Abn logo
Sep 26 2021 @ 01:51AM

వైస్‌ ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా

వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు హాజరైన ఏకైక ఎంపీటీసీ నాగభూషణం

9మందికి ఒక ఎంపీటీసీ మాత్రమే హాజరు 


పిచ్చాటూరు, సెప్టెంబరు 25: పిచ్చాటూరు మండలంలో శనివారం జరగాల్సిన వైస్‌ ఎంపీపీ ఎన్నికకు ఒకే ఒక ఎంపీటీసీ నాగభూషణం మాత్రం హాజరు కాగా మిగిలిన 8 మంది గైర్హాజరు కావడంతో వైస్‌ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు శనివారం చివరి రోజు అయినా కూడా కోరం లేకపోవడంతో ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఎంపీపీని, కో-ఆప్షన్‌ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ వైస్‌ ఎంపీపీ పదవి కోసం మొదట ఇద్దరు పోటీపడగా అది కాస్తా ఐదుగురికి పెరిగింది.ఎవరికి వారు పట్టుదలకు పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి ఆర్‌వో దామోదర నాయుడు, ఎంపీడీవో శ్రీనివాసులు వచ్చారు.అయితే ఎంపీటీసీ సభ్యురాలు నాగభూషణం మాత్రమే హాజరు కావడంతో సాయంత్రం వరకు ఎదురుచూసి కోరం లేక  వైస్‌ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.