వెలిగొండపై ఉత్త మాటలే!

ABN , First Publish Date - 2021-04-11T04:53:35+05:30 IST

నాడు కల.. నేడు నిజం అదే జలయజ్ఞం అంటూ ప్రభుత్వం పదే పదే చెప్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

వెలిగొండపై ఉత్త మాటలే!
కడపరాజుపలె ్ల వద్ద తెగిన ఫీడర్‌ కెనాల్‌(ఫైల్‌)

రెండేళ్లుగా చెప్తూనే ఉన్నారు

రెండో సొరంగం పూర్తయ్యాకే కృష్ణా జలాలు

మూడు నెలలుగా నిలిచిన తవ్వకం పనులు

రెండు వైపులా నిర్మాణంపై యోచన

అసంపూర్తిగా ఫీడర్‌, తీగలేరు కాలువ

నిర్వాసితులకు అందని పరిహారం

మరో ఏడాదికి కూడా నీరివ్వడం కష్టమే 


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020 ఫిబ్రవరి 20న వెలిగొండ సొరంగం పనులను పరిశీలించారు. ఆ ఏడాది ఆగస్టు చివరి నాటికి నీళ్లివ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రతి వారం పర్యవేక్షించారు. 

--------------------------------------

సీఎం ఆదేశాల మేరకు ఆగస్టు 28న సొరంగం పనుల పరిశీలనలో భాగంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా కార్మికుల కొరతతో పనుల్లో జాప్యం జరిగిందని, 2020 అక్టోబర్‌కు పూర్తి చేస్తామని తెలిపారు.

------------------------------------------------

మళ్లీ నవంబరు 20న ఇంజనీరింగ్‌ శాఖాధికారులతో  పనుల పురోగతిపై దోర్నాలలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. 2021 ఆగస్టుకు రెండు సొరంగాల నిర్మాణాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. 

--------------------------------------------------------

మళ్లీ 2021 జనవరిలో పనులపై సమీక్షకు కలెక్టర్‌ దోర్నాల వచ్చారు. వెలిగొండ రెండు సొరంగాలనూ ఈ ఏడాది జూలై చివరికి పూర్తిచేస్తామని తెలిపారు. 

---------------------------------------------------------

ఇదీ సర్కారు మాటల తీరు. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరందించే వరప్రసాదిని  వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిపై ప్రభుత్వ పాలకులు, అధికారుల ప్రకటనలు హాస్యాస్పదంగానూ, ఆశ్చర్యంగానూ ఉన్నాయి. సంక్రాంతికి, దసరాకు నీళ్లిస్తామని కాలం వెళ్లదీశారని గత ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించిన వైసీపీ నేతలు ప్రస్తుతం మాయ మాటలతో సరిపెడుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు  పూర్తికావస్తున్నా ప్రాజెక్టు పురోగతి నామమాత్రమే. మొదటి టన్నెల్‌ పూర్తయిందంటున్నారే కానీ నీరిచ్చే పరిస్థితి లేదు. నీరివ్వాలంటే రెండో టన్నెల్‌ పూర్తికావాల్సిందేనట. వాస్తవ పరిస్థితుల ప్రకారం చూస్తే ఫీడర్‌ కాలువలు, రెండో టన్నెళ్లు, పునరావాసం పనుల తీరు చూస్తుంటే నీరివ్వాలంటే మరో ఏడాది పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

పెద్దదోర్నాల, ఏప్రిల్‌ 10 : నాడు కల.. నేడు నిజం అదే జలయజ్ఞం అంటూ ప్రభుత్వం పదే పదే చెప్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మండలంలోని కొత్తూరు వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలోని కీలకమైన సొరంగం పనులు ఇందుకు అద్దం పడుతున్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టు మొత్తం కాకపోయినా మొదటి దశలో భాగంగా ఒక టన్నెల్‌ పూర్తిచేసి రిజర్వాయర్లు నింపి భూగర్భ జలాలను పెంపొందిస్తామని చెప్పినప్పటికీ సొరంగాలు పూర్తవకుండానే పదవీకాలం ముగించింది. అప్పటికే మొదటి సొరంగం పనులు దాదాపు చివర్లో ఉన్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాదిలో నీళ్లు ఇస్తామంటూ రీటెండరింగ్‌ ద్వారా కాంట్రాక్టర్లను మార్చేసింది. మొదటి సొరంగం నిర్మాణ పనులు ఇటీవల పూర్తిచేసింది. మాన్యువల్‌గా చేసిన పనులకు  లైనింగ్‌ చేయాల్సి ఉంది. అంతేగాక ఫీడర్‌ కాలువ పెండింగ్‌ పనులు చేయాల్సి ఉంది. ప్రధానంగా ముంపు గ్రామ నిర్వాసితులకు పరిహారం సుమారు రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో భాగంగా మొదటి సొరంగం లైనింగ్‌, ఫీడర్‌ కాలువ లింక్‌ నిర్మాణం పనులు, రిజర్వాయర్‌ల పనులు పూర్తిచేసి నిర్వాసితులకు పరిహారం అందజేసి పునరావాస కేంద్రాలకు తరలించి ఉంటే వచ్చే వర్షాకాలానికి నిర్దేశిత సమయంలో రిజర్వాయర్లకు కృష్ణాజలాలను తరలించే అవకాశం ఉండేది. కానీ క్షేత్రస్థాయిలో పనులు అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. దీంతో మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.


 రెండో సొరంగం నిర్మాణం పూర్తిపై కాంట్రాక్టర్ల దృష్టి

వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా.. మా భూములు ఎప్పుడు సస్యశ్యామలం అవుతాయా అని 14ఏళ్లుగా ఎదురుచూస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు మరో ఏడాది వేచిచూడాల్సిందే. మొదటి సొరంగం పనులు పూర్తయినా లైనింగ్‌ చేయకుండా రెండో సొరంగం పనులపై దృష్టి సారించారు. దీంతో ప్రణాళికల్లో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం రెండో సొరంగం పనులు ఒకవైపు నుంచి టీబీఎం (టన్నెల్‌ బోర్‌ మిషన్‌) తవ్వకం ప్రారంభించి, మరోవైపు మొదటి సొరంగం 16.500 కిలోమీటర్ల వద్ద నుంచి రెండో సొరంగం వైపునకు అడ్డంగా ఒకఅడిట్‌ (అడ్డదారి)ని తవ్వాలని నిర్ణయించారు. అక్కడ నుంచి టీబీఎం వైపు తవ్వకం చేయాలని, అదేవిధంగా హెడ్‌ రెగ్యులేటర్‌వైపు కూడా తవ్వకం చేయాలని, మూడు వైపులా నిర్మాణం పనులు చేపట్టాలని భావిస్తున్నారు.  ఈక్రమంలో మొదటి సొరంగం 16.5 కిలోమీటర్ల వద్ద నుంచి ఒక అడ్డదారిని రెండో సొరంగం వరకూ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక 17.5 కిలోమీటర్ల వద్ద కూడా మరో అడిట్‌ (అడ్డదారి)ని కూడా తవ్వాలని, తద్వారా సొరంగం లోపల తవ్విన మట్టినిసులభంగా బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు రెండు సొరంగాల నిర్మాణాల మధ్యలో హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపాన భూపైభాగానికి మట్టిని తరలించేందుకు (షాప్ట్‌) గొయ్యిని తవ్వనున్నట్లు సమాచారం. ఈ గొయ్యి ద్వారా తవ్విన వ్యర్థాన్ని త్వరితగతిన బయటకు తరలించే అవకాశం ఉంటుంది. టన్నెల్‌ నిర్మాణ పనులు పూర్తిగా టీబీఎం ద్వారా చేయాల్సి ఉండగా, తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా కన్వేయర్‌ బెల్టు తెగిపోవడంతో ఇబ్బందికరంగా మారిందని ఇంజనీరింగ్‌ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించే క్రమంలో మాన్యువల్‌గా పనులు చేపడుతున్నట్లు చెప్తున్నారు. రెండో టన్నెల్‌ పనులు తిరిగి మరో పక్షంరోజుల్లో పునఃప్రారంభించనున్నట్లు ఆ శాఖాధికారులు తెలిపారు. ఈ విధంగా పనులు చేస్తే రెండు టన్నెళ్లు పూర్తయ్యాకే నీటిని వదిలే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన ఎంత వేగంగా సాగినా మరో రెండేళ్లకు కానీ అన్ని పనులు పూర్తికావస్తాయి. ఒకపక్క అధికార పార్టీ నాయకులు, అధికారులు చెప్తున్నట్లు ఈ ఏడాదికి వెలిగొండ నీరు లేనట్లే.   


12 ఏళ్లుగా సాగుతున్న ఫీడర్‌ కెనాల్‌ పనులు

వెలిగొండ ప్రాజెక్టులో మరో ప్రధాన నిర్మాణం ఫీడర్‌ కెనాల్‌ తవ్వకం. కృష్ణానది కొల్లంవాగు ప్రాంతం నుంచి దోర్నాల మండలం కొత్తూరు వరకు 18.89 కి.మీలుసొరంగమార్గం ద్వారా కృష్ణాజలాలు ప్రవహించి అక్కడ నుంచి ఫీడర్‌ కాలువ ద్వారా 21.8 కి.మీలు దూరంలో ఉన్న నల్లమల జలాశయాలకు చేరుతాయి. ఈ కాలువ పనులు రూ.145కోట్లతో చేపట్టారు. ఇప్పటికి 21 కి.మీ. తవ్వారు. ఎక్కువ భాగం పనులు పుష్కరకాలం క్రితమే పూర్తి చేశారు. దీంతో ఆ కాలువ ప్రస్తుతం చిల్లకంపతో చిట్టడవిలా మారింది. కరకట్టలు వర్షాలకు కోతలు పడి బీటలు వారాయి. కడపరాజుపల్లె వద్ద కోత పడి వర్షపు నీరు గ్రామంలోకి చేరింది. పంటలు కూడా తీవ్ర నష్టానికి గురయ్యాయి. ఈ కాలువపై 20 వంతెనలు నిర్మించాల్సి ఉండగా, 14 ఏర్పాటు చేశారు. మరోవైపు తీగలేరు కాలువ ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 66,300ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అందులో భాగంగా నల్లమల సాగర్‌ నుంచి పెద్దారవీడు, పెద్ద దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలకు 48.3కి.మీల పొడవునా రూ.77కోట్లతో కాలువ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 47.050 కి.మీ పనులు పూర్తయ్యాయి. అయితే చాలాచోట్ల కట్టలు కోతకు గురయ్యాయి. కాలువల్లోకి వచ్చే వర్షపు నీరు పొలాలపై ప్రవహించి పంటలు నాశనమవుతున్నాయి. ఈ కాలువపై 73 వంతెనలు నిర్మించాల్సి ఉండగా, 40 పూర్తిచేశారు. అంతేగాక నల్లమల సాగర్‌ నుంచి తీగలేరుకు అనుసంధానంగా 700 మీటర్లు సొరంగం తవ్వాల్సి ఉంది. 







Updated Date - 2021-04-11T04:53:35+05:30 IST