Abn logo
Sep 26 2021 @ 00:42AM

ఏళ్లతరబడి వెట్టిచాకిరి..

- పదిహేనేళ్లుగా పెరగని గౌరవ వేతనం

- మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెరగని బిల్లులు

- నష్టాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు

- సమస్యలు తీర్చకుంటే వచ్చేనెల 20 నుంచి సమ్మె

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్న మహిళలు ఎన్నో ఏళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. ప్రభుత్వం వారికి ఇస్తున్న చాలిచాలనీ వేతనం, వంట గ్యాస్‌ సరఫరా లేక, పాత్రలు ఇవ్వక, నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని, బిల్లులు పెంచాలని కొంత కాలంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డ్రాప్‌ఔట్లను తగ్గించేందుకు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అత్యధిక మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. సరిపడా తిండి లేక డ్రాపవుట్‌ కాకుండా ఉండేందుకు గాను 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా అమలు చేస్తుండడంతో పాటు కేంద్రం ఇస్తున్న దొడ్డు బియ్యంకు బదులు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నది. దీంతో విద్యార్థులు క్రమంతప్పకుండా పాఠశాలకు వస్తూ భోజనాన్ని తింటున్నారు. పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలుచేసే బాధ్యతను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగించింది. ఇద్దరు, ముగ్గురు మహిళలు కలిసి భోజనాలను సిద్ధం చేసి వడ్డిస్తున్నారు. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా, నిర్వాహకులు మాత్రం మెనూ ప్రకారం చేసే వంటలకు తరగతుల వారీగా బిల్లులు చెల్లిస్తున్నది. అలాగే వారానికి రెండుసార్లు ఉడకబెట్టిన కోడిగుడ్లను విద్యార్థులకు పెట్టాల్సి ఉంటుంది. వీటికి ఒక్కో గుడ్డుకు రూ.4 మాత్రమే చెల్లిస్తున్నది. వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 పలుకుతున్నది. 

ధరలు పెరుగుతున్నా..

రోజురోజుకు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇస్తున్న బిల్లులు ఏమాత్రం సరిపోవడం లేదని మహిళలు చెబుతున్నారు. పథకం ఆరంభమైన మూడేళ్ల తర్వాత నుంచి ఒక్కో వర్కర్‌కు నెలకు రూ. 1000 చెల్లిస్తున్నది. 15 ఏళ్లు గడుస్తున్నా కూడా అంతే గౌరవ వేతనాన్ని ఇస్తున్నారని, ఒక్క రూపాయి కూడా పెంచడం లేదన్నారు. బయట రోజు కూలీకి పోతే రూ. 300 ఇస్తున్నారని ఈ లెక్కన రూ.7,500 సంపాదించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉపాధి హామీ కూలీకి వెళ్లినా రూ. 200కు తక్కువ రావని అంటున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమతో వెట్టిచాకిరి చేయిస్తూ గౌరవ వేతనాలను ఇవ్వడం లేదన్నారు. వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడంతో కట్టెలపై వంట చేస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామన్నారు. వంట పాత్రలను కూడా సరఫరా చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నెలకు రూ. 10,700 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉచితంగా కోడిగుడ్లు, వంట సామగ్రిని, వంట గ్యాస్‌ను సరఫరా చేయాలని, లేకుంటే వచ్చేనెల 20వ తేదీ నుంచి సమ్మె చేస్తామని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు హెచ్చరించారు.