వరండా చదువులు..!

ABN , First Publish Date - 2022-09-25T05:48:25+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలో భారీస్థాయిలో విద్యార్థులు చేరారేమో..! తరగతి గదులు పట్టక ఇలా వరండాలో పాఠాలు చెబుతున్నారేమో..! ఈ ఫొటోలను చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది.

వరండా చదువులు..!

విద్యాశాఖ ఆక్రమణలో గదులు

కేఎస్‌ఆర్‌లో విద్యార్థినుల పాట్లు

     ప్రభుత్వ పాఠశాలలో భారీస్థాయిలో విద్యార్థులు చేరారేమో..! తరగతి గదులు పట్టక ఇలా వరండాలో పాఠాలు చెబుతున్నారేమో..! ఈ ఫొటో చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. బడిలో విద్యార్థుల సంఖ్య భారీగా ఉన్నది నిజమే. కానీ గదులు పట్టక వారు బయట కూర్చోలేదు. ఉన్న గదులను వివిధ పనుల కోసం విద్యాశాఖ ఆక్రమించుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మారుమూల పల్లెలో కాదు. జిల్లా కేంద్రం నడిబొడ్డున..! 



మూడు గదుల్లో ఈ-వేస్ట్‌

అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్‌ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పాఠశాల చుట్టుపక్కల  పలు సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. దీంతో అడ్మిషన్లు ఏమాత్రం తగ్గవు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. కానీ పశ్చిమ వరండాలో 3 గదులను మూడేళ్ల క్రితం మూసేశారు. అవేమీ శిథిలావస్థకు చేరలేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల నుంచి కంప్యూటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను తెచ్చి ఇక్కడ భద్రపరిచారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే.. ఈ- వేస్ట్‌ను వేలం వేయాలని అప్పటి డీఈఓ భావించారు. కానీ ఉత్తర్వులు రాలేదు. డీఈఓలు మారిపోవడంతో ఈ-వేస్ట్‌ వేలం గురించి మరిచిపోయారు. ఓ వైపు కంప్యూటర్లు గదుల్లో మగ్గుతుండగా, మరోవైపు విద్యార్థులకు గదుల కొరత ఏర్పడింది.


పరీక్షల కోసం..

పదో తరగతి పరీక్షలకు ముందు.. ఫిబ్రవరిలో మరికొన్ని గదులను అధికారులు ఆక్రమించారు. కేఎ్‌సఆర్‌ బాలికల హైస్కూల్‌ గదుల్లో పరీక్షల క్యాంపును విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పలు గదుల్లో పరీక్ష పేపర్లను భద్రపరిచారు. పరీక్షల విభాగానికి సంబంధించిన పెండింగ్‌ పనులను అక్కడే చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆ గదులు కూడా దూరమయ్యాయి. 6వ తరగతి బి-సెక్షన్‌లో 70 మంది, 8వ తరగతి విద్యార్థులు 70 మందికి గదులు లేవు. వీరిని వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు.      


- అనంతపురం విద్య

Updated Date - 2022-09-25T05:48:25+05:30 IST