చెరువు తవ్వకంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-08T06:31:46+05:30 IST

చెరువు తవ్వకంలో ఉద్రిక్తత

చెరువు తవ్వకంలో ఉద్రిక్తత
రైతులు అడ్డగించడంతో నిలిచిపోయిన మట్టి లారీలు

మట్టి తవ్వకాన్ని అడ్డుకున్న వేమవరం రైతులు

అనుమతుల్లేవని ఆరోపణ

ఆగిపోయిన లారీలు


విజయవాడ రూరల్‌, మే 7 : విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరం చెరువులో మట్టి తవ్వకాలను శనివారం రైతులు అడ్డుకున్నారు. సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు కింద సుమారు 139 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు రైతులకు తెలియకుండా కొందరు వ్యక్తులు ఇష్టానుశారంగా  తవ్వకాలు జరుపుతున్న విషయం బయటకు పొక్కడంతో రైతులు అడ్డుకున్నారు. జలవనరుల శాఖ అనుమతి లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల సాగునీటికి ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆ చెరువు మా అందరిదీ : స్థానిక రైతులు

ఈ చెరువు విషయంలో కొన్నాళ్ల నుంచి స్థానిక రైతులకు, చెరువు హక్కుదారు కుటుంబాలకు మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు జరుపుతుండటంతో రాజకీయాలకు అతీతంగా రైతులు తవ్వకాలను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు గంధం సుబ్బారావు, బొర్రా పున్నారావు, గర్నిపూడి మాధవరావు, జమలయ్య, నరేంద్ర, వైసీపీ నాయకులు తిమ్మన హిమా, యడ్ల మధుసూదనరావుతో పాటు ఆయకట్టు రైతులు తవ్వకాలను అడ్డుకుని, లారీలను నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేమవరంలోని సొంత చెరువు నీటితో షాబాద, జక్కంపూడికి చెందిన 139 ఎకరాల ఆయకట్టులో ఏటా రెండు పంటలు పండుతున్నాయన్నారు. అలాంటి చెరువును కుటుంబ చెరువుగా చూపించి అక్రమంగా తవ్వేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల సాగుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. చెరువును పూడిక తీయాలంటే జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండగా, అదేమీ చేయలేదన్నారు. మట్టిని రైతులు పొలాల్లో తోలుకునేందుకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. ఈ చెరువు సాగునీటిదని, అది రైతులకు చెందుతుందని న్యాయస్థానంలో తీర్పు వచ్చినా, కుటుంబ చెరువుగా చూపించి తవ్వడం గర్హనీయమన్నారు. గతంలో చెరువు విషయంపై స్పందనలో ఫిర్యాదు చేశామన్నారు. అక్రమంగా మట్టి తవ్వుతున్నారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు         చేయనున్నామన్నారు. చెరువులో మట్టి తవ్వకాలపై  జలవనరుల శాఖ ఏఈఈ కొండా నాయక్‌ను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ చేయగా, స్పందించలేదు.

మా వంశీయులదే : లక్కంరాజు పుండరీక వరదవర్మ

వేమవరంలోని చెరువు తమ కుటుంబ చెరువని, రెవెన్యూ రికార్డుల్లో అది సొంత చెరువుగానే ఉన్నట్లు కొత్తూరు తాడేపల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు లక్కంరాజు పుండరీక వరదవర్మ (రాజు)  తెలిపారు. కుటుంబంలోని 14 మంది వంశీయుల పేరిట సొంత చెరువు ఉందన్నారు. అయినప్పటికీ షాబాద, జక్కంపూడి, వేమవరంలోని ఆయకట్టుకు సాగునీటి సమస్య తలెత్తకుండా కాల్వలు ఏర్పాటు చేశామన్నారు. నీటి సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతోనే తవ్వకాలు జరుపుతున్నామన్నారు. 



Read more