Abn logo
Mar 2 2021 @ 17:42PM

విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి క్లాప్‌ కొట్టారు

విక్టరీ వెంకటేష్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'నారప్ప', 'ఎఫ్‌ 3' చిత్రాలలో నటిస్తున్న వెంకీ.. తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో అందరికీ తెలిసిందే. మ‌ళ్లీ విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా 'దృశ్యం 2' వ‌స్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజిన‌ల్ మ‌ళ‌యాల వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి ప‌తాకాల‌పై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి నిర్మిస్తున్నారు. 

ఈ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌దియ‌, న‌రేష్‌, ఏస్త‌ర్ అనిల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా స‌తీష్ కురూప్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 5 నుండి ప్రారంభంకానుంది. కాగా, మోహన్‌లాల్‌ హీరోగా ఇప్పటికే విడుదలైన మలయాళ 'దృశ్యం 2' ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. తెలుగులో వెంకీతో 'దృశ్యం 2' రీమేక్‌ చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement