వెటరన్ జర్నలిస్ట్ వినోద్ దువా కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-05T00:22:54+05:30 IST

ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు వినోద్ దువా సుదీర్ఘ అస్వస్థతతో శనివారంనాడు..

వెటరన్ జర్నలిస్ట్ వినోద్ దువా కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు వినోద్ దువా సుదీర్ఘ అస్వస్థతతో శనివారంనాడు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె మల్లికా దువా సోషల్ మీడియా పోస్ట్‌లో ధ్రువీకరించారు. ఇటీవలే ఆయన కోవిడ్ బారిన పడి కోలుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. 67 ఏళ్ల దువా వైద్యుల సలహా మేరకు గత వారంలో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని లోథి క్రిమిటోరియంలో నిర్వహించనున్నట్టు మల్లికా దువా తెలిపారు.


హిందీ జర్నలిజం ఆద్యులలో ఒకరిగా పేరున్న వినోద్ దువా దూరదర్శన్‌, ఎన్‌డీటీవీలో పనిచేశారు. ఇటీవల పలు వెబ్‌షోలలో రాజకీయ కామెంట్రీలతో కూడా అలరించారు. ఢిల్లీలోని శరణార్థుల కాలనీల నుంచి జర్నలిజంలో అత్యున్నత స్థాయికి చేరి, 42 ఏళ్లకు పైగా సేవలందించారని మల్లికా దవా తన 'ఇన్‌స్టాగ్రామ్' పోస్ట్‌లో పేర్కొన్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ తారాస్థాయిలో ఉన్న దశలో వినోద్ దువా, ఆయన భార్య గురుగావ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కోవిడ్‌తో ఆమె కన్నుమూశారు. వినోద్ దువా ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయినా ఆరోగ్య సమస్యలు వెన్నాడుతూ వచ్చాయి. దువా దంపతులకు బకుల్ దువా అనే మరో కుమార్తె కూడా ఉన్నారు. జర్నలిజంలో చేసిన అత్యుత్తమ సేవలకు గాను 1996లో రామ్‌నాథ్ గోయెంగా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును వినోద్ దువా అందుకున్నారు. 2008లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.

Updated Date - 2021-12-05T00:22:54+05:30 IST