మాతృభాషాభిమానం.. నగల వ్యాపారిని వణికించిన మహిళ

ABN , First Publish Date - 2020-10-10T22:39:10+05:30 IST

మరాఠాలు, తమిళులు, కన్నడిగుల భాషాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాతృభాషపై వారికి ఉండే ప్రేమ ఇతర భాషీయులను కూడా కదిలిస్తుంటుంది.

మాతృభాషాభిమానం.. నగల వ్యాపారిని వణికించిన మహిళ

ముంబై: మరాఠాలు, తమిళులు, కన్నడిగుల భాషాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాతృభాషపై వారికి ఉండే ప్రేమ ఇతర భాషీయులను కూడా కదిలిస్తుంటుంది. మరాఠాల మాతృభాషాభిమానాన్ని చాటే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెవి రింగులు కొనడానికి శోభ దేశ్‌పాండే అనే మరాఠా రచయిత్రి దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న మహావీర్ నగల దుకాణానికి వెళ్లారు. మాటల సందర్భంగా మరాఠీ వచ్చా అని ఆ షాపు యజమాని శంకర్ లాల్ జైన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ... రాదని చెప్పాడు. రాజధాని నగరంలో ఉంటూ మరాఠీ రాకపోవడం ఏంటని ఆమె అడిగారు. దీంతో కోపగించుకున్న ఆయన.. నగలు అమ్మనని గట్టిగా గదమాయించాడు. లైసెన్స్ చూపించాలని ఆమె కోరగా... ఆయన మరింత రెచ్చిపోయాడు. యజమాని తీరుపై ఆగ్రహించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చారు. పోలీసులు కూడా షాపు యజమాని పక్షాన చేరడంతో.. నొచ్చుకున్న సదరు రచయిత్రి... ఆ దుకాణం ముందే బైఠాయించి తన నిరశన తెలిపారు. అలా 20 గంటల పాటు కదలకుండా కూర్చున్నారు. 80 ఏళ్ల శోభ ధర్నాకు దిగడంతో భాషాభిమానులు అక్కడకు చేరుకున్నారు. రాత్రంతా ఆమె అక్కడే పడుకున్నారు. ఆమె పట్టుదల ముందు షాపు యజమాని నిలవలేకపోయాడు. ఇవాళ ఉదయం ఆమెకు క్షమాపణ చెప్పి... నిరశనను విరమింప చేశాడు. అనంతరం ఆమెను వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. దశాబ్దాలుగా ముంబైలో వ్యాపారాలు చేసుకుంటూ మరాఠీ మాట్లాడకపోవడం బాధాకరమని.. దానిపైనే తాను నిరసన తెలిపానన్నారు. షాపు యజమాని బహిరంగంగా మరాఠీని అవమానించాడని మండిపడ్డారు.


ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలిసిన రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకులు రచయిత్రికి మద్దతుగా నిలిచారు. షాపు యజమానితో మాటల యుద్ధానికి దిగిన వారు చేయి కూడా చేసుకున్నారు. అంతేగాక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ... మరాఠా నేర్చుకునే వరకు దుకాణం తెరవొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అతని నిర్లక్ష్య ధోరణికి గుణపాఠం నేర్పాలనుకున్నామని.. అదే చేశామని చెప్పుకొచ్చారు. 80 ఏళ్ల వృద్ధురాలితో వ్యవహరించే విధానం ఇదా అని మండిపడ్డారు.    

Updated Date - 2020-10-10T22:39:10+05:30 IST