా స్వేచ్ఛకున్న విలువను కూడా నేను గౌరవిస్తాను. నియంత్రణలో ఉన్న స్వేచ్ఛ ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోనూ విఫలం కాదు. సహేతుకమైన పరిమితులు ఎల్లప్పుడూ ఒక క్రమ పద్ధతిలో ముందుకు నడిపిస్తాయి. కాబట్టి, కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఈ పరిమితుల్లో మనం ఇకపై ఎలా జీవించాలనే ప్రశ్నకు, కరోనా కారణంగా విధించిన ఆంక్షలన్నీఎత్తేసిన తర్వాత నూతన సాధారణ జీవనానికి నేను మిత్రులకు కొన్ని సూచనలు చేయదలచుకున్నాను.


ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ వ్యాధికంటే భయమే మరింత ప్రమాదకరంగా మారింది. అందుకనే.. కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తలను గంట గంటకూ తెలుసుకోవాల్సిన పనిలేదు. రోజుకోసారి చూస్తే సరిపోతుంది. అసలు చూడకపోయినా ఇబ్బందేమీలేదని నేను తరచుగా చెబుతున్నాను.


ఎందుకంటే.. ‘భయం’ మన కల్పనలతో చాలా భయంకరంగా ఆడుకుంటుంది. అది అన్నిరకాల విపత్కరమైన చిత్రాలను మనస్సులో చిత్రీకరించుకుంటుంది. ‘నమ్మకం’ అనేదే ఈ భయానికి సరైన విరుగుడు. భయం చీకటి, నీడలను మాత్రమే చూస్తుంది. కానీ విశ్వాసం మాత్రం.. చీకటి వెనక దాగున్న వెండి వెలుగురేఖను, మేఘం వెనకున్న సూర్యుడినీ చూడగలుగుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా ‘విశ్వాసంతో కూడిన ఆలోచనలే మనిషిని సరైన దిశలోకి మళ్లించి కార్యోన్ముఖులను చేస్తాయి’. అందుకే నేటి పరిస్థితుల దృష్ట్యా.. ప్రతి ఒక్కరూ భయాన్ని వీడి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది.


కరోనా నేపథ్యంలో మనం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. మన జీవనం (life) వేరు, మన జీవనవిధానం (lifestyle) వేరు. గత ఐదు దశాబ్దాల్లో మన జీవనంలో, జీవనశైలిలో వచ్చిన మార్పులను సమీక్షించుకోవాలి. అంతకుముందున్న మన సంప్రదాయ పద్ధతులను అర్థం చేసుకుని.. ఆ పద్ధతులను మళ్లీ మన జీవనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. జీవనానికి, జీవనశైలికి మధ్య సమతుల్యతను పాటించాలి. ‘మానవసేవే మాధవ సేవ’నే నానుడిని అందరూ అమలుచేయాలి.


వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం, తోటపని, మన పని మనం చేసుకోవడం, సైకిల్ తొక్కడం, ఇంటిచుట్టూ తిరగడం, మెట్లు ఎక్కడం, పిల్లలతో ఆడుకోవడం ఇవన్నీ వ్యాయామమే. బద్ధకంగా సోఫాలో సాగిల పడిపోవడం తప్ప ఏపని చేసినా అది వ్యాయామమే! ఇవన్నీ వేరెవరి కోసమో కాదు. మనకోసమేనని మనం గుర్తించి అలవర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యకర సమాజ నిర్మాణం తద్వారా కరోనావంటి కనబడని శత్రువుపై విజయం సుసాధ్యమవుతుంది.


జీవితం ఎంతో విలువైనదని, ప్రకృతితో మరియు తోటి జీవులతో కలిసి అర్థవంతగా జీవించాలనే విషయాన్ని అవగతం చేసుకోవాలి. కుటుంబంతో తగిన సమయం గడపాలి. పెద్దలు, పిల్లలతో.. పిల్లలు, పెద్దలతో సమయం గడపాలి. ప్రకృతితో మమేకమై జీవించాలి.


ఒక వ్యక్తిని ఎక్కడైనా ప్రభావితం చేసే అంశం.. ప్రతి చోట, ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తించాలి. అది వ్యాధి కావచ్చు. లేదా ఆర్థిక వ్యవస్థ కావచ్చు. మన జీవితం ఇతరుల జీవితాలపై ఆధారపడి ఉంటుందని, అందరి జీవితాలు ఒకదానితో మరొకటి అవినాభావసంబంధంతో ఉంటాయని గ్రహించాలి. బయటకు రావడానికి లేదా ఏదైనా పని చేయడానికి ముందు వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం ముఖ్యం.


ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను బట్టి అది వీలైనంత త్వరగా కార్యరూపం దాలుస్తుంది. అనిశ్చిత పరిస్థితులకు వెంటనే స్పందించకూడదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విశ్వసనీయమైన, హేతుబద్ధ మార్గంలోనే ఆలోచించాలి. భయాన్ని వదిలి, ఆత్మవిశ్వాసంతో జీవించే పరిస్థితిని అలవాటు చేసుకోవాలి.


మాస్క్ లు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడం వంటి లాక్‌డౌన్ ప్రవర్తనా నియమాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు. పాత అలవాట్లు మానుకోవాలి లేదా మార్పు తెచ్చుకోవాలి, ప్రస్తుత ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి.


యోగ, ధ్యానంతో పాటు సానుకూల దృక్పథాన్ని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. వీటి కోసం గతంలో మనకున్న అలవాట్ల గురించి ఆలోచించకుండా, నూతన మార్గంలో అవసరమైన విధంగా, అనుకూలమైన మేర మార్పులు చేసుకోవాలి. పుస్తకాలు చదవాలి, ఆధ్మాత్మిక భావన పెంచుకోవాలి, ధర్మ ప్రవర్తన అలవర్చుకోవాలి. కరోనాతో జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో, కరోనా బాధితుల పట్ల దయ. మానవత్వంతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం.


మన తోటి వారిని వైరస్ వాహకులుగా ముద్ర వేసే ముందు, వారికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇచ్చే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమీక్షించుకోవాలి.


ముఖ్యంగా అన్ని రకాల సమాచార మాధ్యమాలు కూడా వ్యాధిని విపత్తుగా చూపించడానికి బదులు, సరైన మరియు సశాస్త్రీయ సమాచారాన్ని వ్యాప్తి చేయాలి. సమిష్టి నిస్సహాయతా భావాన్ని.. పరస్పర అవినాభావ సంబంధంతో కూడిన జీవితంతో పూరించాలి. అందరి సమస్యలను పంచుకుంటూ, పరస్పర సహకారంతో ముందుకు సాగాలి.


నేను ఇంతకుముందు పేర్కొన్నట్లుగా.. లాక్‌డౌన్ పొడగింపు, సడలింపు, ముగింపు మనం పాటించే స్వీయనియంత్రణలోనే ఉన్నది. గాయం అనేది మనిషిలోకి కాంతి ప్రవేశించే ప్రదేశం అన్న ప్రసిద్ధి కవి రూమి వాక్యాల స్ఫూర్తితో, ప్రస్తుత బాధల నుంచి అనుభవంతో మరిన్ని పాఠాలు నేర్చుకుని వెలుగులమైన ప్రకాశిద్దాం. ఈ సమస్యల తర్వాత పరిస్థితులపై జరిపిన అధ్యయనాలు, జీవితంతో మన సంబంధాన్ని మార్చిన సమస్యలను అధిగమించేందుకు ప్రయత్న పూర్వక పరిస్థితుల వైపు సాగాలని తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం సాగుతున్న ఈ యుద్ధాన్ని గెలిచే దిశగా మన తరాన్ని వేగంగా, ఆశాజనకంగా నూతన సాధారణ పరిస్థితుల వైపు సాగనివ్వాలి. అందరూ విభిన్నంగా, సురక్షితంగా జీవించాలి.


 - ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

Advertisement
Advertisement