కాగితాలపై వెంచర్‌

ABN , First Publish Date - 2021-03-01T05:42:41+05:30 IST

ఎమ్మిగనూరు పట్టణం, పరిసరప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ అనుమతుల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు

కాగితాలపై వెంచర్‌

  1. అనుమతి లేకుండా రియల్‌ దందా
  2. ప్లాట్లుగా వ్యవసాయ భూములు
  3. రూ.కోట్లలో వ్యాపారం.. ప్రభుత్వానికి ఎగనామం
  4. అధికారుల దృష్టికి రాలేదట..! 


ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 28: ఎమ్మిగనూరు పట్టణం, పరిసరప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ అనుమతుల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. స్థలం ఉంటే చాలు వెంటనే వెంచర్‌ వేసేసి అమ్ముతున్నారు. రోజూ రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి పైసా ఆదాయం రావడం లేదు. కాగితాలపైనే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ దందాతో కొందరు రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటీవల పట్టణ శివారులోని ఓ గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఆ తరువాత గంటలోగానే పేపర్‌పై ప్లాట్లు వేసి వందకు పైగా విక్రయించాడు. అదీ డిప్పు పద ్ధతిలో అమ్మకాలు సాగించాడు. దీన్నిబట్టి చూస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క చోటేకాదు ఎమ్మిగనూరు పట్టణం, సమీప గ్రామాల్లో ఇదే తరహా వ్యాపారం జరుగుతోంది. 


కన్వర్షన్‌ చేయకుండానే..

వ్యవసాయ భూమిలో వెంచర్‌ వేయాలంటే ముందుగా నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌గా మార్పించుకోవాలి. వెంచర్‌ వేసే భూమిలో పాఠశాల, పార్కు, గుడికి తదితర అవసరాల కోసం 10 శాతం భూమిని కేటాయించాలి. ప్రధాన రహదారులకు 40 అడుగులు, అంతర్గత రహదారులకు 33 అడుగులు కేటాయించాలి. రోడ్లు, డ్రైనేజీలు, మొక్కల పెంపకం, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి. లే అవుట్‌ చేయించి గ్రామ పంచా యతీ, లేదా మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ అవేమీ చేయకుం డానే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. 


కాగితం మీద స్కెచ్‌ గీయించి..

గుడికల్‌ పంచాయతీ పరిధిలో ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. దీనికి అగ్రిమెంట్‌ చేసుకుని, అనుమతులు తీసుకోకుండా పేపర్‌పై వెంచర్‌ ప్లాన్‌ స్కెచ్‌ వేయించాడు. వందకు పైగా ప్లాట్లువేసి డిప్పు సిస్టం ద్వారా గంటలోపు అమ్మేశాడు. ఈ వ్యవహారం ఎమ్మిగనూరు రియల్‌ వ్యాపారుల్లో సంచలనం రేపింది. ఈ వెంచర్‌లో ప్లాట్ల విక్రయాల ద్యారా రూ.కోట్లలో లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం ఎటువంటి చెల్లింపులు జరిగిన దాఖలాలు లేవు. ఈ భూమి గతంలో అదనపు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు కేటాయించారు. రికార్డుల్లో ఈ భూమికి రెడ్‌ మార్క్‌ ఉన్నట్లు సమాచారం. 


నిబంధనలకు విరుద్ధంగా..

పట్టణ సమీపం లోని మైనార్టీ కాలనీ, ఆదోని రోడ్డు, మంత్రాలయం రోడ్డులోని ముగతి గ్రామ సమీపంలో పట్టణానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దాదాపు 11 ఎకరాల్లో వెంచర్‌ వేశాడు. కానీ ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. సెంటు రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అమ్ముతున్నారు. 20 అడుగులకు మించి రోడ్లుకు స్థలం కేటాయించలేదు. ప్రభుత్వా నికి కేటాంచాల్సిన పదిశాతం స్థలం కూడా కేటాయించలేదు. 

పట్టణానికి చెందిన ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గోనెగండ్ల రోడ్డులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ల్యాండ్‌ కన్వర్షన్‌కు దరఖాస్తు చేశామని చెప్పుకుంటూ రోడ్లు వేసి జనాన్ని బురిడీకొట్టిస్తున్నారు. ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 


అనుమతి రాకముందే..

పట్టణ శివారులోని సంజీవయ్య నగర్‌ ప్రాంతంలో పది ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కర్నూలు ప్రాంతానికి చెందిన ఓ రియల్‌ వ్యాపారి కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఈ భూమికి సంబంధించి నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అనుమతి రాకముందే పేపర్‌పై వెంచర్‌ ప్లాన్‌ వేసి సెంటు రూ.5 లక్షల ప్రకారం అమ్ముతున్నారు. ఆ భూమిలో ప్లాట్లు వేసి రాళ్లు పాతి రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్‌ స్థలాల క్రయవిక్రయాల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారికి అధికార పార్టీ అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


మాదృష్టికి రాలేదు..

గుడికల్‌ పంచాయతీ పరిధిలో వ్యసాయ భూమిలో ప్లాట్లువేసి విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నాము. అయినా అధికారులను పంపి పరిశీలించి చర్యలు తీసుకుం టాము. - జయన్న, తహసీల్దారు, ఎమ్మిగనూరు 


Updated Date - 2021-03-01T05:42:41+05:30 IST