మంత్రి వెలంపల్లి అక్రమాల చిట్టా తయారీలో వైసీపీ సీనియర్లు!

ABN , First Publish Date - 2020-06-06T15:49:25+05:30 IST

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు సొంత నియోజకవర్గంలో..

మంత్రి వెలంపల్లి అక్రమాల చిట్టా తయారీలో వైసీపీ సీనియర్లు!

తాడో.. పేడో!

‘నాడు - నేడు’ పనులూ అనుచరులకే!

పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు

4 సీట్లు మాజీలకు.. మిగిలినవి అమ్ముకున్నారు

అధిష్ఠానానికి లేఖలు రాయాలని సీనియర్ల నిర్ణయం

స్పందించకుంటే నిరసన దీక్షలకు సిద్ధం


(విజయవాడ- ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ పెరిగిపోతోంది. ఇప్పటికే మంత్రి వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన పార్టీ సీనియర్లు మూడు రోజుల క్రితం సమావేశమై మంత్రి తీరుకు ఎలా చెక్‌ పెట్టాలో చర్చించుకున్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు జాప్యం అయ్యే అవకాశం ఉండటంతో ముందుగా లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి డివిజన్‌ నుంచి వెలంపల్లి వ్యతిరేక వర్గం నాయకులు ఓ లేఖను అధిష్ఠానానికి రాయాలని నిర్ణయించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మంత్రి వెలంపల్లి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలను వివరించాలని నిర్ణయించారు. మంత్రి తీరు కారణంగా నియోజకవర్గంలో పార్టీ ఏ విధంగా నష్టపోతుందో వివరించనున్నారు. 


సీనియర్ల ఆవేదన ఇదీ..

పార్టీ అధికారంలో లేని ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, తన బినామీలకు, తనకు డబ్బులు ఇచ్చే వారినే మంత్రి ప్రోత్సహిస్తున్నారని, వారినే అందలం ఎక్కిస్తున్నారని వైసీపీలోని సీనియర్లు ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్‌ఖాన్‌ ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పార్టీ బరువు బాధ్యతలను షేక్‌ ఆసీఫ్‌కు పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఆసీఫ్‌కే పశ్చిమ వైసీపీ టికెట్‌ వస్తుందని అంతా భావించారు. అయితే వెలంపల్లికి ఆ టికెట్‌ దక్కింది. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉండి, వెలంపల్లి కారణంగా ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చిన ఆసీఫ్‌కు కార్పొరేటర్‌ టికెట్‌ కూడా దక్కకుండా చేయాలని మంత్రి ప్రయత్నించారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


చివరికి ఆసీఫ్‌ పార్టీ పెద్దల ఆశీస్సులతో టికెట్‌ తెచ్చుకున్నారు. అందరూ అలా చేయలేకపోయారని, దీంతో మంత్రి పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో నాలుగు మినహా మిగిలిన 18 డివిజన్ల నుంచి డబ్బులు ఇచ్చిన వారినే పోటీకి నిలబెట్టారని ఆరోపిస్తున్నారు. మంత్రి ధోరణి కారణంగా పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమంలోని ఓ డివిజన్‌లో పార్టీకి సంబంధం లేని వ్యక్తికి సీటు కేటాయించడంతో, గత ఎన్నికల్లో అక్కడి నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని మంత్రి వ్యతిరేక వర్గం చెబుతోంది. ఇలాంటి సంఘటనల కారణంగా పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతిని పార్టీ నష్టపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మంత్రి ఒక్కొక్క సీటును రూ.15 నుంచి 30 లక్షల వరకు అమ్ముకున్నారని సీనియర్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు మంత్రిని కలవడానికి ఆయన కార్యాలయానికి వెళితే సీసీ ఫుటేజ్‌లను వీక్షిస్తూ, తనకు అనుకూలురతోనే మాట్లాడుతున్నారని, లేకుంటే తాను బిజీగా ఉన్నానని, ఇప్పుడు కలవడానికి వీలు ఉండదని కార్యాలయం సిబ్బందితోనో, ఎస్కార్ట్‌ చేతనో చెప్పిస్తున్నారని పలువురు సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.  


బినామీల ముసుగులో దోచేస్తున్నారు

మంత్రి నలుగురైదుగురు బినామీలను ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ సీనియర్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ‘నాడు- నేడు’ పనులు మొదలు దుర్గగుడిపైన టెండర్లు, చివరికి కరోనా సమయంలో శానిటైజర్లు, పీపీఈ కిట్ల తయారీ అన్నీ తన బినామీలకే కట్టబెట్టారని వారు చెబుతున్నారు. నాసిరకం శానిటైజర్లు, పీపీఈ కిట్ల సరఫరా ద్వారా ప్రజల్లోనూ పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటోందని వారు వాదిస్తున్నారు. 


మంత్రి తన అనుచర వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ, వారిని వివిధ కమిటీల్లో నియమిస్తూ సీనియర్లను అణగదొక్కుతున్నారని, దీనిక వ్యతిరేకంగా నియోజకవర్గంలో వరస సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి వ్యతిరేక వర్గం నిర్ణయించింది. అదే సమయంలో అన్ని డివిజన్ల నుంచి పార్టీ అధిష్ఠానానికి లేఖలు రాయాలని నిర్ణయించారు. 


ఇది కూడా చదవండి:

---------------------

అంతా బినామీలకే!

Updated Date - 2020-06-06T15:49:25+05:30 IST