Abn logo
Sep 16 2021 @ 11:32AM

అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం

రూ.60వేలు పలికిన వెంకటరమణ కాలనీ గణనాథుని లడ్డూ

హైదరాబాద్ : మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలోని వినాయకుడి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. హుడా లేఅవుట్ అయిన వెంకటరమణ కాలనీలో కులమతాలకు అతీతంగా కాలనీవాసులందరూ కలిసి కాలనీ మైదానంలోని మండపంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి భక్తిప్రపత్తులతో కాలనీవాసులు ఐదురోజుల పాటు పూజలు చేశారు.గణేశ్ విగ్రహాన్ని కాలనీ వాసి ధన్‌రెడ్డి ఏర్పాటు చేయగా,లడ్డూ ప్రసాదాన్ని వీరేష్ అందించారు. కాలనీ మైదానంలో వినాయకుడి పూజల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంతో పాలుపంచుకున్నారు. 

వందలాదిమందికి అన్నదానం 

వినాయక ఉత్సవాల సందర్భంగా కాలనీవాసి ప్రభాకర్ రెడ్డి వందలాదిమందికి అన్నదానం చేశారు.ఈ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, నాచారం ఇన్ స్పెక్టరు కిరణ్ కుమార్, ఎస్ఐ నాగరాజులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిల్లల కేరింతల మధ్య గణేష్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. నిమజ్జనానికి ముందు పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.విద్యుత్ దీపాల వెలుగులు, టపాసుల పేలుళ్ల మధ్య వినాయకుడి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. 

కోలాహలంగా గణనాథుని ఊరేగింపు

గణనాథుని  ఊరేగింపులో బాజా భజంత్రీల మధ్య మహిళలు, కాలనీవాసులు, పిల్లలు నృత్యం చేశారు. వెంకటరమణకాలనీ నుంచి కాప్రా చెరువుకు ఊరేగింపుగా వెళ్లి గణనాథుని నిమజ్జనం చేశారు. వినాయక ఉత్సవాలు, నిమజ్జనంలో వెంకటరమణ కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి లాయర్ శ్రీనివాస్, కోశాధికారి రమణరావు, ఉపాధ్యక్షులు షేక్ గౌస్, రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాపోలు సతీష్, హరీష్ రెడ్డి, వాసుదేవగౌడ్ లు,కాలనీవాసులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, స్వామి, రమేష్,కమలేశ్వర శర్మ,జగదీష్,శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 


లడ్డూ దక్కించుకున్న ఉపేందర్ రావు

వెంకటరమణ కాలనీ గణనాథుని లడ్డూ వేలంలో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో వినాయకుడి లడ్డూను కాలనీవాసి, అరవింద రియల్టర్ ఆర్ ఉపేందర్‌రావు రూ.60 వేలకు దక్కించుకున్నారు. వెంకటరమణ కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి లాయర్ శ్రీనివాస్ లు  వినాయకుడి లడ్డూను ఉపేందర్‌రావు దంపతులకు అందజేశారు. గత ఏడాది గణేష్ లడ్డూ వేలంపాటలో 33వేలరూపాయలకు పోగా, ఈ ఏడాది మల్లాపూర్ లోనే అత్యధికంగా రూ.60వేల ధర పలికింది. 

 


ఇవి కూడా చదవండిImage Caption