Jul 31 2021 @ 20:26PM

‘నారప్ప’గా నేను సక్సెస్ కావడానికి కారణం అదే: వెంకీ

‘‘అసురన్‌ చిత్రం లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్‌కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది. నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్‌ కావడానికి మా టీమ్‌ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం అన్నారు విక్టరీ వెంకటేష్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. రీసెంట్‌గా అమేజాన్ ప్రైమ్‌ వీడియోలో విడుద‌లై మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో హీరో విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకుల రెస్పాన్స్‌తో టీమ్ అంతా సంతోషంగా ఉన్నాం‌. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. మరెన్నో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేశాను. కానీ ‘అసురన్‌’ చిత్రం నాకు డిఫరెంట్‌గా అనిపించి, ఈ సినిమా చేయాలని వెంటనే ఒప్పుకున్నాను. ‘అసురన్‌’లాంటి ఓ సినిమాను ఇచ్చిన దర్శకుడు వెట్రీమారన్, యాక్టర్‌ ధనుష్, నిర్మాత థానుగారికి థ్యాంక్స్‌. ‘అసురన్‌’ లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్‌కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది. నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్‌ కావడానికి మా టీమ్‌ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్‌ సమయంలో ‘నారప్ప’ క్యారెక్టర్‌లో చాలా కాలం ఉండిపోయాను. ‘నారప్ప’ మంచి ఎక్స్‌పీరియన్స్‌. నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాట లిరిక్‌ను అనంతశ్రీరామ్‌ బాగా రాశారు. ఈ లిరిక్‌ విన్నప్పుడు షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తామా? అనిపించింది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చినా వారు ఆదరించారు. ఫ్యామిలీస్‌తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఈ సంక్రాంతికి మళ్లీ ‘ఎఫ్‌ 3’తో వచ్చి అందర్నీ నవ్విస్తాం’’ అన్నారు.