Womens T20 Challenge Final: రాణించిన డాటిన్, హర్మన్‌ప్రీత్.. వెలాసిటీ ఎదుట భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-29T02:56:54+05:30 IST

డియేండ్ర డాటిన్ అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు ఇన్నింగ్స్ తోడు కావడంతో వెలాసిటీతో జరుగుతున్న

Womens T20 Challenge Final: రాణించిన డాటిన్, హర్మన్‌ప్రీత్.. వెలాసిటీ ఎదుట భారీ లక్ష్యం

పూణె: డియేండ్ర డాటిన్ అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపు ఇన్నింగ్స్ తోడు కావడంతో వెలాసిటీతో జరుగుతున్న ఫైనల్‌లో సూపర్ నోవాస్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి ప్రత్యర్థికి సవాల్ విసిరింది.


టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన సూపర్ నోవాస్‌కు చక్కని ఆరంభం లభించింది. ఓపెనర్ ప్రియా పూనియా, డాటిన్‌లు కలిసి తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. 29 బంతుల్లో రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసిన ప్రియా పూనియా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్‌తో కలిసి డాటిన్ చెలరేగిపోయింది. సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. మరోవైపు, హర్మన్‌ప్రీత్ కూడా బ్యాట్ ఝళిపించడంతో పరుగుల వరద పారింది. ఈ క్రమంలో 44 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసిన డాటిన్ 131 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత సూపర్ నోవాస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో అప్పటి వరకు పరుగులు తీసిన స్కోరు ఆ తర్వాత నెమ్మదించింది.


మరోవైపు, 29 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసిన హర్మన్ నిష్క్రమించిన తర్వాత పరుగులు రావడం గగనమైంది. పూజా వస్త్రాకర్ (5), సోఫీ ఎక్‌లెస్టోన్ (2), సునే లుస్ (3), హర్లీన్ డియోల్ (7) వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లడంతో సూపర్ నోవాస్ ఇన్నింగ్స్ 165 పరుగుల వద్ద ముగిసింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్, దీప్తిశర్మ, సిమ్రన్ బహదూర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. 

Updated Date - 2022-05-29T02:56:54+05:30 IST