విద్యుత్ విజయ్ - శ్రేయ హీరోహీరోయిన్లుగా తొలిసారిగా నటించిన చిత్రం ‘వెట్టి పసంగ’. రేఖా మూవీస్ అధినేత ఎం.చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ మస్తాన్ దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి చెన్నైనగరంలో జరిగింది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు నిర్మాతలు కె.రాజన్, వారాహి, గిల్డ్ అధ్యక్షుడు జాక్వువర్ తంగం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.మురళి, కార్యదర్శి రాధాకృష్ణన్తోపాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎం.చక్రవర్తిని ఈ సందర్భంగా వారు అభినందించారు. ముఖ్యంగా ప్రస్తుతం చిన్న చిత్రాలకు థియేటర్లు కేటాయించడం చాలా కష్టంగా మారిందన్నారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా పలువురు టెక్నీషియన్లకు ఉపాధి కల్పిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మాతల మండలి ప్రోత్సహించాలని కోరారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీని రక్షించుకునేందుకు వీలుగా చిన్న బడ్జెట్ చిత్రాలు విడుదల సమయంలో థియేటర్ టిక్కెట్ ధరలు తగ్గించాలని వక్తలు కోరారు.
అనంతరం తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.మురళి మాట్లాడుతూ.. చిన్న బడ్జెట్ చిత్రాలను అన్ని విధాలుగా సహాయ సహకారాలందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఈ చిత్ర ఆడియో బిజినెస్ జరిగేలా పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అలాగే, విడుదల సమయంలో థియేటర్లు కూడా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.