క్రిమికీటకాల ఆచూకీ చెప్పే యాప్‌

ABN , First Publish Date - 2020-02-18T08:16:36+05:30 IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలను క్రిమికీటకాలు నిమిషాల్లో నాశనం చేస్తుంటాయి. అవి ఎటువైపు నుంచి వస్తాయి ? అనేది గుర్తించేలోపే

క్రిమికీటకాల ఆచూకీ చెప్పే యాప్‌

  • అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు
  • జీపీఎస్‌ లొకేషన్‌తో కీటకాల ఉనికిని గుర్తించే వెసులుబాటు
  • ముందుజాగ్రత్త చర్యతో పంటనష్టానికి బ్రేక్‌  

లండన్‌, ఫిబ్రవరి 17 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలను క్రిమికీటకాలు నిమిషాల్లో నాశనం చేస్తుంటాయి. అవి ఎటువైపు నుంచి వస్తాయి ? అనేది గుర్తించేలోపే జరిగేదంతా జరిగిపోతుంది!! చేతికొచ్చే పంట కాస్తా కీటకాల పాలవుతుంది!! అంతా జరిగాక లబోదిబోమనడం తప్ప రైతన్నలు ఏమీ చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో యూకేలోని లింకన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు క్రిమికీటకాల ఉనికిని గుర్తించే సరికొత్త యాప్‌ను అభివృద్ధిచేశారు. దానికి ‘మేస్ట్రో’ అని పేరుపెట్టారు. రైతులు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని.. పొలంలోకి వెళ్లి యాప్‌లోని ప్రత్యేక కెమెరాను తెరిస్తే చాలు కీటకాలు ఎటువైపు తిరుగాడుతున్నాయనేది ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు.. అవి ఏ వైపు నుంచి వచ్చి పంటలపై దాడి చేస్తున్నాయి? అనే సమాచారాన్ని జీపీఎస్‌ లొకేషన్‌తో సహా ఇది రైతుకు అందిస్తుంది. తద్వారా క్రిమికీటకాలు వచ్చే మార్గంలో క్రిమిసంహారకాలు చల్లి ఆదిలోనే వాటిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. 



రూ.2.5 లక్షల కోట్లు  

ఏటా భారత్‌లో క్రిమికీటకాల వల్ల జరిగే పంట నష్టం


35 శాతం 

ఏటా భారత్‌లో పండే పంటల్లో 35 శాతం క్రిమికీటకాల పాలవుతోంది.


3.70 లక్షల హెక్టార్లు

ఇటీవల గుజరాత్‌, రాజస్థాన్‌లలో మిడతల దాడితో పంట నష్టం జరిగిన విస్తీర్ణం 


ఎమర్జెన్సీ

పాకిస్థాన్‌, సోమాలియా దేశాలైతే మిడతల కట్టడికి అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.



భారత్‌-పాక్‌ సంయుక్త వ్యూహం 

విదేశాంగ వ్యవహారాల్లో ఎడమొహం పెడమొహంగా ఉండే భారత్‌,పాక్‌లు మిడతల బెడద విషయానికొచ్చే సరికి సంయుక్త వ్యూహంతో ముందుకుపోతున్నాయి. 2019 జూన్‌ నుంచి డిసెంబరు మధ్యకాలంలో మిడతల నివారణ, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ఇరుదేశాలు ఐదుసార్లు సమావేశమయ్యాయి. 

Updated Date - 2020-02-18T08:16:36+05:30 IST