Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 03 Jul 2022 04:06:49 IST

యశ్వంత్‌ను కలిసిన వీహెచ్‌

twitter-iconwatsapp-iconfb-icon
యశ్వంత్‌ను కలిసిన వీహెచ్‌

  • కేసీఆర్‌ సమక్షంలో ఎయిర్‌పోర్టులో స్వాగతం.. రేవంత్‌ సీరియస్‌
  • గోడకేసి కొడతామని హెచ్చరిక.. 
  • రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాక.. తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌ వస్తున్న నేపథ్యంలో ఆయనను కలవబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాత్రం అందుకు విరుద్ధంగా శనివారం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్‌ను కలిశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలోనే ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. దీంతో వీహెచ్‌పై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే గోడకేసి కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యశ్వంత్‌ సిన్హాను సీఎల్పీ కార్యాలయానికి ఆహ్వానించకపోవడాన్ని తప్పుబట్టారు. 


కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మదేవుడినైనా మేం కలవం: రేవంత్‌

కేసీఆర్‌ను మొదట కలిస్తే యశ్వంత్‌ సిన్హానే కాదు.. బ్రహ్మదేవుడైనా కలిసేది లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ యశ్వంత్‌ సిన్హాను కలిసేది లేదని ముందుగానే చెప్పామని, జాతీయ నాయకత్వంతో మాట్లాడి పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పార్టీ నిర్ణయానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యానించారు. ముతి మతి తప్పి ఇష్టమున్నట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, గోడకేసి కొడతామని హెచ్చరించారు. యశ్వంత్‌సిన్హాను పార్టీ తరఫున ఎవరూ కలవలేదని, ఎవరైనా వ్యక్తిగతంగా కలిస్తే తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కట్టిన జెండాలను తొలగించాలంటూ నిరసన తెలిపిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. దీంతో రేవంత్‌.. అంజన్‌కుమార్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నాయని, వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి చిల్లర రాజకీయాలకు తెరలేపాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో కేసీఆర్‌కు ఉన్న అవకాశాలను వదిలేసి చీప్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇందిర, రాజీవ్‌ విగ్రహాల జోలికి వస్తే సహించబోమని, కేసీఆర్‌, కేటీఆర్‌ వీపులకు కాంగ్రెస్‌ జెండాలు కడతామని హెచ్చరించారు.


రేవంత్‌ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

గోడకేసి కొడతామన్న వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని, వీహెచ్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. రేవంత్‌ చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎల్పీ నాయకత్వాన్ని రేవంత్‌ డమ్మీగా మార్చారని ఆరోపించారు. సీఎల్పీ నేతలకు సమాచారం ఇవ్వకుండానే జిల్లా నేతలకు కాంగ్రెస్‌ కండువా కప్పుతున్నారని మండిపడ్డారు. తనను హెచ్చరించేందుకు రేవంత్‌ ఎవరని ప్రశ్నించారు. అయినా.. యశ్వంత్‌ను వీహెచ్‌ కలిసింది కేసీఆర్‌ ఇంటి వద్ద కాదని, ఎయిర్‌పోర్టులో అని పేర్కొన్నారు. రాజకీయంగా కాంగ్రె్‌సకు ప్రధాన శత్రువు బీజేపీ అని, ఆ తరువాతే టీఆర్‌ఎస్‌ అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌ అసలు పనికిరాడన్నారు. కాగా, రేవంత్‌పై జగ్గారెడ్డి బహిరంగ విమర్శలు క్రమశిక్షణా రాహిత్యమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అధిష్ఠానం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి మాట్లాడారని తెలిపారు. రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఇరువురు పార్టీకి రెండు కళ్లలా పని చేస్తున్నారన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.