వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు

ABN , First Publish Date - 2022-01-24T08:58:33+05:30 IST

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు

ప్రజలు జగన్‌ పాలనను వ్యతిరేకిస్తున్నారు

ఇప్పుడు పాదయాత్ర చేస్తే రోడ్ల దుస్థితి తెలుస్తుంది

రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచెం 


కర్నూలు(న్యూసిటీ), జనవరి 23: రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడు సంత్సరాలైనా రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదన్నారు. జగన్‌ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం అనేక మందిని సలహాదారులుగా నియమించుకుని వారికి రూ.లక్షల్లో జీతాలు ఎలా ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. సిమెంటు ధరలు పెరగడంతో పాటు, ఇసుక దొరక్క నిర్మాణాలు జరగకపోవడంతో కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.


ముందు భారతి సిమెంట్‌ ధరలు తగ్గించి విక్రయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేస్తే రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి తెలుస్తుందన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సీఎం మద్దతు ఇవ్వాలని కోరారు. రాయలసీమ వాసిగా సీఎం హోదాలో అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కూడా ప్రత్యేక రాయలసీమను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ నెల 31న జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు వైసీపీ పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తేవాలని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-24T08:58:33+05:30 IST