విభ్రాంత క్రీడ

ABN , First Publish Date - 2022-06-27T10:21:21+05:30 IST

ఆధారమే లేని భూమి బొంగరాన్ని ఆది మధ్యాంతం బాటన ఆటబొమ్మను చేసి...

విభ్రాంత క్రీడ

ఆధారమే లేని భూమి బొంగరాన్ని

ఆది మధ్యాంతం బాటన ఆటబొమ్మను చేసి

ఆడించే అదృశ్య దారమేది


తూరుపు తెరచాప నావనెక్కి

చీకటి సముద్రపు చివరిబొట్టును సైతం

చిటికెలో తోడేసే చేతులెవ్వరివి


చండ ప్రచండ ప్రళయాగ్ని గోళాన్ని

పడమటి పళ్ళెంలో పరమాన్నం ముద్ద చేసి

ఆంబుక్క పెడుతున్న ఆననమేది


అవని అంచులమీద అలల విన్యాసాలతో

ఆడేటి జలకన్య అడుగులకు, తడబడని

ఆట నేర్పేటి ఆ ఆదిగురువెవ్వరు


కంటికే కనబడక సంచరిస్తూ

సర్వప్రాణులను ఊపిరుల ఉయ్యాలలో ఊపి

సయ్యాటలాడించు సాధుజంగమ ఎవరు


ఒత్తి లేదు, చమురు చుక్క లేదు

వెలిగించి ఆర్పేటి రేడు లేడు

విశ్వవినువీధుల్లో వెలిగేటి దీపాల

కాంతి కారకుడైన విభుడు ఎవడు


నేతగాడెవ్వడూ నేయనే లేదు

కంటికింపైన ఏ రంగు వేయనే లేదు

ప్రాణికోటిపై ఒల్లెడై ఒదిగిన

పారదర్శకపు పరదాను పరచిన ప్రభువెవ్వడు


తల్లెవ్వరో, దాని ఇల్లెక్కడో

తరగ తురగమై తారాడు తావెక్కడో

దగ్ధకేళికై ఇలపైన కాలు మోపగానే

కీలలను ఎగదోయు కాలుడెవ్వడు


పంచభూతాలు ఆడేటి అవ్యక్త ఆటలు

ప్రకృతి రహస్యంగా పాడేటి పారవశ్యపు పాటలు

కార్యకారక సంబంధ సంచలన దృశ్యాలు

మనిషి నబ్బురపరచే నైరూప్య భావచిత్రాలు


సృష్టి స్థితిలయల విభ్రాంత విన్యాస క్రీడలో

విశ్వమే మహా వింతకావ్యం


మర్మ, ధర్మాల మాటలు వేనవేలున్నా

విశ్వరహస్యాల శోధన యుగాలు దాటినా

అంతు చిక్కీచిక్కని వింత ప్రశ్నల చింతనలో


మనిషెప్పటికీ...

కలల కల్లోల అలలపై కదలాడు పడవనే

స్నిగ్ధ ఛాయల్లో అల్లాడు అన్వేషియే

తల్లి ఒడిలోన ఆటాడు పిల్లవాడే

గాజోజు నాగభూషణం

98854 62052


Updated Date - 2022-06-27T10:21:21+05:30 IST