పశువైద్యం దైన్యం..!

ABN , First Publish Date - 2022-08-01T03:35:39+05:30 IST

మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తరువాత అధికశాతం మంది పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు.

పశువైద్యం దైన్యం..!
శిథిలావస్థలో ఉదయగిరి పశు వైద్యశాల

శిథిలావస్థలో వైద్యశాలల భవనాలు

వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత

ఉదయగిరి రూరల్‌, జూలై 31: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తరువాత అధికశాతం మంది పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి తరుణంలో పాడి రైతులకు పశువైద్యం దైన్యంగా మారింది. పశు వైద్యశాలలు ఉన్నా వాటికి సరైన భవన సదుపాయం లేక ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో వైద్యులు, సిబ్బంది, పశువుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయగిరి పశు వైద్యశాల భవనం 1963లో నిర్మించారు. ఆ భవనం చిన్నది కావడంతో సిబ్బంది, మందులు, ఫర్నిచర్‌తో నిండిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక గండిపాళెం, సీతారామపురం, బసినేనిపల్లి, కుర్రపల్లి భవనాలు సైతం శిథిలావస్థకు చేరాయి. భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరడంతో కొన్నింట్లో మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, ఇతరత్రా సౌకర్యాలు లేకపోవడంతో అటు సిబ్బంది, ఇటు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పశు వైద్యానికి అవసరమైన సౌకర్యాలు, సిబ్బందికి గదులు కేటాయిస్తామని చెప్పినా పలుచోట్ల ఆ ఊసే ఎత్తకపోగా ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించిన పాపానపోలేదు. 

వైద్యులు, సిబ్బంది కొరత

పశు వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో ఆవులు 1,610, గేదెలు 16,579, మేకలు 27,962, గొర్రెలు 96,303 ఉన్నాయి. గండిపాళెం వైద్యశాలకు సీతారామపురం వైద్యులు, బసినేనిపల్లి వైద్యశాలకు కుర్రపల్లి వైద్యులు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు అక్కడ, ఇక్కడ వైద్యసేవలు అందించలేకపోతున్నారు. అలాగే ఆయా వైద్యశాలల్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. దీంతో మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వైద్యశాలలో మందుల కొరత కూడా ఉందని పలువురు వాపోతున్నారు. శిథిలావస్థకు చేరిన వైద్యశాల భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించి వైద్యశాలలకు భవనాలు మంజూరు చేయడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమించి మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-01T03:35:39+05:30 IST