ఎన్నాళ్లకెన్నేళ్లకు! వెలిగొండ తొలి టన్నెల్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-01-16T05:28:46+05:30 IST

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతోపాటు నెల్లూరు, కడప జిల్లాలోని కొద్దిప్రాంతాలు కలిపి మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు సర్వేకి బీజం పడింది. 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడిడ్డి సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా 2005 అక్టోబరులో పనులు ప్రారంభమయ్యాయి. 15 ఏళ్లుగా పనులు ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి.

ఎన్నాళ్లకెన్నేళ్లకు! వెలిగొండ తొలి టన్నెల్‌ పూర్తి
తవ్వకం పూర్తయ్ టన్నెల్‌లోపల రెండు వెపులా కలిసినప్రాంతం టన్నెల్‌ బోర్‌ మిషన్‌(టీబీఎం) బయటకు తరలించేందుకు ముక్కలుగా కట్‌ చేస్తున్న కార్మికులు

మిషన్‌తో 17.50 కిలోమీటర్లు, 

మనుషులతో 1.07 కిలో మీటర్ల తవ్వకం

వేగంగా టీబీఎం తొలగింపు ప్రక్రియ

ఇప్పటికే తొలి టన్నెల్‌ హెడ్‌రెగ్యులేటరీ పూర్తి

పునరావాసం పూర్తి చేస్తే తక్షణం నీటిని నింపుకొనే అవకాశం



ఒంగోలు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రాంత వాసుల ఆశాజ్యోతి అయిన వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన తొలి టన్నెల్‌ తవ్వకం పూర్తయింది. దాదాపు 15సంవత్సరాలుగా సాగిన పనులు సంక్రాంతి వేళ గురువారంతో ముగిశాయి. తవ్వకానికి వినియోగించిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) శకలాల తొలగింపు పక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు ఇప్పటికే తొలి టన్నెల్‌కు సంబంధించిన హెడ్‌ రెగ్యులేటరీ నిర్మాణం కూడా  పూర్తయింది. దీంతో కృష్ణానది నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తీసుకొనేందుకు మార్గం సుగమమం అయింది. అయితే ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల తరలింపులో జరిగిన జాప్యం, ఇతరత్రా సమస్యలతో ప్రస్తుతం టన్నెల్‌ తవ్వకం పూర్తయినా, కృష్ణానదిలో నీరు అందుబాటులో ఉన్నా వెలిగొండ ప్రాజెక్టుకు తీసుకొనే అవకాశం లేకుండా పోయింది.


 జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతోపాటు నెల్లూరు, కడప జిల్లాలోని కొద్దిప్రాంతాలు కలిపి మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు సర్వేకి బీజం పడింది. 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.  వైఎస్‌ రాజశేఖరరెడిడ్డి సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా 2005 అక్టోబరులో పనులు ప్రారంభమయ్యాయి. 15 ఏళ్లుగా పనులు ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ  హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో పనులు వేగం అందుకున్నాయి. ఇప్పుడు తొలి టన్నెల్‌ తవ్వకం పూర్తయ్యింది. 


టన్నెళ్ల తవ్వకం ఇలా.. 

దోర్నాల సమీపంలోని కొత్తూరు వద్ద నుంచి నల్లమల అడవిలో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు సుమారు 18.82 కి.మీ దూరం ఏడు మీటర్ల వ్యాసంతో ఒకటి, 9.2 మీటర్ల వ్యాసంతో మరో సొరంగం తవ్వి తొలి టన్నెల్‌ నుంచి 3వేలు, రెండో దాని నుంచి 8500 క్యూసెక్కులు వెరసి రోజుకు 1 టీఎంసీ నీటిని తీసుకు వచ్చేలా డిజైన్‌ చేశారు. సొరంగం బయటకు నీరు వచ్చాక నల్లమల కొండల అంచున 22 కి.మీ ఫీడర్‌ కాలువ ద్వారా ఆ నీటిని వెలిగొండ ప్రాజెక్టుకు తరలించాలని నిర్ణయించారు. నల్లమల కొండల మధ్య సుంకేసుల, గొట్టిపడియ, కాకర్లల వద్ద డ్యాంల నిర్మాణంతో సుమారు 53.85 టీఎంసీల పూర్తి సామార్థ్యం, 43.58 టీఎంసీల నీటి వాడకం ఉండేలా రిజర్వార్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించారు.  


ఏడు ప్యాకేజీల్లో పనులు

 ప్రాథమికంగా 2005 అక్టోబరులో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. వీటిని మొత్తం ఏడు ప్యాకేజీలుగా విభజరించారు. రిజర్వాయర్‌ ఏర్పాటుకు అవసరమైన డ్యామ్‌ నిర్మాణం, కొన్ని కాలువల తవ్వకం, ఇతర పనులు పూర్తయినా కీలకమైన టన్నెల్‌ తవ్వకాలు, హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణాలలో తీవ్ర జాప్యం జరిగింది. 2008లో జర్మనీ  సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు రూ. 105 కోట్లతో టీబీఎంను తొలి టన్నెల్‌ తవ్వకం కోసం తెచ్చారు. ఇది సాధారణంగా రోజుకు 20 మీటర్లు తవ్వుతుంది. అయితే సాంకేతిక సమస్యలు, గట్టిరాయి పడటం వంటి ఇబ్బందులతో ఆశించిన విధంగా పనులు ముందుకు సాగలేదు. పనులు చేపట్టిన 16 మాసాల అనంతరం అవాంతరాలతో ఆగిపోగా తిరిగి 2011లో పునఃప్రారంభించారు. ఆ తర్వాత కూడా ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. మూడేళ్లలో పూర్తి కావాల్సిన తొలి టన్నెల్‌ తవ్వకం పనులు 2014 నాటికి 12.50 కి.మీ మాత్రమే జరిగాయి.


చంద్రబాబు ప్రత్యేక దృష్టితో పనుల్లో వేగం  

నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక  దృష్టి సారించారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించి ఆ బాధ్యతను 2017లో మరో ఏజెన్సీకి అప్పగించారు. టన్నెల్‌ తవ్వకం టెండర్‌లో అంతర్భాగంగా ఉన్న హెడ్‌రెగ్యులేటరీ పనులు విడిగా మరో సంస్థకు ఇచ్చారు. అనంతరం పనులు వేగవంతమయ్యాయి. ఒక వైపు టీఎంబీ ద్వారా మిషన్‌తోనూ, మరో వైపు హెడ్‌రెగ్యులేటరీ వైపు నుంచి మనుషులతోనూ తవ్వకం చేయించారు. దాని వల్ల ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రెండు వైపులా కలిపి 16.28 కి.మీ తవ్వకం జరిగింది. అలా టీడీపీ హయాంలో సుమారు 4 కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వకం జరగడంతోపాటు, హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి టన్నెల్‌కు సంబంధించిన మిగిలిన తవ్వకం పనులు ఏడాదిలో పూర్తి చేసి గత సంవత్సరం వ్యవసాయ సీజన్‌కు నీటిని ఇస్తామని ప్రకటించారు. నిర్థిష్ట గడువులో కాకపోయినా ఇప్పటికి టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. మొత్తం 18.82 కి.మీ టన్నెల్‌ తవ్వకంలో సుమారు 17.50 కి.మీ టీబీఎంతో గతనెల 15 నాటికి పూర్తి చేశారు. అంతటితో మిషన్‌ పనులు నిలిపివేసిన అధికారులు దాన్ని అక్కడే ధ్వంసం చేసి బయటకు తెచ్చే చర్యలు చేపట్టారు.  ఆ ప్రక్రియ పూర్తికి మరో నెలకుపైగా పట్టవచ్చని సమాచారం. 


గత ప్రభుత్వ హయాంలోనే మనుషులతో తవ్వకం ప్రారంభం

హెడ్‌రెగ్యులేటరీ వైపు నుంచి మనుషులతో చేపట్టిన తవ్వకం పనులు గురువారంతో పూర్తయ్యాయి. దాదాపు 1.07 కి.మీ దూరం అలా తవ్వారు. గత ప్రభుత్వ కాలంలోనే అందులో దాదాపు 600 మీటర్లు తవ్వగా, ప్రస్తుతం మిగిలిన పని పూర్తి  చేశారు. అలా తొలి టన్నెల్‌ మొత్తం 18.82 కి.మీ తవ్వకం పూర్తయింది. 


నీటిని తీసుకునేందుకు అనేక ఆటంకాలు

ఇప్పటికే హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణం పూర్తయింది. అక్కడ గేట్లు ఎత్తితే సొరంగం ద్వారా రోజుకు 3వేల క్యూసెక్కులు నీటిని తీసుకోవచ్చు. అయితే టీబీఎంవిడిభాగాలను బయటకు చేర్చడం, టన్నెల్‌ వెలుపల నుంచి ఫీడర్‌ కాలువను ఆనుసంధానం చేయడం, పటు చోట్ల కాలువల మరమ్మతులకు గురికావడం వంటి ఆటంకాలతో నీటిని తక్షణం తీసుకోనే అవకాశం లేకుండా పోయింది. అంతకు మించి నిర్వాసితుల తరలింపులో జరిగిన జాప్యం ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీటిని తీసుకోవడానికి ప్రతిబంధకంగా మారింది. మోత్తం 11 నిర్వాసిత గ్రామాలు ఉండగా ఏడింటిని పూర్తిగా అక్కడి నుంచి తరలిస్తేనే తప్ప రిజర్వాయర్‌లోకి నీటిని తీసుకొనే వీలు లేదు. తక్షణం యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఆ వైపు దృష్టి సారించి ఈ వేసవిలో తరలింపు  ప్రక్రియ పూర్తి చేస్తే కనీసం వచ్చే వరదల సీజన్‌లో అయినా వెలిగొండకు కృష్ణా నీటిని తీసుకొనే వీలుంటుంది.   

Updated Date - 2021-01-16T05:28:46+05:30 IST