లాల్ కృష్ణ అద్వానీతో పాటు గురువులను గుర్తు చేసుకున్న వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2020-07-05T02:32:32+05:30 IST

గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన గురువులను జ్ఞాపకం చేసుకున్నారు.

లాల్ కృష్ణ అద్వానీతో పాటు గురువులను గుర్తు చేసుకున్న వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ : గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన గురువులను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ తమ తమ గురువులను సంస్మరించుకొంటూ వారు చూపిన మార్గంలో పయనించడానికి ప్రయత్నించాలని కోరారు. చదువు, తెలివితేటలు, సంస్కారం, విజ్ఞానం ఇవన్నీ కూడా తల్లిదండ్రులు, గురువుల వల్లనే లభిస్తాయని అన్నారు. గురు-శిష్యుల సంబంధాలు సరైన పంథాలో ఉంటేనే సమాజం బాగుంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఆ పవిత్ర బంధాన్ని అనుసరించాలని సూచించారు.


ఈ సందర్భంగా ఆయన చిన్న నాటి నుంచి రాజకీయాల్లో ఎదిగినంత వరకూ తారసపడ్డ గురువులను పేరు పేరునా స్మరించుకున్నారు. సంఘ జ్యేష్ఠ కార్యకర్తలైన సోమేపల్లి సోమయ్య, భోగాది దుర్గా ప్రసాద్‌ను గురువులుగా భావిస్తానని తెలిపారు. ఇక రాజకీయ రంగంలో రాష్ట్రం నుంచి తెన్నేటి విశ్వనాథం నుంచి, జాతీయ రాజకీయాల్లో అద్వానీ నుంచి చాలా ప్రేరణ పొందినట్లు ఆయన అన్నారు. ఈ విశ్వమంతా గురువులోనే ఉందని, విశ్వమంతటిలోనూ గురువే ఉన్నారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-05T02:32:32+05:30 IST