Venkaiah Naidu: బీజేపీ సభ్యత్వం తీసుకోను.. మళ్లీ పోస్టు మ్యాన్ కాదలచుకోలేదు.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2022-08-11T01:59:51+05:30 IST

దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలందించి పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తదుపరి రాజకీయ జీవితంపై ఇటీవల భిన్న వాదనలు..

Venkaiah Naidu: బీజేపీ సభ్యత్వం తీసుకోను.. మళ్లీ పోస్టు మ్యాన్ కాదలచుకోలేదు.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ: దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలందించి పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తదుపరి రాజకీయ జీవితంపై ఇటీవల భిన్న వాదనలు వినిపించాయి. ఆయన మళ్లీ బీజేపీకి (BJP) వెన్నుదన్నుగా నిలవనున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు వ్యూహ రచన చేసి తన వంతు కృషి చేయబోతున్నారని కొందరంటే, మరికొందరు మాత్రం ఇకపై వెంకయ్య నాయుడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ భిన్న వాదనల నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. తాను మళ్లీ బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోనని మీడియా చిట్‌చాట్‌లో వెంకయ్య వ్యాఖ్యానించారు. మళ్లీ బీజేపీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పోస్టు ఏది ఇచ్చినా తీసుకోనని, మళ్లీ పోస్టు మ్యాన్ కాదలచుకోలేదని వెంకయ్య నాయుడు మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజల్లో తిరుగుతానని, యువతకు సదా సందేశం ఇస్తూనే ఉంటానని ఆయన చెప్పారు. రాజకీయం అంటే కేవలం పదవులే కాదని, ప్రజలకు సేవ చేయడమని.. ప్రజలకు తన సేవలు కొనసాగిస్తానని వెంకయ్య మీడియాతో ముచ్చటిస్తూ వ్యాఖ్యానించారు. 


నేటితో వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసింది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో సరదాగా కొద్దిసేపు ముచ్చటించారు. తాను ఎప్పుడూ పదవులను ఆశించలేదని, పదవులే తన దగ్గరకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని, రోజుకు 14 గంటలు కష్టపడతారని ప్రధానిపై తనకు ఉన్న అభిమానాన్ని వెంకయ్య మరోసారి చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధానమంత్రి పేరును జోడించాలని తానే సూచించినట్లు బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయడు మీడియాకు తెలిపారు. వెంకయ్య నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు ఓ విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. ఇకపై.. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది.



బీజేపీలో మంచి వ్యూహ కర్తగా వెంకయ్య నాయుడికి ఎంతో పేరు ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీజేపీని నిలబెట్టిన వ్యక్తుల్లో వెంకయ్య నాయుడు కూడా ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వెంకయ్య నాయుడు ఇకపై బీజేపీ సభ్యత్వం తీసుకోనని ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప రాష్ట్రపతిగా సేవలందించిన వ్యక్తి మళ్లీ రాజకీయ పార్టీ నాయకుడిగా మారి విమర్శలు చేస్తూ, ప్రత్యర్థుల విమర్శల ఎదుర్కొంటూ ఉండటం కంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి గౌరవంగా ఉండటమే మేలనే ఉద్దేశంతోనే వెంకయ్య నాయుడు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. బీజేపీ కార్యక్రమాల్లో భాగం కాకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు వెంకయ్య నాయుడు వ్యూహ రచన చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా.. వెంకయ్య నాయుడు బీజేపీ సభ్యత్వం తీసుకోనని, మళ్లీ పోస్టు మ్యాన్ కాదలుచుకోలేదని చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఇటు బీజేపీలోనూ, అటు విపక్షంలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.



ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి పదవిని తాను ఆశించలేదని, నిరాశచెందలేదనే విషయాన్ని కూడా మీడియాతో చిట్‌చాట్‌లో వెంకయ్య నాయుడు చెప్పారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటి ప్రొటోకాల్ లేకపోయినా బాధలేదని, ప్రజలతో మమేకం కావడానికి ఇది ఇంకా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంలోని ఘట్టాలను, ఏబీవీపీలో ఉన్నప్పుడు నెల్లూరులో 1965లో నాటి ప్రముఖ పహెల్వాన్ కాంతారావుతో కుస్తీ పట్టిన రోజులను గుర్తుచేసుకుని ఆ ముచ్చట్లను విలేకరులతో పంచుకున్నారు. ఢిల్లీలోని మీడియా ప్రతినిధులకు వెంకయ్య నాయుడు సంప్రదాయకమైన తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-11T01:59:51+05:30 IST