ఎండుముఖం..!

ABN , First Publish Date - 2022-09-25T05:36:25+05:30 IST

ఖరీఫ్‌ ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగు చేశారు. ప్రధాన పంట వేరుశనగ పంట ఊడలు దిగేస్థితిలో ఉంది.

ఎండుముఖం..!

మొహం చాటేసిన వరుణుడు

వాడుపట్టిన వేరుశనగ పైర్లు

దిగుబడిపై ప్రభావం

ఇలాగే కొనసాగితే పూర్తిగా నష్టమే.. 

ఆందోళనలో అన్నదాతలు


ధర్మవరం రూరల్‌



ఖరీఫ్‌ ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగు చేశారు. ప్రధాన పంట వేరుశనగ పంట ఊడలు దిగేస్థితిలో ఉంది. కీలకమైన ఈ దశలో వరుణుడు మొహం చాటేశాడు. వాన జాడలేదు. దీనికితోడు సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. వర్షాకాలమైనా విచిత్రంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో వేరుశనగ పైర్లు ఎండుముఖం పట్టాయి. చెట్లు వాడుపట్టాయి. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. పైర్లు పూర్తిగా ఎండిపోతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడు కూడా నష్టాలు తప్పవా అని భయాందోళనకు లోనవుతున్నారు.


ఇలాగే ఉంటే.. అంతే...

జిల్లావ్యాప్తంగా 1.97 లక్షల హెక్టార్లలో రైతులు.. వేరుశనగ పంట సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పంట సాగుకు ముందు బాగానే కురిసిన వర్షాలు దిగుబడి వచ్చే సమయానికి మొహం చాటేస్తున్నాయి. 20 రోజులుగా పదును వర్షం కురవలేదు. దీంతో రూ.వేలకువేలు పెట్టుబడులు పెట్టి, పంటంతా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పంటపోతే వలసలే మార్గమని వాపోతున్నారు. గత రెండేళ్లుగా అధిక  వర్షాలతో పంటను చేలలోనే వదిలేశారు. పశుగ్రాసం కూడా దక్కలేదు. ఈసారి అప్పులు చేసి, పంట సాగుచేశారు. కీలక సమయంలో వరుణుడు మొహం చాటేయడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చెట్టుకు ఉన్న మూడు, నాలుగు కాయలు కూడా లొత్తలుగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వర్షం లేక వేరుశనగ చెట్లన్నీ వాడుముఖం పట్టాయి. మరో పదిరోజుల్లో వర్షం రాకుండా, ఎండతీవ్రత ఇలాగే కొనసాగితే చెట్లన్నీ ఎండిపోయి పంటను వదిలేసే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెట్టుకు మూడు నాలుగు పిందెలున్నాయి. వర్షం వస్తే అవన్నీ కాయలుగా ఏర్పడతాయి. లేదంటే వక్కిపోతాయి.


అప్పులే మిగులుతున్నాయ్‌..

గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిల్చింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా చేతికి అందివచ్చిన పంట కాస్తా తడిసి, ముద్దయింది. పంట కోత కోసి, ఇంటికి తరలించుకునే సమయంలో వర్షాలు కురవడంతో దిగుబడితోపాటు పశుగ్రాసం కూడా కుళ్లిపోయింది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. అప్పులపాలయ్యారు.


ప్రభుత్వ సాయం కరువు

గతేడాది వేరుశనగ సాగుచేసి, తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. పంటల బీమాలో వేరుశనగ పంటను విస్మరించారు. పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. పంట పండక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం సాయం అందక రైతులు పూర్తిగా నష్టపోయారు.


అప్పు చేసి, పంట పెట్టా..

ఆరెకరాల్లో వేరుశనగ సాగుచేశా. మూడునెలలు కావొస్తోంది. పంట కాయదశలో ఉంది. ప్రస్తుతం వర్షం రాకపోవడంతో ఆందోళనగా ఉంది. ఇప్పటికే పంటకు రూ.70వేల వరకు ఖర్చు చేశా. వాన వస్తే అంతో.. ఇంతో దిగుబడి వస్తుంది. లేదంటే పూర్తిగా నష్టపోవాల్సిందే.

ఆదెప్ప, రైతు, పోతులనాగేపల్లి, ధర్మవరం మండలం


పంట పెట్టాలంటే భయమేస్తోంది..

వేరుశనగ చెట్లకు పిందెలు, కాయలు ఏర్పడ్డాయి. పదును వర్షం లేక 20 రోజులైంది. దీంతో పంట వాడుపట్టింది. వర్షం వస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు. గతేడాది అధిక వర్షంతో పంటంతా నష్టపోయా. ఈసారి వానలేక నష్టపోవాల్సి వస్తోంది. వేరుశనగ సాగు చేయాలంటే భయంగా ఉంది.

రాఘవరెడ్డి, రైతు, చిగిచెర్ల, ధర్మవరం మండలం



Updated Date - 2022-09-25T05:36:25+05:30 IST