పశువైద్యం.. దైన్యం

ABN , First Publish Date - 2021-08-13T05:22:18+05:30 IST

గ్రామీణ పశువైద్యశాలలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. ముఖ్యంగా సిబ్బంది కొరత వేధిస్తోంది.

పశువైద్యం.. దైన్యం
కర్లపాలెం మండల కేంద్రంలో శిధిలావస్థకు చేరిన పశువైద్యశాల భవనముదాయం

సమస్యలతో కునారిల్లుతున్న గ్రామీణ పశువైద్యశాలలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

మూడు, నాలుగు ఆస్పత్రులకు ఒక్కరే డాక్టర్‌

వెటర్నరీ అసిస్టెంట్లూ లేరు..

పలు వైద్యశాలల్లో అందుబాటులో లేని మందులు

పాత భవనాలు శిథిలావస్థకు..

మొక్కుబడిగా పశు వైద్యసేవలు 

  

గ్రామాల్లో పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒక్క వైద్యాధికారే చుట్టుపక్కల గ్రామాల వైద్యశాలను చూసుకోవలసిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది ఉన్నచోట... సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో.. తెలియదు. దీంతో వైద్యం కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇంకోవైపు చాలాగ్రామాల్లో పశువైద్యశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.. వర్షానికి భవనాలలోకి నీరు చేరడం.. ప్రహరీలు కూలిపోవడం.. అక్కడ విధులు నిర్వహించేందుకు సిబ్బంది జంకుతున్నారు.  


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 12: గ్రామీణ పశువైద్యశాలలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. ముఖ్యంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. మూడు నాలుగు వైద్యశాలలకు ఒక్క వైద్యుడే దిక్కవుతున్నాడు. వారికి సహాయకులుగా ఉండే సిబ్బంది కొరతా ఉంది. తెనాలి మండలంలో 11 గ్రామాల్లో పశు వైద్యశాలలు ఉండగా వాటిలో ఆఫీస్‌ సబార్డినేటర్ల కొరత ఉంది. ప్రధాన ఆసుపత్రులుగా పేరొందిన గుడివాడ, కొలకలూరు, పెదరావూరులో వెటర్నరీ అసిస్టెంట్లు లేరు. పొన్నూరు మండలంలోని పలు ఆస్పత్రుల్లో వెటర్నరీ అసిస్టెంట్లు ఉద్యోగ విరమణ చేశారు. సత్తెనపల్లి మండలంలోని పెదమక్కెన, ధూళ్లిపాళ్ల, కొమెరపూడి, గ్రామాల్లో ఏన్నోఏళ్లుగా కాంపౌండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధూళ్లిపాళ్ల పశువైద్యకేంద్రంలో కాంపౌండర్‌, అటెండర్‌ పోస్టులు రెండూ ఖాళీగానే ఉన్నాయి. నందిగామ, రెంటపాళ్ల, ఎల్‌ గార్లపాడు, ఫణిదం, అబ్బూరు గ్రామాల్లో పారామెడికల్‌ స్టాఫ్‌ మాత్రమే ఉన్నారు. ముప్పాళ్ల, నకరికల్లు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల  వైద్యులు, సిబ్బంది అమూల్‌ డెయిరీ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో ఒక్కొక్కసారి పశుపోషకులకు సేవలు సక్రమంగా అందటం లేదు. వినుకొండ మండలంలో మారుమూల ప్రాంతమైన పిట్టంబండ గ్రామంలో పశువైద్యశాల దూరంగా ఉండటంతో పశుపోషకులు ఇబ్బందులకు గురవుతున్నారు. నూజెండ్ల మండలంలో రెండేళ్లుగా ఇన్‌చార్జి పశువైద్యాధికారి మాత్రమే ఉన్నారు. ఈపూరు మండలం ముప్పాళ్ల, కొచ్చర్ల, కొండ్రముట్లలో పశువైద్యశాలల్లో పశువైద్యులు ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వారిని వేధిస్తుంది. రెంటచింతల, తుమృకోట పశువైద్యశాలలో వైద్యులు, వెటర్నరీ అసిస్టెంటు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యడ్లపాడు మండలం జగ్గాపురం డిస్పెన్సరీలో వైద్యుడు మాత్రమే  ఉన్నాడు. కాంపౌండర్‌, అటెండర్‌ సిబ్బంది కొరత ఉంది. తిమ్మాపురం, సొలసలోనూ సిబ్బంది కొరత ఉంది. పశువైద్యశాలలో మందులు అందుబాటులో లేవు. అత్యవసరంగా మందులు అవసరమైతే బయట కొనుగోలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి.  దాచేపల్లి, తంగెడ గ్రామాల్లోనే పశువైద్యశాలలు ఉన్నప్పటికీ మిగిలిన గ్రామాల రైతులు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న పశువైద్యశాలకు రావటం చాలా కష్టంగా ఉంది. గురజాల నియోజకవర్గంలో గాలికుంటు వ్యాధి నిరోధానికి పశువులకు అందించే టీకాలు ఒక్కోసారి అందుబాటులో లేకపోవటంతో రైతులే ప్రైవేటుగా మందులు కొనుగోలు చేసి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది.  


శిథిలావస్థకు చేరిన భవనాలు 

 కర్లపాలెం మండల కేంద్రంలోని పశువైద్యశాల పూర్తిస్థాయిలో శిధిలావస్థకు చేరింది. పొన్నూరు మండలం మునిపల్లె వెటర్నరీ డిస్పెన్సరీ భవనం చుట్టూ ప్రహరీ లేకపోవటంతో రక్షణ కరువైంది. ఈ భవనం సుమారు 70 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి పశువైద్యశాలకు అభివృద్ధి పనులు చేపట్టకపోవటంతో శిధిలావస్థకు చేరుకుంది. వర్షాకాలంలో స్లాబు వెంట వర్షపునీరు లీకులవుతుండటంతో రికార్డులు, మందులు తడిసిపోతున్నాయి. జూపూడి, మామిళ్శపల్లి,  దొప్పులపూడి, దండమూడి, వల్లభరావుపాలెం, పెదపాలెంలోని గ్రామీణ పశువైద్యశాలల భవనాలు కూడా ఇదే పరిస్ధితి. 


సిబ్బంది ఉన్నా సమయపాలన లేక..

 రొంపిచర్ల, సంతగుడిపాడు, కర్లకుంట, అన్నవరప్పాడు, గోగులపాడు, రెడ్డిపాలెం గ్రామాల్లో  పశు వైద్యశాలలు ఉన్నాయి. వైద్యులు ముగ్గురు, గోపాల మిత్రలు ఐదుగురు ఉన్నారు. అయితే అధికారులు, సిబ్బంది సరైన సమయానికి రావటం లేదని రైతులు చెపుతున్నారు. మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు. మందులు కూడా సక్రమంగా ఉండటం లేదని తెలిపారు. పశువులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు జీవనాధారమైన పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన ఆసుపత్రులలో సిబ్బందిని నియమించి సకాలంలో వైద్యసేవలు అందేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-08-13T05:22:18+05:30 IST