శారీరక దృఢత్వం, పౌష్టికాహారంతోనే పరిపూర్ణ ఆరోగ్యం : వెంకయ్య

ABN , First Publish Date - 2020-09-27T16:36:17+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కోవిడ్ -19 మహమ్మారి బారిన పడుతున్న

శారీరక దృఢత్వం, పౌష్టికాహారంతోనే పరిపూర్ణ ఆరోగ్యం : వెంకయ్య

న్యూ ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కోవిడ్ -19 మహమ్మారి బారిన పడుతున్న తరుణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ ప్రతి రోజూ వ్యాయామం కోసం కనీసం అరగంట సమయం కేటాయించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు.


వెంకయ్య సూచనలు..

మన దిన చర్యలో ఫిట్ నెస్ కి డోజ్, ఆధా ఘంటా రోజ్ అంటూ వారు చెప్పిన ఆరోగ్య మంత్రాన్ని మనమంతా పాటించాలి. మన రోజూ వారి కార్యక్రమాల్లో అర్థవంతమైన వ్యాయామ నియమావళిని చేర్చడం నిస్సందేహంగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి బాటలు వేస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గుర్తించి, పెంపొందించుకునే దిశగా కోవిడ్ -19 మహమ్మారి నేర్పిన పాఠాలు విస్మరించలేనివి.. విలువైనవి. అనారోగ్య నివారణకు సమతుల ఆహారంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరం. ఆరోగ్యంగా జీవించటం ప్రస్తుతం అవసరం. ఇది మన విధులను సమర్థవంతంగా నిర్వహించేటప్పుడు అనేక రకాల శారీరక అనారోగ్యాలను అరికట్టడంలో మనకు సహాయం చేస్తుంది. దేశంలో నానాటికి పెరుగుతున్న అసంక్రమిత (నాన్-కమ్యునికబుల్) వ్యాధులకు ప్రధాన కారణాల్లో చైతన్య రహిత జీవనశైలి కూడా ఒకటి అనే విషయం మనందరికీ బాగా తెలుసు. ఈ నేపథ్యంలో జాగింగ్, రన్నింగ్, వేగంగా నడవడం, ఏరో బిక్స్, ఆసనాలు వేయడం లాంటి ఏదో ఒక శారీరక వ్యాయామం మన దినచర్యలో భాగం కావలసిన అవసరం ఉంది. ప్రపంచానికి యోగాను భారతీయులు బహుమతిగా అందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేసే యోగ మార్గాన్ని మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. శతాబ్ధాలుగా యోగాసనాలు, ప్రాణాయామం లాంటివి లక్షలాది మందికి ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన జీవితాన్ని గడిపే దిశగా సహాయం చేశాయి. ప్రస్తుతం మనమంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో, శారీరక దారుఢ్యం పెంపొందించుకునేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి అని వెంకయ్య ప్రతి ఒక్కరికీ సూచించారు.


మనమంతా గ్రహించాం..

వాస్తవానికి యోగ, ధ్యానం లాంటివి ప్రస్తుత ప్రపంచం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పాఠశాలలు మరియు కళాశాలల్లో క్రీడలతో పాటు రోజూ వారి పాఠ్య ప్రణాళికలో భాగం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శారీర దృఢత్వాన్ని అందించే దినచర్యతో పాటు, ఆరోగ్యకరమైన మరియు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. వేగవంతమైన పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి ప్రజల ఆహారపు అలవాట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. మన ఆహారపు అలవాట్లను నియంత్రించుకునేందుకు, చక్కదిద్దుకునేందుకు ఇది సరైన సమయం. ఆహారాన్ని తీసుకునేది కేవలం రుచి కోసమే కాదు. మనం తినాల్సింది పౌష్ఠికాహారం అనే విషయాన్ని గుర్తు పెట్టుకుందాం. మన ఆహారాన్ని పోషకాలు, ప్రోటీన్లతో భర్తీ చేసుకుని, ఆరోగ్యకరమైన ఆహారంగా తయారు చేసుకుందాం. ఈ మహమ్మారి మనందరికీ సాధారణ జీవితం దిశగా నెట్టింది. ఫలితంగా సనాతన సంప్రదాయ ఆహారపు అలవాట్లను తిరిగి నిత్యజీవితంలో భాగం చేసుకోవడం యొక్క ప్రాధాన్యతను మనమంతా గ్రహించాం. ప్రాచీనకాలం నుంచి మన పెద్దలు ఆయా వాతావరణ పరిస్థితులకు, ఆయా ప్రదేశాలకు తగినట్లుగా మనం తీసుకునే ఆహారంలో వివిధ ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలను దూరదృష్టితో చేర్చారు. ఈ మహమ్మారి తీసుకొచ్చిన మార్పు ఏమిటంటే, చాలా మంది ప్రజలు ఇంట్లోనే తయారు చేసుకున్న తాజా సేంద్రీయ ఆహారాన్ని ఆశ్రయిస్తున్నారు అని ఉపరాష్ట్రపతి అన్నారు.


ఇదే భారతీయ జీవన విధానం..

‘‘మన పెద్దలు చెప్పినట్లుగా నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సత్ గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట అనారోగ్యం కానీ, ముసలితనం కానీ ఉండవు. ఆరోగ్యకరమైన మార్గంలో మన జీవితాన్ని సాగించేందుకు మన రోజు వారి కార్యకలాపాల్లో ‘దినచర్య’, కాలానుగుణ కార్యకలాపాల్లో ‘ఋతుచర్య’ సూత్రాలను అనుసరించాలి. మన పూర్వీకులు సూచించిన ఆహారం కాలానుగుణంగా అనేక పరీక్షలకు నిలిచి మన ఆరోగ్యాన్ని కాపాడేదని రుజువు అయ్యింది. వివిధ భౌగోళిక, ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, కాలాల అవసరాలకు అనుగుణంగా మన ఆహారం ఉంటుంది. కాలానుగుణంగా లభించే స్థానిక ఆహారాన్ని తీసుకోవడమే భారతీయ జీవన విధానం. ఇది సంప్రదాయ భారతీయ వైద్య విధానాల ద్వారా ఆమోదం పొందిన ఆరోగ్య సూత్రం కూడా’’ అని వెంకయ్య అన్నారు.


గుర్తుంచుకోండి..!

దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగించే తృణధాన్యాలతో చేసిన ఆహారంలో పోషకాలు అధికంగా ఉన్నాయనే విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ జోలికి పోకుండా కాల పరీక్షలకు నిలబడిన సంప్రదాయ ఆహారాన్ని ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలని యువతకు సూచిస్తున్నాను. వంట చేసే ప్రతిసారి బామ్మ గారి వంటకాలను గుర్తుంచుకోండి. నేను ఏ విధమైన ప్రత్యేక ఆహారాన్ని సూచించడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం ప్రాధాన్యతను మాత్రమే నొక్కిచెబుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మనందరికీ తెలుసు. శారీరక దారుఢ్యం కోసం ప్రతిరోజూ సమయం కేటాయించుకుని, శ్రమించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలము. ఇది జీవితాంతం పరిపూర్ణమైన ఆరోగ్యంతో, ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి సహాయపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని శారీరక దారుఢ్యాన్ని అందించే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని వెంకయ్య పేర్కొన్నారు.

Updated Date - 2020-09-27T16:36:17+05:30 IST