పునరావాసంపై అనిశ్చితి

ABN , First Publish Date - 2020-09-17T16:24:44+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పునరావాసంపై అనిశ్చితి..

పునరావాసంపై అనిశ్చితి

ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ల అనాసక్తి

రెండు ప్యాకేజీలకు దాఖలుకాని టెండర్లు

నాలుగు ప్యాకేజీలకు సింగిల్‌ 

వన్‌టైం సెటిల్‌మెంట్‌ కోసం ప్రభుత్వం నుంచి  ఒత్తిడి

ఏదో ఒక విధంగా ఒప్పించేందుకు ప్రయత్నాలు

నిర్వాసిత గ్రామాల్లో ప్రారంభమైన రీసర్వే

బలవంతంగా సంతకాలు 

అక్రమార్కులకు కలిసొస్తున్న హడావుడి వ్యవహారం


మార్కాపురం(ప్రకాశం): వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పునరావాసంపై అనిశ్చితి నెలకొంది. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.  అందుకు పైకి కనిపించని అనేక రకాల కారణాలు ఉన్నాయి.  నిర్వాసితులకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆరు ప్యాకేజీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆగస్టు 1న టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించి 18 రోజులు గడువు ఉన్నప్పటికీ ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో రెండోసారి ఆగస్టు 24న మరోసారి టెండర్లు ఆహ్వానించారు. తుది గడువైన ఆగస్టు 31నాటికి మళ్లీ ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో చివరి తేదీని సెప్టెంబర్‌ 7 నాటికి పొడిగించారు. అయినా వచ్చింది సింగిల్‌ టెండరే. దీని వెనుక అధికారం మార్కు వ్యవహారం ఉందనే ప్రచారం ఉంది. ఈ కారణాలతో పునరావాస చర్యలు అడుగు ముందుకు పడటం లేదు. గడువేమో ముంచుకొస్తోంది. దీంతో అధికారులు అడ్డదారుల్లో వ్యవహారం నడుపుతున్నారు. బలవంతంగా వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ఒప్పించడానికి చూస్తున్నారు.


వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయి. వీటిని  కట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలని భావించి ప్రభుత్వం రూ.1,401కోట్లు విడుదల చేసింది. పునరావాస చర్యలను వేగవంతం చేసింది. నిర్వాసితులను ఆదుకునేందుకు ఆర్‌అండ్‌ఆర్‌, వన్‌టైం సెటిల్‌మెంట్‌లను అమలు చేస్తోంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా 11 పునరావాస కాలనీల్లో 3153 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. 


రూ. 171.36 కోట్లతో టెండర్లు

వెలిగొండ ప్రాజెక్ట్‌ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎంపిక చేసిన 3153 మంది నిర్వాసితులకు ఇళ్లు నిర్మించే బాధ్యతను ప్రభుత్వం ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. ఈ మేరకు 7 ప్యాకేజీలలో రూ. 171.36 కోట్లతో ఇళ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు ఆహ్వానించారు. మార్కాపురం మండలం గోగులదిన్నె వద్ద రూ.50.83 కోట్లతో 917 గృహాలు, వేములకోట వద్ద రూ.39.96 కోట్లతో 720 గృహాలు, ఇడుపూరు వద్ద రూ.19.48 కోట్లతో 351 గృహాలు, పెద్దా రవీడు మండలం తోకపల్లి వద్ద రూ.12.87 కోట్లతో 232 గృహాలు, దేవరాజుగట్టు వద్ద రూ.32.46 కోట్లతో 585 గృహాలు, బేస్తవారిపేట మండలం ఒందుట్ల వద్ద 64 గృహాలు నిర్మించాల్సి ఉంది.


కాంట్రాక్టర్ల అనాసక్తి 

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 6 ప్యాకే జీలలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. ఆగస్టు 1 అధికారులు టెండర్‌ ప్రకటన జారీ చేసి 18 రోజులు గడువు ఇచ్చినప్పటికీ ఆరు ప్యాకేజీలకు ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో రెండోసారి ఆగస్టు 24న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. తుది గడువైన ఆగస్టు 31నాటికి మళ్లీ ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో చివరి తేదీని ఈనెల  7 వరకూ పొడిగించారు.


నాలుగు ప్యాకేజీలకు సింగిల్‌ టెండర్‌

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఏర్పాటు చేయనున్న పునరావాస కాలనీలకు సంబంధించిన 7 టెండర్లలో 4 ప్యాకేజీలకు సింగిల్‌ టెండర్‌ వచ్చింది. ఇడు పూరు-1, ఇడుపూరు-2, గోగులదిన్నె, వేములకోట వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి మాత్రమే హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు బిడ్లు దాఖలు చేశారు. మిగిలిన పెద్దారవీడు మండలం తోకపల్లి, దేవరాజుగట్టు వద్ద పునరావాస కాలనీల ప్యాకేజీలకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదు. బేస్తవారిపేట మండలం ఒందుట్ల వద్ద నిర్మించనున్న పునరావాస కాలనీకి మాత్రమే మొదటి నోటిఫికేషన్‌ సమయంలోనే 3 టెండర్లు వచ్చాయి. 


వన్‌టైం సెటిల్‌మెంట్‌పైనే అధికారుల దృష్టి

వెలిగొండ నిర్వాసితులకు నష్టపరిహారంగా రెండు విధానాలను ప్రకటించింది. మొదటిది వన్‌టైం సెటిల్‌మెంట్‌, రెండోది ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.12.50 లక్షలు చెల్లిస్తారు. దీంతో నిర్వాసితుడికి ప్రభుత్వ పరంగా పునరావాస చర్యలుండవు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ఎంపిక చేసుకున్న నిర్వాసితుడికి రూ.5.50 లక్షలతో 5 సెంట్ల స్థలంలో ప్రభుత్వమే ఇళ్లు కట్టి ఇస్తుం ది. మిగిలిన మొత్తాన్ని నగదుగా చెల్లిస్తోంది. ఇందుకుగాను 3153 మంది ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ఎంపిక చేసుకున్నారు. వీరందరికీ పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అధికారుల హడావుడి వ్యవహారం అక్రమార్కులకు కలిసొచ్చింది. ఇదే అదనుగా అనర్హులను నిర్వాసితుల జాబితాల్లో చేర్చి పరిహారం కొట్టేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో అధికారులకు వాటా ఉందనే ప్రచారం ఉంది.


ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో తెర మీదకు కొత్త అంశం

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అంశం కాకుండా మరో అంశం తెరమీదకు వచ్చింది. నిర్వాసిత గ్రామాలలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ఎంపిక చేసుకున్న వారికి పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం జరిపిన తర్వాత వారు ఆయా గ్రామాలను ఖాళీ చేస్తారు. కానీ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పునరావాస చర్యలలో జాప్యం జరుగుతోంది. దీంతో ఆర్‌అండ్‌ఆర్‌ను ఎంపిక చేసుకున్న నిర్వాసితులకు ఫారం-3పై సంతకాలు చేయించాలని సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఫారం ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఎంపిక చేసుకున్న లబ్ధిదారులను ఇంటి నిర్మాణానికి కేటాయించిన రూ.5.50లు మినహా మిగిలిన రూ.7 లక్షలు ప్రస్తుతం చెల్లిస్తారు. వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలి. ప్రభుత్వం నిర్మించి ఇచ్చినప్పుడు పునరావాస కాలనీల్లో చేరాలి. ఈ అంశానికి సంబంధించి ఫారం-3పై నిర్వాసితులతో అంగీకారపత్రం సేకరించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఇందుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ను ఎంపిక చేసుకున్న నిర్వాసితుల నుంచి విముఖత వస్తున్నట్లు క్షేత్రస్థాయి అధికారులు తెలిపారు. 


నిర్వాసితులపై అధికారుల ఒత్తిడి

పునరావాస కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపని నేపఽథ్యంలో ఎక్కువ మందిని వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరింపచేయాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. గత వారంలో నిర్వాసిత గ్రామాలలో సర్వేలు నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మార్కాపురంలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వన్‌టైం సెటిల్‌మెంట్‌ ప్యాకేజీకి ఎక్కువమంది నిర్వాసితులు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 


నిర్వాసిత గ్రామాల్లో రీసర్వే

పెద్దారవీడు: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాలైన సుంకేసుల, గుండంచర్ల, కలనూతలలో బుధవారం వన్‌టైం సెటిల్‌మెంట్‌పై రీసర్వే నిర్వహించారు. మూడు గ్రామాల్లో 5 బృందాలుగా అధికారులు విచారణ చేపట్టారు. ఫారం-3పై నిర్వాసితులతో బలవంతంగా సంతకాలు చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  

Updated Date - 2020-09-17T16:24:44+05:30 IST