Abn logo
Jun 22 2021 @ 01:07AM

రాజన్న క్షేత్రం.. భక్తజనసంద్రం

వేములవాడ దేవస్థానంలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటున్న భక్తు లు

వేములవాడ, జూన్‌ 21 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం తొలి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు వరంగల్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల నుంచి  తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. కరోనా నిబందనల కారణంగా స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశం లేకపోవడంతో లఘుదర్శనం అమలు చేశారు. 

కరోనా నిబంధనలు బేఖాతరు

 వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సోమవారం కరోనా నిబంధనలు ఏమాత్రమూ పాటించలేదు. సుమారు 20 వేలకు పైగా భక్తులు తరలిరావడంతో క్యూలో భక్తులు ఒకరిని ఒకరు తోసుకొని ముందుకు వెళ్లడం కనిపించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కరోనా నిబంధనల అమలు విషయంలో ఆలయ సిబ్బంది సైతం పట్టింపు లేనట్లుగా వ్యవహరించారు.