కరోనా బారిన పడి కోమాలోకి వెళ్లిన నర్సు.. వయాగ్రాతో చికిత్స.. మరణం తప్పదనుకుంటుండగా...

ABN , First Publish Date - 2022-01-04T04:02:34+05:30 IST

కరోనాతో మరణం అంచుకు చేరుకున్న ఓ మహిళను వయాగ్రా ఔషధం అనూహ్యంగా కాపాడింది. పురుషుల అంగస్థంభన సమస్యలను చికిత్సగా వాడే ఈ ఔషధం ఆమె పాలిట సంజీవనిగా మారింది.

కరోనా బారిన పడి కోమాలోకి వెళ్లిన నర్సు.. వయాగ్రాతో చికిత్స.. మరణం తప్పదనుకుంటుండగా...

ఇంటర్నెట్ డెస్క్:  కరోనాతో మరణం అంచుకు చేరుకున్న ఓ మహిళను వయాగ్రా ఔషధం అనూహ్యంగా కాపాడింది. పురుషుల అంగస్థంభన సమస్యలకు చికిత్సగా వాడే ఈ ఔషధం ఆమె పాలిట సంజీవనిగా మారింది. మరో రెండు రోజుల్లో మరణం తప్పదనుకుంటుండగా.. ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా ప్రాణాలతో బయటపడింది. బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన నర్సు మోనికా ఆల్మెడా.. గతేడాది నవంబర్‌ 6న కరోనా బారిన పడింది. నవంబర్ 9న ఆమె స్థానిక ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి దిగజారడంతో వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించారు. ఆ తరువాత.. వైద్య చికిత్సలో భాగంగా ఆమె కోమాలోకి వెళ్లేలా చేశారు. చివరి ప్రయత్నాల్లో భాగంగా దీనికి పూనుకున్నారు. అయినా.. ఆమె పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వెంటిలేటర్‌ను తొలగించేందుకు సిద్ధమయ్యారు. మోనికాను మరణం సమీపిస్తున్న సమయం అది. 


అయితే చివరి ప్రయత్నంగా వైద్యులు ఆమెకు పెద్ద మొత్తంలో వయాగ్రా ఇచ్చారు. ఫలితంగా ఊపిరితిత్తులు తెరుచుకుని శరీరానికి ప్రాణవాయువు సరఫరా మెరుగుపడింది. కేవలం 48 గంటల్లో ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగైంది. డిసెంబర్ 14న ఆమె స్పృహలోకి వచ్చింది. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న ఆమె ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. స్వయంగా నర్సు అయిన ఆమె వయాగ్రా తన ప్రాణాలు కాపాడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది.   

Updated Date - 2022-01-04T04:02:34+05:30 IST