భూవివాదంలో 108 ఏళ్లకు Court Verdict .. బ్రిటీష్ కాలంలో మొదలు..

ABN , First Publish Date - 2022-05-17T00:13:04+05:30 IST

నాలుగు తరాల సుధీర్ఘ నిరీక్షణ.. లెక్కలేనన్ని విచారణలు.. ఎన్నో వాదనల అనంతరం భారతదేశంలోనే అత్యంత పురాతన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న ఓ భూవివాదంలో 108

భూవివాదంలో 108 ఏళ్లకు Court Verdict .. బ్రిటీష్ కాలంలో మొదలు..

భోజ్‌పూర్ : నాలుగు తరాల సుధీర్ఘ నిరీక్షణ.. లెక్కలేనన్ని విచారణలు.. ఎన్నో వాదనల అనంతరం భారతదేశంలోనే అత్యంత పురాతన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న ఓ భూవివాదంలో 108 ఏళ్లకు కోర్ట్ తీర్పు వెలువడింది. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా కోర్ట్ మార్చి 11న ఈ తీర్పునిచ్చింది. దర్బారీ సింగ్‌ అనే వ్యక్తి 1914లో ఆరా సివిల్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయగా... భోజ్‌పూర్  అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్వేతా సింగ్ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో 3 ఎకరాల స్థలంపై హక్కులు పొందనున్నవారికి ఇటివలే తీర్పు ప్రతులు అందాయి. కొయిల్‌వార్ గ్రామంలో ఉన్న ఈ 3 ఎకరాల వివాదాస్పద భూమి దాదాపు 91 ఏళ్లపాటు ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఇప్పుడు దర్బారీ సింగ్‌ నాలుగో తరానికి దక్కబోతోంది. ఈ కేసు వివాదం 1914లో బ్రిటిష్ కాలంలో మొదలవ్వడంతో దేశంలో అత్యంత పురాతన కేసుల్లో ఒకటిగా భావిస్తున్నారు.


కేసు మూలాలు ఇవీ..

పురాతమైన ఈ కేసు మూలాలు భోజ్‌పూర్ జిల్లా కొయిల్‌వార్‌ వాసి అజార్ ఖాన్‌కు చెందిన 9 ఎకరాల స్థలంతో ముడిపడి ఉన్నాయి. అజార్ ఖాన్ వారసుల నుంచి ఈ భూమి కొనుగోలు విషయంలో రెండు రాజ్‌పుత్ కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. 108 సంవత్సరాల సుధీర్ఘ విచారణ జరిగినా ఇరుపక్షాలూ సయోధ్యకు అంగీకరించపోవడం  విశేషం. తీర్పు వచ్చే వ్యవధిలో నాలుగు తరాలు మారిపోయాయి. కేసులో  వాస్తవిక పిటిషన్‌దారు చనిపోగా.. అజార్ ఖాన్ వారసులు పాకిస్తాన్‌కు వలస పోయారని భావిస్తున్నారు. 1914లో పిటిషన్ వేసిన దర్బారీ సింగ్‌ కుటుంబానికి చెందిన నాలుగవ తరం వ్యక్తి అతుల్ సింగ్‌ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వెలువడినా ఈ కేసు ముగుస్తుందని భావించడం లేదన్నాడు. అవతలి పక్షంవారు హైకోర్ట్‌కు.. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా తీర్పును సవాలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.


ఎకరం రూ.5 కోట్లు

కాగా పాట్నాకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండే కొయిల్‌వార్ ఇప్పుడు మునిసిపాలిటీగా మారిపోయింది. హైవేకు పక్కనే ఉండే ప్రాంతంలోని భూములకు చాలా విలువ ఉంది. ప్రస్తుతం ఒక్కో ఎకరం  సుమారు రూ.5 కోట్లు పలుకుతోంది. కాగా ఈ వివాదానికి సంబంధించిన రాజ్‌పుత్ కుటుంబాలు ఈ సుధీర్ఘకాలంలో తరాలను కోల్పోయాయి. ఈ తీర్పు సందర్భంగా జస్టిస్ శ్వేతా సింగ్ స్పందిస్తూ..  ఈ తీర్పు భూవివాదానికి ముగింపు కాకపోవచ్చు. కానీ తెరపడాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. 1914 నుంచి ఇరుపక్షాల మధ్య వివాదం కొనసాగుతోందని తెలిపారు.

Updated Date - 2022-05-17T00:13:04+05:30 IST