Abn logo
Sep 20 2020 @ 12:45PM

మనోగతం విస్మరించజాలని వీరనారి ఉదా దేవి: వెంకయ్య

Kaakateeya

న్యూఢిల్లీ: భారతదేశం స్వరాజ్యం సముపార్జించి 75 సంవత్సరాల మైలురాయికి చేరువౌతున్న తరుణంలో స్వాతంత్ర్య ఉద్యమంలో అమూల్యమైన త్యాగాలు చేసిన వందలాది మంది విస్మరించజాలని వీరులను గుర్తు పెట్టుకుని కృతజ్ఞతలు అర్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వారిలో చాలా మంది మారుమూల గ్రామాలకు చెందిన వారే కావచ్చు, కానీ ఇప్పటికీ వారి జీవితాలు ఎంతో మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయని తెలిపారు.  వారి పోరాటం మాతృభూమి రక్షణ కోసం, బ్రిటీష్ వారి దురాగతాలకు వ్యతిరేకంగా సాగిందన్నారు. బ్రిటీషర్లు తమకేదో చేశారనే భావనలో ఉన్న వారికి, ఇలాంటి మహనీయుల త్యాగాలు కనువిప్పు కలిగిస్తాయని చెప్పుకొచ్చారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు అసాధారణమైన తెగువతో, అరుదైన సంకల్పంతో సాధారణమైన వారిలా కనిపించే ఎంతో మంది స్త్రీలు, పురుషులు అసాధారమైన త్యాగాలు చేశారని... వీరంతా ఎవరనే విషయం కొంత మందికి తెలియదన్నారు. దురదృష్టవశాత్తు వారి శౌర్యం, త్యాగాలకు మన చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కలేదని వాపోయారు. ‘‘స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న విస్మరించజాలని వీరనారీమణుల గురించి తెలియజేయడంలో భాగంగా ఈ రోజు తుపాకీ  పేల్చే నేర్పుతో బ్రిటీషర్లను సైతం ఆశ్చర్య చకితుల్ని చేసిన ఉదా దేవి సాహసోపేతమైన గాథను గుర్తు చేస్తున్నాను. 1857లో భారతదేశ తొలిస్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా లక్నోలో జరిగిన సికందర్ బాగ్ భీకర యుద్ధంలో ఓథ్ ల మహిళా సైన్యానికి నాయకత్వం వహించిన వీరాంగన ఆమె. వీరనారి ఉదా దేవి ఓధ్ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి చెందిన బలహీన వర్గాల కుటుంబంలో జన్మించారు. బ్రిటీషర్ల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ పెరిగిన ఆమె ‘దళిత వీరాంగన’గా కీర్తి సంపాదించారు. ఓధ్ చివరి నవాబు వాజిద్ అలీ షా ను బ్రిటీష్ వారు కలకత్తాకు బహిష్కరించిన నేపథ్యంలో అతడి భార్య బేగం హజ్రత్ మహల్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో తననూ చేర్చుకోవాలని ఉదాదేవి, బేగంను సంప్రదించినట్లు చెబుతారు. ఉదాదేవి శిక్షణ కోసం బేగం ఏర్పాట్లు చేసి, శిక్షణ పొందిన మహిళా సైనికుల సంఖ్యను మరింత పెంచమని కోరారు. అదే సమయంలో ఉధ్ సైన్యంలోని సైనికుడైన మక్కా పాస్సితో ఆమె వివాహం జరిగింది. సికిందర్ బాగ్ అనేది నవాబు యొక్క బలమైన మహల్. 2200 మంది సైనికుల దండు రక్షణలో మహల్ ఉండేదని చెబుతుంటారు. 1857 నవంబర్ 16న, కోలిన్ క్యాంప్ బెల్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బ్రిటీష్ దళాలు సికందర్ బాగ్ పై దాడి చేశాయి. అంతకు ముందే మక్కా పాస్సి బ్రిటీషర్లతో జరిగిన ఓ పోరాటంలో అమరుడయ్యారు. భర్త బలిదానానికి ప్రతీకారం తీర్చుకుంటానని అప్పటికే ఉదా దేవి ప్రతిన బూనారు.  భారీగా మోహరిస్తున్న బ్రిటీష్ సైన్యం మీద వేరు వేరు దిశల నుంచి దాడి చేయాలని ఆమె తమ దళాలకు దిశానిర్దేశం చేశారు. రెండు చేతుల్లో తుపాకులను, తగినంత మందుగుండు సామగ్రిని తీసుకుని చెట్టు ఎక్కిందని చెబుతుంటారు. మగ సైనికుల దుస్తులు ధరించి, దట్టమైన ఆకుల వెనుక దాక్కుని బ్రిటీష్ సైనికుల మీద నేర్పుగా కాల్పులు జరిపారని చెబుతారు. ఆమె కాల్పుల్లో 30 మంది సైనికులు మరణించగా, చాలా మందికి గాయాలు అయ్యాయి. ఈ ఆకస్మిక పరిణామం బ్రిటీష్ సైనికాధికారులను ఆశ్చర్య పరిచింది. చెట్టు మీద ఉన్న ఆమెను గుర్తించి కాల్చి చంపే లోపే ఆమె తుపాకి నేర్పునకు బ్రిటీష్ సైనికులు బలయ్యారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించిన బ్రిటీషర్లు రెండు చేతుల్లో తుపాకులు, పురుషుని దుస్తులు ధరించిన స్త్రీమూర్తి అని తెలిసి ఆశ్చర్యపోయారు. నేటికీ, పిలిభిత్ ప్రాంతలోని పాస్సి సమాజం ఏటా నవంబర్ 16న ఆమె త్యాగాలను గుర్తిస్తూ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇలాంటి ఎంతో మంది యోధుల శౌర్య, త్యాగాలను మనం గుర్తించడమే గాక, వారి వీరోచిత గాథలను మన చరిత్ర పుస్తకాల్లో చేర్చి ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది’’ అంటూ వెంకయ్య పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement