వెలిగొండను కేంద్రం గెజిట్‌లో చేర్చాలి

ABN , First Publish Date - 2021-07-28T07:00:52+05:30 IST

జిల్లా ప్రజలకు ప్రాణప్రదమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌లో చేర్చేదాకా అందరం కలిసి పోరాడాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.

వెలిగొండను కేంద్రం గెజిట్‌లో చేర్చాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌

సాగర్‌ జలాల సాధనలో ప్రభుత్వం విఫలం

పార్టీలకతీతంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న 

వివిధ పార్టీల నాయకులు, రైతుసంఘాల ప్రతినిధులు

ఒంగోలు (జడ్పీ), జూలై 27 : జిల్లా ప్రజలకు ప్రాణప్రదమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌లో చేర్చేదాకా అందరం కలిసి పోరాడాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. కృష్ణాజలాలు ప్రకాశం జిల్లా భవిష్యత్‌ అనే అంశంపై స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగా వెలిగొండను గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా ఏడారిగా మారుతుందన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని, ఇదే జరిగితే రానున్న కాలంలో శ్రీశైలం ప్రాజెక్టుకే నీరు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌. నారాయణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మిగులుజలాలను నిలబెట్టుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమవుతుందన్నారు. పోతిరెడ్డిపాడుకు నీరు పోతే ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ జిల్లా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ తెలంగాణ సీఎం తీరు చూస్తుంటే ఆంధ్రను పాకిస్థాన్‌లాగా భావిస్తున్నట్లుందన్నారు. జిల్లాను ఏర్పాటు చేస్తున్నప్పుడే వెనుకబడిన ప్రాంతంగా నాటి ప్రభుత్వం పేర్కొన్నదని, సాగర్‌జలాలను పూర్తిస్థాయిలో ఇచ్చేలా ప్రభుత్వం కృషిచేయాలని సీపీఎం ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి డీవిఎస్‌ స్వామి కోరారు. ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాకు అన్యాయం చేస్తూ జలాలను సీమకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సమావేశంలో ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ దాసరి సుదర్శనం, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏఐకెఎస్‌ జిల్లా నాయకులు కె.వీరారెడ్డి, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, లలితకుమారి, ఎం. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-28T07:00:52+05:30 IST